పసుపు పండగొచ్చె

ABN , First Publish Date - 2022-05-26T05:32:55+05:30 IST

ఒంగోలు సమీపంలో గల మండవవారిపాలెంలో జరిగే మహానాడు 27, 28 తేదీల్లో జరగనున్నది. తొలిరోజు ప్రతినిధుల సభ, రెండో రోజు సాయంత్రం భారీ బహిరంగ సభ నిర్వహించనుండగా అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

పసుపు పండగొచ్చె

తుదిదశకు చేరిన ఏర్పాట్లు

రేపు, ఎల్లుండి టీడీపీ మహానాడు

నేడు అధినేత చంద్రబాబునాయుడి రాక 

 మహా పండుగ.. ఒంగోలు వేదికగా పసుపు పండగ వాతావరణం నెలకొంది. ఒంగోలు సమీపంలోని మండవవారిపాలెంలో ఏర్పాటు చేసిన వేదిక పరిసరాలు, ఆ మార్గంలోని రహదారులు ఇప్పటికే పసుపుమయంగా మారాయి. తోరణాలు, ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లతో ఆయా ప్రాంతాలను  అలంకరించారు. మహానాడు విజయవంతానికి నాయకులు ఓ వైపు ప్రణాళికలు రూపొందిస్తుండగా.. కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంగా తరలివచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మహానాడు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. మహానాడును ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని టీడీపీ నాయకులు నిర్ణయించి ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇతర ముఖ్యనేతలు షెడ్యూల్‌ కన్నా ఒకరోజు ముందుగానే ఒంగోలుకు రానున్నారు.


ఒంగోలు, మే 25 (ఆంధ్రజ్యోతి): ఒంగోలు సమీపంలో గల మండవవారిపాలెంలో జరిగే మహానాడు 27, 28 తేదీల్లో జరగనున్నది. తొలిరోజు ప్రతినిధుల సభ, రెండో రోజు సాయంత్రం భారీ బహిరంగ సభ నిర్వహించనుండగా అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వారం రోజులకుపైగా ఏర్పాట్లు జరుగుతుండగా బుధవారం నాటికి అవి తుదిదశకు చేరుకున్నాయి.  ప్రాంగణంలో జరుగుతున్న పనులను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు బీదా రవిచంద్ర, బీసీ జనార్థన్‌రెడ్డి, టీడీ జనార్థన్‌, ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్‌, ఏలూరి సాంబశివరావు, డాక్టర్‌ స్వామి, మాజీ ఎమ్మెల్యేలు పోతుల రామారావు, ఉగ్రనరసింహారెడ్డి, ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి దామచర్ల సత్య, నియోజకవర్గ ఇన్‌చార్జిలు ఇంటూరి నాగేశ్వరరావు, ఎంఎం కొండయ్య తదితరులు బుధవారం ఏర్పాట్లను పరిశీలించారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిలు బుధవారం ఉదయం మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్‌తో కలిసి మహానాడు ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలించారు.


నేడు ఒంగోలుకు చంద్రబాబు

తొలుత చంద్రబాబునాయుడు 27న ఉదయం ఒంగోలు వచ్చి  మహానాడులో పాల్గొనాల్సి ఉంది. అయితే ఆయన పర్యటనను ఒకరోజు ముందుకు మార్చారు. తాజా షెడ్యూల్‌ ప్రకారం 26న మధ్యాహ్నానికే ఒంగోలు రానున్నారు. ఉదయం 11.30కు మంగళగిరిలోని కేంద్ర కార్యాలయం వద్ద నుంచి బయలుదేరే ఆయన 2.30కు నేరుగా ఒంగోలులోని హోటల్‌ సరోవర్‌కు చేరుకుంటారు. అనంతరం అక్కడ టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశంలో పాల్గొని రాత్రికి ఎన్నెస్పీ అతిథిగృహంలో బస చేస్తారు. పొలిట్‌ బ్యూరో సమావేశం ఒంగోలులో జరగనున్న నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్‌తో పాటు ముఖ్యనేతలందరూ గురువారమే ఒంగోలు రానున్నారు. ఒకరోజు ముందు ఒంగోలు వస్తున్న చంద్రబాబుకు ఘనస్వాగతం పలికేందుకు నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. 


ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా చర్యలు

మహానాడుకు వచ్చే వాహనాలు ఎలాంటి ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. శాంతిభద్రతలకు భంగం కలగకుండా, ఎలాంటి అవంతరాలు ఎదురుకాకుండా ఉండేందుకు 500మంది పోలీసులను వినియోగిస్తున్నారు. ఏఎస్పీ నేతృత్వంలో ఒంగోలు డీఎస్పీ, ట్రాఫిక్‌ డీఎస్పీ, తాలుకా సీఐలు కలిసి సమీక్ష నిర్వహించారు. ట్రాఫిక్‌ పాయింట్లను గుర్తించారు. మహానాడు ప్రాంగణంలో పార్కింగ్‌ ఏరియాలను గుర్తించారు. 


 బాపట్ల జిల్లా నుంచి.. భారీగా

40,000 మందికి పైగా హాజరయ్యే అవకాశం

బాపట్ల(ఆంధ్రజ్యోతి): మహానాడుకు జిల్లాలోని టీడీపీ శ్రేణులు భారీసంఖ్యలో హాజరుకావడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో సన్నాహక సభలు, సమావేశాలతో నేతలు కార్యకర్తలను సమాయత్తపరుస్తున్నారు. జిల్లా నుంచి దాదాపు 40,000 మందికి పైగానే పసుపు సైన్యం  28న జరిగే బహిరంగ సభకు హాజరవుతారని అంచనా. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా మహానాడుకు హాజరై తీరతామని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి.


అడ్డుకోవాలని చూడడం అవివేకం 

నిబంధనల ప్రకారం నగదు చెల్లించినా బస్సులు ఇవ్వడానికి ఆర్టీసీ నిరాకరిస్తుందని బాపట్ల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి వేగేశన నరేంద్రవర్మ తెలిపారు. ఇలాంటి ఎత్తుగడలతో మహానాడును అడ్డుకోవాలని చూడడం అవివేకమన్నారు.   ప్రైవేటు ట్రావెల్స్‌ యాజమాన్యాల నుంచి కూడా సహకారం అందకుండా ప్రభుత్వం చూస్తోందన్నారు.   ప్రభుత్వం అవాంతరాలు సృష్టిస్తుండటంతో పొరుగునే ఉన్న ఒంగోలులో జరిగే కార్యక్రమాలకు ఎవరికి వారే సొంత వాహనాలు లేదా రైలు, ఇతర మార్గాల ద్వారా వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.


పర్చూరు, అద్దంకి, చీరాల నుంచి భారీగా

పర్చూరు, అద్దంకి, చీరాల నియోజకవర్గాలు ప్రస్తుతం బాపట్ల పరిధిలోకి వచ్చినా గతంలో ఒంగోలు జిల్లాతో ఉన్న అనుబంధం దృష్ట్యా ఒంగోలులో జరిగే మహానాడుకు పార్టీ శ్రేణులు భారీసంఖ్యలో హాజరుకానున్నారని సమాచారం. ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్‌, ఏలూరి సాంబశివరావు, చీరాల ఇన్‌చార్జి ఎంఎం కొండయ్యలు మహానాడు ఏర్పాట్లలో చురుకుగా పాల్గొనడంతో పాటు శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. 

 

Updated Date - 2022-05-26T05:32:55+05:30 IST