Mahanadu గ్రాండ్ సక్సెస్ ఎవరిది..?

ABN , First Publish Date - 2022-05-30T18:17:48+05:30 IST

మహానాడు గ్రాండ్ సక్సెస్ ఎవరిది? ఈ మహానాడుతో లోకేష్ అసలైన ముద్ర వేసుకున్నారా?

Mahanadu గ్రాండ్ సక్సెస్ ఎవరిది..?

Amaravathi: మహానాడు గ్రాండ్ సక్సెస్ (Grand Success) ఎవరిది? ఈ మహానాడుతో లోకేష్ (Lokesh) అసలైన ముద్ర వేసుకున్నారా? ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క అన్నట్లుగా లోకేష్ ఉండబోతున్నారా? టీడీపీ మహానాడు గ్రాండ్ సక్సెస్.. అధికార పార్టీ కలవరపడేలా సొంత పక్షంలో నేతలు సయితం యాక్టివ్ అయ్యేలా మహానాడు పెద్ద మెసేజ్‌నే పంపింది. టీడీపీకి మహానాడు కొత్త కాకపోయినా ఈ మహానాడు అత్యంత కీలకం. దీంతో మహనాడు నిర్వహించే ప్రాంతం నుంచి తీర్మానాల వరకు ప్రతి అంశంలో చాలా వ్యూహాత్మకంగా పార్టీ పెద్దలు వ్యవహరించారు. ముఖ్యంగా ఈ మహానాడులో అడుగడుగునా లోకేష్ మార్క్ కనిపించింది. అధినేతను ఒప్పించడం నుంచి నేతలను సమన్వయం పరచడం వరకు తెరవెనుక కృషి అద్భుత ఫలితాన్ని ఇచ్చింది.


మహానాడు అంటే విజయవాడ, తిరుపతి, వైజాగ్, రాజమండ్రి వంటి ప్రాంతాలే గుర్తుకువస్తాయి. కానీ ఈసారి వినూత్నంగా ఒంగోలును ఎంపిక చేశారు. దీని వెనుక లోకేష్ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. ఎప్పుడూ మహానాడు చేసే ప్రాంతం కాకుండా కొత్త ప్రాంతంలో కొత్తగా ప్రజలకు కనెక్టు అయ్యేలా మహానాడు ఉండాలని భావించారు. వాస్తవానికి చాలా రోజులుగా ప్రకాశం జిల్లా నేతలు కలిసికట్టుగా చేస్తున్న కార్యక్రమాలు కూడా మంచి ఫలితాన్ని ఇస్తున్నాయి. దీంతో ఒంగోలులో మహానాడు నిర్వహిస్తే మంచి సక్సెస్ అవుతుందని లోకేష్ భావించారు. రాజకీయంగా ఇన్ఫాక్ట్‌తోపాటు కొత్తదనం వచ్చేలా చేసేందుకు ప్రయత్నించారు. అందులో లోకేష్ సక్సెస్ అయ్యారు. వసతి ఏర్పాట్ల విషయంలో పార్టీలోని కొందరు అనుమానాలు లేవనెత్తినా.. లోకేష్ ఈ విషయంలో అధినేతను ఒప్పించారు. దీంతో మొదటిసారి టీడీపీ మహానాడు ఒంగోలు వేదిక అయింది. మారుతున్న కాలానికి అనుగుణంగా మహానాడు నిర్వహణ ఉండాలనేది లోకేష్ ఆలోచన. అందులో భాగంగానే మూడు రోజుల మహానాడును రెండు రోజులకు కుదించారు. అది కూడా తొలిరోజు ప్రతినిధుల సభతో సరిపెట్టారు. రెండో రోజు భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఇది అనుకున్నదానికంటే మంచి ఫలితాన్ని ఇచ్చింది. వివిధ జిల్లాల నుంచి వేలాదిగా జనం తరలిరావడంతో మహానాడు మహాసభకు లక్షల మంది పోటెత్తారు.

Updated Date - 2022-05-30T18:17:48+05:30 IST