మహాజోరు

ABN , First Publish Date - 2021-11-15T05:49:11+05:30 IST

ఆంధ్రుల ఏకైక రాజధాని అమరావతి పరిరక్షణే ధ్యేయంగా అక్కడి మహిళలు, రైతులు చేపట్టిన ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పాదయాత్ర జిల్లాలో తొమ్మిదో రోజైన ఆదివారం ఉత్సాహంగా సాగింది. పాదయాత్ర కొనసాగే గ్రామాల వారితోపాటు పరిసర ప్రాంతాలు, కొండపి, ఒంగోలు నియోజకవర్గాలకు చెందిన వారు, వివిధ రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాల నేతలు వేలాదిగా తరలివచ్చి సంఘీభావం తెలిపారు.

మహాజోరు
కందులూరులో సాగుతున్న పాదయాత్ర

అమరావతి పాదయాత్రకు 

ఊరూరా ఘనస్వాగతం 

తొమ్మిదో రోజూ అదే ఉత్సాహం

దారిపొడవునా మార్మోగిన నినాదం 

పెద్దఎత్తున సంఘీభావం

వేలాదిగా తరలివచ్చి 

పాల్గొన్న ప్రజానీకం

నేడు కందుకూరు 

నియోజకవర్గంలోకి ప్రవేశం


ఒంగోలు, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి) 

అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర జిల్లాలో మహాజోరుగా సాగుతోంది. ఊరూరా ప్రజానీకం వెల్లువలా తరలివచ్చి నీరాజనం పలుకుతోంది. పాదయాత్ర బృందంతో కలిసి జై అమరావతి అని నినదిస్తోంది. గ్రామాలకు యాత్ర ప్రవేశించే సమయంలో పెద్ద ఎత్తున మహిళలు వచ్చి వారుపోసి, కొబ్బరికాయలు కొట్టి ఘనస్వాగతం పలుకుతున్నారు. అన్నివర్గాల వారూ కలిసికట్టుగా కిలోమీటర్ల దూరం పూలు పరిచి వాటిపై పాదయాత్ర బృందాన్ని నడిపిస్తున్నారు. జిల్లాలో తొమ్మిదోరోజైన ఆదివారం పాదయాత్ర కొండపి నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లోనే సాగగా ప్రజలు ఊళ్లకు ఊళ్లు తరలివచ్చి సంఘీభావం తెలిపారు. 



ఆంధ్రుల ఏకైక రాజధాని అమరావతి పరిరక్షణే ధ్యేయంగా అక్కడి మహిళలు, రైతులు చేపట్టిన ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పాదయాత్ర జిల్లాలో తొమ్మిదో రోజైన ఆదివారం ఉత్సాహంగా సాగింది. పాదయాత్ర కొనసాగే గ్రామాల వారితోపాటు పరిసర ప్రాంతాలు, కొండపి, ఒంగోలు నియోజకవర్గాలకు చెందిన వారు, వివిధ రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాల నేతలు వేలాదిగా తరలివచ్చి సంఘీభావం తెలిపారు. పాదయాత్ర బృందంతో కలిసి అడుగులో అడుగేస్తూ ముందుకు నడిచారు. ఒంగోలు రూరల్‌ మండలం యరజర్లలో రాత్రి బస చేసిన శిబిరం వద్ద నుంచి పాదయాత్ర జేఏసీ నేతలు శివారెడ్డి, తిరుపతిరావు, కొలికపూడి శ్రీనివాసరావు, రాయపాటి శైలజ నేతృత్వంలో 9గంటలకు ప్రారంభమైంది. 

పెద్దఎత్తున సంఘీభావం 

కొండపి నియోజకవర్గంలోని కందులూరుకు చేరుకున్న బృందానికి అక్కడి ఎమ్మెల్యే డాక్టర్‌ డీఎ్‌సబీవీ స్వామి, టీడీపీ యువనేత దామచర్ల సత్య నేతృత్వంలో వేలాది మంది రైతులు, మహిళలు, యువకులు ఘన స్వాగతం పలికారు. దాదాపు కిలోమీటరు దూరం రోడ్లపై పూలు పరిచి వాటిపై నడిపించారు. మార్గమధ్యంలో బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి, గిద్దలూరు మాజీ ఎమ్మెల్యేలు అశోక్‌రెడ్డి, సాయికల్పనారెడ్డి, కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి, టీడీపీ నేతలు నూకసాని బాలాజీ, ఎరిక్షన్‌బాబు, పమిడి రమేష్‌ పాల్గొని వారితో కలిసి నడిచి మద్దతు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో మర్లపాడు చేరుకున్న పాదయాత్ర బృందానికి రైతులు, మహిళలు, దళితవాడ వాసులు, ఇతర వర్గాల వారు వీధుల్లోకి వచ్చి సంఘీభావం తెలపడంతోపాటు వారుపోసి, హారతులు ఇచ్చి, పూలజల్లులతో స్వాగతం పలికారు. అక్కడికి టీడీపీ ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్‌, మాజీ ఎమ్మెల్యే నారాయణరెడ్డి తదితరులు వచ్చి మద్దతు తెలిపి పాదయాత్రలో పాల్గొన్నారు. మర్లపాడు నుంచి నాలుగు గంటలకు తిరిగి ప్రారంభమైన యాత్ర సాయంత్రానికి ఎం. నిడమాలూరుకు చేరుకోగా ప్రజలు ఘన స్వాగతం పలికారు. పాదయాత్ర బృందం రాత్రికి అక్కడ బస చేసింది. 


ఉత్సాహంగా తరలివచ్చిన ప్రజలు 

కొండపి నియోజకవర్గంలోని పలు మండలాల నుంచి ప్రత్యేకించి పాదయాత్ర సాగిన గ్రామాలతోపాటు పరిసరగ్రామాలైన నాయుడుపాలెం, కారుమంచి, కొణిజేడు, పొందూరు, మల్లవరప్పాడు, వల్లూరుతోపాటు ఇతర గ్రామాల నుంచి వందలాది మంది తరలివచ్చి   పదం కలిపారు. ఒంగోలు నగరం, సమీప గ్రామాలకు చెందిన వారు కూడా మర్లపాడు చేరుకొని మద్దతు తెలిపారు. సీపీఎం నేతలతోపాటు పలు ప్రజాసంఘాల  నాయకులు యాత్రలో నడిచారు. వివిధ ప్రాంతాలకు చెందిన వారు భారీగా విరాళాలు ఇచ్చారు. బనగానపల్లె మాజీ ఎమ్మెల్సీ బి.సి.జనార్దన్‌రెడ్డి యాత్ర వద్దకు వచ్చి సంఘీభావం తెలిపి రూ.3 లక్షలు విరాళాన్ని జేఏసీ నేతలకు అందించారు. మార్కాపురం నియోజకవర్గం నుంచి సేకరించిన రూ. 4,01,116 విరాళాన్ని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి జేఏసీ నేతలకు ఇచ్చారు. 


‘పచ్చ’గా సాగిన యాత్ర 

ఒకవైపు రోడ్లకు ఇరువైపులా పచ్చని పొలాలతోపాటు, మరోవైపు యాత్రలో పాల్గొన్న వేలాది మంది చేతిలో ఆకుపచ్చని జెండాలు, మెడలో పచ్చని కండువాలతో మరింత పచ్చదనంగా యాత్ర సాగింది. అన్ని గ్రామాల్లోనూ యువత, చిన్నారులు సైతం ఉత్సాహంగా పాల్గొన్నారు. యాత్ర ప్రారంభం నుంచి రాత్రి బస చేసిన ఎం. నిడమాలూరులోని శిబిరం వరకూ ముందు భాగాన డప్పుల నృత్యాలు, వివిధ దేవతల ప్రతిరూపాలు, విభిన్న వేషధారణలతో కళాకారుల నృత్యాలు, మంగళవాయిద్యాలతో ఉత్సాహంగా ప్రజలంతా నడిచారు. అదే సమయంలో పాదయాత్ర బృందంతోపాటు అందులో పాల్గొంటున్న వారిపైనా దారిపొడవునా పూల వర్షం కురిపించారు. అలా ఆదివారం కొండపి నియోజకవర్గంలో 13 కిలోమీటర్లు యాత్ర సాగింది.


నేడు మహాపాదయాత్ర సాగేదిలా.. 

రాత్రి బస చేసిన టంగుటూరు మండలం నిడమాలూరు నుంచి సోమవారం ఉదయం యాత్ర ప్రారంభం కానుంది.  కె.ఉప్పలపాడు మీదుగా మధ్యాహ్నానికి జరుగుమల్లి మండలం చిరికూరపాడుకు చేరుతుంది. అక్కడ మధ్యాహ్న భోజనం అనంతరం కందుకూరు నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. విక్కిరాలపేటలో యాత్రబృందం రాత్రి బస చేస్తుంది. 





Updated Date - 2021-11-15T05:49:11+05:30 IST