Man hanging by mistake: 28 ఏళ్ల వయసులో చేయని నేరానికి ఉరి తీశారు.. 70 ఏళ్ల తర్వాత నిర్దోషి అని తేలడంతో సారీ చెప్పిన పోలీసులు..!

ABN , First Publish Date - 2022-09-08T18:11:18+05:30 IST

‘నేను హత్య చేయలేదు’ అని గొంతు చించుకుని చెప్పినా నిర్దాక్షిణ్యంగా అతడిని ఉరి తీశారు

Man hanging by mistake: 28 ఏళ్ల వయసులో చేయని నేరానికి ఉరి తీశారు.. 70 ఏళ్ల తర్వాత నిర్దోషి అని తేలడంతో సారీ చెప్పిన పోలీసులు..!


మన మీద ఏదైనా నింద పడితే చాలా బాధపడిపోతాం. తప్పు చేయలేదంటూ నిరూపించుకునే ప్రయత్నం చేస్తాం. తగిన వివరణ ఇస్తూ నిర్ధోషిత్వాన్ని నిరూపించుకునేందుకు అన్ని మార్గాలనూ అన్వేషిస్తాం. ఒకవేళ శిక్ష అనుభవించాల్సి వస్తే చేయని తప్పుకు శిక్ష అనుభవించాల్సి వచ్చిందని కుమిలిపోతాం. ఇపుడు ఈ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. 1952లో మహమూద్ మట్టన్ అనే వ్యక్తి ‘నేను హత్య చేయలేదు’ అని గొంతు చించుకుని చెప్పినా సౌత్ వేల్స్ పోలీసులు వినిపించుకోలేదు. నిర్దాక్షిణ్యంగా అతడిని ఉరి తీశారు. అయితే.. అతని కుటుంబ సభ్యులు చేసిన పోరాటం ఫలితంగా అతను నిర్దోషి అనే విషయం  స్పష్టమయ్యింది. 


ఎవరు మహమూద్

 

మహమూద్ మట్టన్ సోమాలి ప్రాంతంగా పిలువబడే హర్గీసాకు చెందినవారు. రెండవ ప్రపంచ యుద్దం తరువాత యుకేలో కార్డిఫ్ రేవులలో స్థిరపడటానికి విదేశాల నుంచి వచ్చిన వేలాదిమంది నావికులలో ఒకరు. సౌత్ వేల్స్‌కు చేరుకున్న సంవత్సరం తరువాత అదే ప్రాంతానికి చెందిన అమ్మాయి లారాను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. ఇదే వారి జీవితాల్లో సమస్యలు సృష్టించింది. కులాంతర వివాహం చేసుకున్నారనే కారణంతో చుట్టుపక్కల ఉన్న వారు వారిపై ఆంక్షలు విధించారు. అందువల్ల భార్యభర్తలు అయినప్పటికీ ఆ దంపతులు వేరు వేరు ఇళ్లలో ఉండేవారు. 


అతడు చేసిన తప్పేంటి



ఒక రోజు లిల్లీ వాల్ పెర్ట్ అనే మహిళను ఆమె షాపులోనే హత్య చేశాడనే కారణంతో పోలీసులు మహమూద్ మట్టన్‌ను అరెస్ట్ చేశారు. అక్కడున్న బ్రిటీషు వారు అందరూ అతడే ఆ హత్య చేసినట్టు ఆరోపించారు. ఈ కారణంగా 1952 మార్చి 6న ఈ కేసు గురించి పోలీసులు విచారణ మొదలు పెట్టారు. మట్టన్ కేసు విచారణ జరుగుతున్నపుడు అతడి తరఫు న్యాయవాది మట్టన్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగరిక సమాజంలో ఉన్న క్రూరమైన వ్యక్తిగా మట్టన్‌ను అభిర్ణించాడు. దీన్ని బట్టి చూస్తే మట్టన్ తరఫున వాదించిన న్యాయవాది కూడా ఇతర న్యాయవాదులతో కలిసిపోయాడనే విషయం అర్థమవుతుంది. ఈ క్రమంలో కేవలం ఆరు నెలల కాలంలోనే విచారణ పూర్తైంది. 1952 సెప్టెంబర్ 3న మహమూద్‌కు ఉరిశిక్ష వేయాలని నిర్ణయించారు. ఉరి తీసే సమయంలో తలారి కూడా మట్టన్ పట్ల కర్కశంగా వ్యవహరించాడు.


ఉరి శిక్ష తరువాత....


మహమూద్ మట్టన్‌ను ఉరి తీసే విషయాన్ని అతడి కుటుంబ సభ్యులకు అస్సలు తెలియదు. అందువల్ల మట్టన్ చనిపోయిన విషయం మొదట అతడి కుటుంబ సభ్యులెవరకీ తెలియదు. మట్టన్ ఇంటికి చాలా దగ్గరలోనే జైలు ఉండటంతో అతని భార్య తరచుగా వెళ్లి చూసి వస్తుండేది. ఒకరోజు ఎప్పటిలాగే ఆమె మట్టన్‌ను చూసిరావడానికి వెళ్లగా జైలు గది తలుపునకు ఓ నోటీసును గుర్తించింది. మట్టన్ ఉరితీసినట్టు ఆ నోటీసులో రాసి ఉండటాన్ని చూసి షాకైంది. ఈ విషయం కుటుంబ సభ్యులందరినీ తీవ్రంగా కలచివేసింది. 

ఈ క్రమంలోనే ఎంత వరకైనా పోరాడి అసలు నిజాన్ని వెలుగులోకి తీసుకురావాలనే పట్టుదల వారిలో పెరిగింది.


మట్టన్ కుటుంబం


మహమూద్ మట్టన్ భార్య పేరు లారా. వీరికి డేవిడ్, ఒమర్, మెర్విన్ అనే ముగ్గరు కొడుకులున్నారు. మహమూద్ మట్టన్‌కు మొత్తం ఆరుమంది మనవరాళ్లు, ఒక మనవడు ఉన్నారు.


న్యాయం కోసం పోరాటం


మట్టన్ కొడుకులు ముగ్గరూ తమ తండ్రికి జరిగిన అన్యాయం మీద పోరాడటానికే తమ జీవితాన్ని వెచ్చించారు. ఎంతో మంది న్యాయవాదులను, సామాజిక కార్యకర్తలను కలిసి ‘మా నాన్న నిర్దోషి, ఆయన తప్పు చేయలేదు, దయచేసి మాకు మద్దతు ఇవ్వండి’ అని వేడుకున్నారు. కానీ వారికి మొదట ఆశించిన మద్దతు లభించలేదు. అయినా వాళ్లు తమ ప్రయత్నాన్ని ఆపలేదు. సంవత్సరాలు గడిచిపోతున్న తరుణంలో మట్టన్ కుటుంబానికి సపోర్ట్ గా ఉండటానికి కొందరు న్యాయవాదులు ముందుకొచ్చారు. అంతేకాకుండా మట్టన్ ఉరి శిక్ష గురించి, అతడి కుటుంబ సభ్యులు చేస్తున్న పోరాటం గురించి తెలుసుకున్న ప్రముఖ మానవహక్కుల న్యాయవాది మైఖెల్ మాన్స్ ఫీల్డ్ మట్టన్ కుటుంబానికి మద్దతుగా నిలిచి వారి తరపున వాదించారు.


అసలు లిల్లీ వాల్ పెర్ట్ ఎలా చనిపోయిందంటే..


వాస్తవానికి 41ఏళ్ల లిల్లీ వాల్ పెర్ట్ హత్మహత్య చేసుకుని మరణించారు. లిల్లీ వాల్ పెర్ట్ తన గదిలో గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె చనిపోయిన కొన్ని నిమిషాలకే హంతకుడు ఇతడే అంటూ మహమూద్ మట్టన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కనీసం ఇంగ్లీషు సరిగ్గా మాట్లాడటం రాని మట్టర్‌ను సరిగా విచారించకుండానే.. అతడే హంతకుడని పోలీసులు నిర్ణయించేశారు. దీన్ని బట్టి చూస్తే అక్కడి న్యాయవ్యవస్థ అందరికీ సమానం లేదు అనే విషయం స్పష్టమవుతుంది. 


నిజం ఎలా బయటపడింది


ఈ కేసులో ఎలాంటి ఫోరెన్సిక్ ఆధారాలు కానీ, సాక్ష్యాలు కానీ లేవు. హత్య జరిగిందనే విషయాన్ని నిరూపించడానికి ప్రత్యక్ష సాక్ష్యులు ఎవరూ లేరు. ఈ క్రమంలో ఎలాంటి సాక్ష్యాలు లేకపోయినా మట్టన్‌కు ఉరి శిక్ష విధించడం ఖచ్చితంగా జాత్యాహంకారమేనని అతడి కుటుంబానికి సపోర్ట్‌గా వాదించిన న్యాయవాదులు వాదించారు. ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది మైఖెల్ మాన్స్ ఫీల్డ్ "నల్లజాతీయుల జీవన పోరాటానికి వారి హక్కులను వారు పొందేలా చేయడానికి ఈ కేసు తప్పకుండా ఉపయోగపడుతుంది. బ్రిటీషు దేశాలలో తెల్లవారు తప్ప నల్లజాతివారు సురక్షితంగా లేరు. వారు చాలా అద్వానమైన స్థితిలో ఉన్నారు. మట్టన్‌కు చాలా అన్యాయం జరిగింది. మట్టన్ సోమాలి దేశానికి చెందినవాడు. సౌత్ వేల్స్ ప్రజలు సోమాలీలను చొరబాటు దారులుగా బావిస్తారు. తమ దేశంలోకి వచ్చి ఉద్యోగాలు, ఇళ్లు, సామాజిక వ్యవస్థ మొదలయిన వాటిని లాక్కుంటారనే ఆలోచనలో సౌత్ వేల్స్ ప్రజలు ఉంటారు. అందుకే సోమాలీలను ఎప్పుడూ తరిమెయ్యాలని ప్రయత్నిస్తూ ఉంటారు. వారి విషయంలో కఠినంగా ప్రవర్తిస్తారు. అందువల్లే ఏ తప్పు చేయకపోయినా మట్టన్‌కు ఉరి శిక్ష విధించారు’ అంటూ కోర్టులో గట్టిగా వాదనలు వినిపించారు. దీంతో న్యాయస్థానం మట్టన్ కేసుకు సంబంధించిన వివవరాలను క్షుణ్ణంగా పరిశీలించింది. ఈ నేపథ్యంలోనే పోలీసుల వైఫల్యం బయటపడింది. ఈ కేసు విషయంలో తప్పు చేశామని, విచారణ సరిగా చేయలేకపోయామని సౌత్ వేల్స్ పోలీసులు ఒప్పుకున్నారు.  కోర్టు ఆదేశాలతో నిజాలు బయట పెట్టేందుకు చీఫ్ కానిస్టేబుల్ హెడ్ గా వ్యవహరించిన జెరెమి వాఘన్ అప్పటి కాలానికి జాత్యాహంకారం, పక్షపాతం, వివక్షత మొదలయినవి సమాజంలోనే కాకుండా న్యాయవ్యవస్థలో కూడా అధికంగా ఉండేవి.  ఆ కారణం వల్లనే న్యాయవిచారణ సరిగా జరగలేదు అని తెలిపారు.


కుటుంబ సభ్యులు ఎదుర్కొన్న ఇబ్బందులు


మట్టన్ రెండో కొడుకు అయిన ఒమర్ ఒకసారి గతాన్ని గుర్తు చేసుకుంటూ ‘మా నాన్నను ఉరి తీసినప్పుడు నాకు ఎనిమిది సంవత్సరాలు, అప్పుడు నా తలలో క్యాన్సర్ కణితి పెరుగుతూ ఉండేది’ అని చెప్పారు. చిన్నతనంలో జరిగిన విషయాలు ఒమర్ ను చాలా ప్రభావితం చేశాయని.. అతణ్ణి కోపస్వభావం కలిగిన వ్యక్తిగా మార్చేశాయని ఒమర్ కూతురు తాన్యా మట్టన్ తెలిపింది. తండ్రి కోసం పోరాడుతూ తన ఒమర్ తన 53ఏళ్ల వయసులో ప్రాణాలు విడిచినట్టు వెల్లడించింది. మహమూద్ మట్టన్ మనవడి (మూడవ కొడుకు మెర్విన్‌ కుమారుడు) పేరు కిర్స్టీ. ఇతడు జరిగిన విషయాల గురించి మాట్లాడినపుడు "మా తాతయ్య ఏ తప్పూ చేయలేదని నిరూపించడానికి మా తల్లిదండ్రులు 48 ఏళ్ళు పోరాటం చేశారు. ఈ కేసు కేవలం ఒక వ్యక్తికి మరణ శిక్ష పడటం, ప్రాణాలు పోవడం గురించి మాత్రమే కాదు. ముగ్గరు కొడుకులు తమ తండ్రి హంతకుడు అనే నిందను మోశారు. సమాజం నుంచి ఎంతో వివక్షత మరెన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. అవన్నీ మా తల్లిదండ్రులను మానసికంగా బాధించాయి. మానసిక ప్రశాంతత కోసం మద్యానికి బానిసలు కావాల్సి వచ్చింది. ఫలితంగా అందరి జీవితాలో ఇబ్బందులు తలెత్తాయి. చివరికి ఆరోగ్యాలు పాడవటంతో వాళ్లు మరణించారు" అని వాపోయాడు. 


మట్టన్ మనవరాలు తాన్యా మట్టన్ మాట్లాడుతూ.. "ఈ సంఘటనలు జరిగినపుడు ఇబ్బంది పడినవాళ్ళు ఎవరూ ఇప్పుడు బ్రతికిలేరు. పోలీసులు దొంగ నాటకం ఆడారు" అని పేర్కొంది. కాగా.. 2001లో మట్టన్ కుటుంబానికి పరిహారం లభించింది. అంతేకాకుండా చేసిన తప్పుకు పోలీసులు సుమారు 70ఏళ్ల తర్వాత మట్టన్ కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెప్పారు. పోలీసు చీఫ్ వాఘన్ మాట్లాడుతూ "ఇప్పటికి కూడా జాత్యాహంకారం, వివక్షత, పక్షపాతం మొదలయినవి సమాజం నుండి న్యాయవ్యవస్థ నుండి తొలగించడానికి మేము కృషి చేస్తూనే ఉన్నాం" అని అన్నారు. అంటే సమాజంలో వేళ్ళూనుకుపోయిన ఈ వివక్షత, పక్షపాతం అనేవి కాలంతో మాత్రమే మారేవి కాదు, మనుషుల ఆలోచనల్లో కూడా మార్పు అవసరం. 


మట్టన్ భార్య లారా తన భర్తను గుర్తుచేసుకుంటూ "అతను సోమాలి అయినా నన్ను పెళ్ళిచేసుకోవడం వల్ల మేము బ్రిటీషు సోమాలిగా మారాము. అతను అందరిని ప్రేమించాడు. అతనిలో ద్వేషమనేది ఏమాత్రం లేదు. అందరూ అలాగే ఉంటారని, అంతా మంచివారేనని అనుకున్నాడు. కానీ మా చుట్టూ శత్రువులు తయారయ్యారు. చివరకు మనిషినే అంతం చేశారు" అని బాధపడింది.

Updated Date - 2022-09-08T18:11:18+05:30 IST