ప్రతిఘటనకు పుష్కరం

ABN , First Publish Date - 2022-05-28T05:35:11+05:30 IST

ప్రతిఘటనకు పుష్కరం

ప్రతిఘటనకు పుష్కరం
మానుకోట రైల్వేస్టేషన్‌లో 28 మే 2010 నాటి ఘటన దృశ్యాలు

నెత్తుటి జ్ఞాపకం.. మానుకోట రాళ్ల దాడి..

28 మే 2010న రణరంగంగా రైల్వేస్టేషన్‌

స్వరాష్ట్రంలో ఉద్యమకారులకు దక్కని గుర్తింపు


మహబూబాబాద్‌, మే 27 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ ఉద్యమ హోరులో మానుకోట రాళ్ల ఘటన చరిత్రలో నిలిచిపోతుంది. ఘటన జరిగిన 28 మే 2010 నేటితో  పుష్కరం (12 ఏళ్లు). మడిమ తిప్పని ఈ పోరాటస్ఫూర్తిని నేటికి తెలంగాణ చరిత్ర మరువలేదు. అందుకే పుష్కర ఉద్యమ జ్ఞాపకాన్ని మననం చేసుకునేందుకు ‘ఆంధ్రజ్యోతి’ చిరు ప్రయత్నం..


మండుటెండలో ప్రతిఘటన..

సరిగ్గా 12 ఏళ్ల కిందట ఇదే మండుటెండల్లో మానుకోట ప్రతిఘటన చోటు చేసుకుంది. 2010 మే 16న జగన్‌ ఓదార్పు యాత్ర కోసం మానుకోట ద్వారా తెలంగాణలో కాలుమోపుతామని ప్రకటన చేశారు. అయితే పార్లమెంటులో సమైక్యరాష్ట్రానికి మద్దతుగా ప్లకార్డు ప్రదర్శించిన జగన్‌ను తెలంగాణలో కాలు మోపనివ్వమని రాజకీయ జేఏసీతో పాటు టీఆర్‌ఎస్‌, న్యూడెమోక్రసీ, ఓయూ, కేయూ, న్యాయవాద జేఏసీలు ప్రకటించాయి. ఆపై 17న జగన్‌ దిష్టిబొమ్మల దహనంతో ఆరంభమైన ఉద్యమం.. 27 వరకు తీవ్రస్థాయికి చేరుకుంది. జగన్‌ పర్యటనను అడ్డుకోవడానికి మే 28న రాజకీయ జేఏసీ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కోదండరాం, ఢిల్లీ నుంచి బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సభ్యుడు ఎం.రాజేందర్‌, న్యాయవాద జేఏసీ కన్వీనర్‌ నల్లపు ప్రహ్లాద్‌, అప్పటి టీఆర్‌ఎస్‌ నేతలు తన్నీరు హరీ్‌షరావు, ఈటల రాజేందర్‌, బీజేపీ నేత గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, ఓయూ, కేయూ జేఏసీ, న్యూడెమోక్రసీ నేతలు మానుకోటకు చేరారు. జగన్‌ను స్వాగతించేందుకు అప్పటి ఎమ్మెల్యేలు కొండా సురేఖ, మాలోతు కవిత, ఎమ్మెల్సీలు కొండా మురళి, పుల్లా పద్మావతి, మాజీ మంత్రి రెడ్యానాయక్‌, టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి తమ అనుచరులతో మానుకోట రైల్వే స్టేషన్‌ వెయిటింగ్‌ రూంలో మోహరించారు. 


తిరిగబడ్డ రాళ్లు

మానుకోట రైల్వే స్టేషన్‌ సమైక్యవాదులు-తెలంగాణ వాదుల మధ్య సమరానికి వేదికగా మారింది. వెయిటింగ్‌ రూమ్‌లో అంగరక్షకుల రక్షణ మధ్య ఉన్న అప్పటి కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులు, అనుచరులకు తెలంగాణవాదుల నిరసన సెగలు తాకాయి. జై తెలంగాణ నినాదాలతో ఉద్యమకారుల హోరును తట్టుకోలేకపోయిన సమైక్యవాదులు రెచ్చగొట్టారు. బయట పట్టణంలో చుట్టుపక్క నియోజకవర్గాల ప్రజలు ఇసుకవేస్తే రాలని తరహాలో వీధుల్లో నిండిపోయారు. అదే సమయంలో రైల్వేస్టేషన్‌ వెయిటింగ్‌ రూం నుంచి పిస్టల్స్‌ నిప్పులు కక్కాయి. కాంగ్రెస్‌ నేతల అనుచరులు సైతం కట్టెలు, రాళ్లతో తెలంగాణవాదులపైకి దుమికారు. తెలంగాణవాదులు వెనక్కి తగ్గలేదు. పిస్టల్‌ గుళ్లకు ఎదురొడ్డుతూ రైల్వే లైన్‌పై ఉన్న కంకరరాళ్లను తూటాలుగా మలుచుకుని ఎదురుదాడికి దిగారు. దీంతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది. పరస్పర దాడుల్లో అంగరక్షకుల కాల్పులకు 15మంది తెలంగాణ వాదులు, రాళ్ల దెబ్బలతో 25మంది గాయపడ్డారు.


ఉద్యమకారులకు గుర్తింపేది?

తెలంగాణ రాష్ట్రం సిద్ధించి ఎనిమిదేళ్లు పూర్తికావస్తున్నప్పటికీ తెలంగాణ ఉద్యమకారులకు ఎలాంటి ప్రయోజనాలు దక్కలేదు. తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరుల కుటుంబాలు, ఉద్యమంలో నెత్తురోడిన ఉద్యమకారులు, కేసులపాలైన యువకులకు తగిన ప్రాధాన్యత దక్కలేదనే విమర్శలున్నాయి. కాల్పులకు గాయపడ్డ వారిని ఆదుకుంటామన్న ప్రకటనలు 2017లో నెరవేరాయి. తూటాలకు గాయాలపాలైన పదకొండు మందికి రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ఇచ్చి చేతులు దులుపుకుంది. టీఆర్‌ఎ్‌సతో అంటిపెట్టుకుని ఉన్న ఒకరిద్దరికి నామినేటేడ్‌ పదవులు వరించాయి. ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న జేఏసీ నేతలు నేటికీ అధికారపక్షానికి దూరంగానే ఉన్నారు. తెలంగాణ ఉద్యమ ఫలాలు అందరికీ అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఉద్యమం నాటి కేసుల్లో కోర్టుల చుట్టు తిరిగి ఆర్ధికంగా కూడా నష్టపోయామని ఉద్యమకారులు ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. మొత్తనికి దశలవారీగా అన్ని కేసులు కొట్టివేయడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. 


ఉద్యమకారులకు గౌరవం దక్కడం లేదు : నాటి జేఏసీ డివిజన్‌ కన్వీనర్‌ డోలి సత్యనారాయణ  

తెలంగాణ రాష్ట్రలోఓ ఉద్యమకారులకు ఫలాలు అందకపోగా గౌరవం కూడా దక్కడం లేదు. తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వారంతా అధికారం అనుభవిస్తూ ఉద్యమకారులను అణిచివేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ నోట ఉద్యమకారుల మాట వినిపించడం లేదు. నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షల మేరకు పాలన సాగడం లేదు. ఇప్పటికైనా ఉద్యమకారులను గౌరవించి తగిన గుర్తింపునివ్వాలి. 


అమరుల త్యాగాలను గుర్తించని సీఎం కేసీఆర్‌ : బి.విజయసారథి, సీపీఐ జిల్లా కార్యదర్శి, మహబూబాబాద్‌ 

నాలుగున్నర కోట్ల మంది ప్రజలు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమరుల త్యాగాలను గుర్తించడం లేదు. ఎంతో మంది ఆత్మబలిదానాలు చేసుకుంటే కొంతమందినే గుర్తించి చేతులు దులుపుకున్నారు. సీపీఐ జాతీయ పార్టీ అయినప్పటికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తీర్మానం చేసి ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నాం. మానుకోట ఘటనలో సీపీఐ తనవంతు పాత్రను పోషించింది.  

Updated Date - 2022-05-28T05:35:11+05:30 IST