అనూహ్య ముగింపు

ABN , First Publish Date - 2022-07-01T07:23:25+05:30 IST

మహారాష్ట్ర ముఖ్యమంత్రి కుర్చీలో ఏక్‌నాథ్ షిండే కూర్చుంటాడని ఎవరూ ఊహించలేదు.

అనూహ్య ముగింపు

మహారాష్ట్ర ముఖ్యమంత్రి కుర్చీలో ఏక్‌నాథ్ షిండే కూర్చుంటాడని ఎవరూ ఊహించలేదు. దేవేంద్ర ఫడణవీస్‌ నోట సీఎంగా షిండే పేరు వినబడినప్పుడు దేశం ఆశ్చర్యపోయింది. గోవా హోటల్‌లో మకాం వేసి ఉన్న షిండే వర్గం ఎమ్మెల్యేలు సైతం ఆశ్చర్యానందాలతో గెంతులు వేసిన దృశ్యాలు చానెళ్ళలో ప్రసారమైనాయి. రాత్రి 7గంటలకు ఫడణవీస్‌ ముఖ్యమంత్రిగా, షిండే ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని అంతా అనుకుంటున్న దశలో మరో ఆశ్చర్యకరమైన పరిణామం ఫడణవీస్‌ తాను ఏ పదవీ చేపట్టనని ప్రకటించడం. తన సంపూర్ణ సహకారంతో షిండే రాష్ట్రాన్ని ఏలుకుంటాడని ఆయన ప్రకటించగానే, ‌నా మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయను అని షిండే వెంటనే హామీ ఇచ్చారుకూడా. కానీ, రెండుగంటల్లో కథ తారుమారై, పదిరోజులుగా అందరూ అనుకుంటున్నదానికి భిన్నంగా, ఉభయుల స్థానాలూ తారుమారై ప్రమాణస్వీకారాలు జరిగిపోయాయి. అధికారదాహంతో అలమటించిపోతున్న భారతీయ జనతాపార్టీ, చక్కని శివసేనలో చిచ్చురాజేసి, బాల్ ఠాక్రే కుమారుడినే అవమానకరంగా దింపివేసిందన్న అప్రదిష్టను ఈ చర్యతో ఎంతోకొంత తుడిపేసుకోవచ్చునని బీజేపీ అనుకున్నదేమో. 


షిండే వర్గం ఇంతగా బలపడటానికి సీఎం పోస్టు హామీ ఆయనకు ఎప్పుడో దక్కడమేనని అంటున్నవారూ ఉన్నారు. తాను ఏ పదవిలోనూ ఉండననీ, షిండే సీఎంగా ప్రమాణం చేసిన తరువాత శివసేన, దాని మిత్రులు, ఇండిపెండెంట్లు, బీజేపీ నుంచి మంత్రుల ఎంపిక జరుగుతుందని ఫడణవీస్‌ ప్రకటించారు. మీ త్యాగం అద్భుతం, మీరు నికార్సయిన బీజేపీ కార్యకర్త అని ఫడణవీస్‌‌ను పొగిడిన నడ్డా మంత్రివర్గంలో మీరూ భాగస్వామిగా ఉండాల్సిందేనని మీడియాతో మాట్లాడుతూ అభ్యర్థించడం, మరో అరగంటలో అమిత్ షా దానిని నిర్థారించడం, పెద్దల ఆదేశాన్ని శిరసావహిస్తున్నట్టు ప్రకటించి ఫడణవీస్‌ ప్రమాణస్వీకారం చేయడం త్వరితంగా జరిగిపోయాయి. గత పదిరోజులుగా, ఇంకా చెప్పాలంటే రాజ్యసభ ఎన్నికలూ ఎమ్మెల్సీ ఎన్నికల కాలం నుంచే కుట్రలూ ఎత్తులూ వేస్తూ అంతిమంగా శివసేనను చీల్చడంలో ప్రధానభూమిక పోషించిన ఈ రెండు పర్యాయాల ముఖ్యమంత్రి ఇలా షిండే డిప్యూటీగా కొత్త అవతారం ధరించడానికి సిద్ధపడటం విశేషమే. ఫడణవీస్‌‌కు ఈ ప్రతిపాదన ఏమాత్రం ఇష్టంలేదని ఆయన మొఖమే చెబుతోంది. 


ముప్పైతొమ్మిది మంది ఎమ్మెల్యేలున్న షిండేవర్గం బీజేపీతో పోల్చితే బాగా చిన్నది. కానీ, షిండేను సీఎం చేయడం ఠాక్రే పక్షాన మిగిలిన పదిహేను మందినీ ప్రభావితం చేయడానికీ, వీలైతే లాక్కోవడానికీ, మొత్తంగా శివసేనపై ఠాక్రే ప్రభావాన్ని బలహీనపరచడానికీ ఉపకరించవచ్చు. బీజేపీది అధికారదాహం, నేను తప్పుకుంటే ఒక శివసైనికుడు సీఎం అవుతాడా? అని వారం క్రితం ఠాక్రే విసిరిన సవాలుకు ఇది సమాధానం కూడా. రిక్షావాళ్ళనూ, ఆటోడ్రైవర్లను  మంత్రులను చేశామని ఠాక్రే చెప్పుకుంటే, ఆ ఆటోడ్రైవర్‌ను ఏకంగా సీఎం చేశామని బీజేపీ చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇది షిండే నాయకత్వంలోని శివసేన ప్రభుత్వమనీ, ఆ పార్టీ అంతర్గత సంక్షోభం వల్ల మాత్రమే అధికారమార్పిడి జరిగిందన్న సందేశం బీజేపీ ఇవ్వదల్చుకుంది. పార్టీ మొత్తాన్ని ఠాక్రేలనుంచి స్వాధీనం చేసుకోవడానికి సీఎం కుర్చీ షిండేకు ఏ మేరకు ఉపకరిస్తుందన్నది అటుంచితే, ఒక సుదీర్ఘ న్యాయవివాదం ముందున్నందున చివరకు ఏం తేలుతుందో ఇప్పుడే చెప్పలేం. అలాగే, షిండే తనవర్గాన్ని ఇంతేబలంగా ఎంతకాలం నిలబెట్టగలరో తెలియదు.


అంతిమంగా బాలాసాహెబ్ రాజకీయ వారసులు ఎవరో నిర్ణయించేది ప్రజలే. ఆఖరునిముషంలో రెండునగరాల పేర్లు మార్చినంత మాత్రాన ఉద్ధవ్ తిరిగి తన పాత అవతరాన్ని ధరించాడని ప్రజలు విశ్వసించకపోవచ్చును కానీ, క్షేత్రస్థాయిలో ఆయనమీద ఎంతోకొంత జాలి ఉండవచ్చు. ఈ ప్రాతిపదికలమీదనే షిండేను ముందుపెట్టి బీజేపీ జాగ్రత్తపడినట్టు కనిపిస్తున్నది. మనది కానిది మనకు ఎప్పుడూ దక్కదనీ, మంచివాళ్ళకు ఇవి రోజులు కావనీ ఉద్ధవ్ పుత్రరత్నం ఆదిత్య గురువారంరాత్రి నిర్వేదంగా వ్యాఖ్యానించారు. కేంద్రప్రభుత్వ ఎజెన్సీల దాడులతో, కేసులతో, హనుమాన్ చాలీసా వంటి మత వివాదాలతో, ధనబలంతో మనది కానిదానిని సైతం దక్కించుకోవడానికి ఎదుటిపక్షం నెలలతరబడి ప్రయత్నిస్తుంటే, చివరకు మహారాష్ట్ర పోలీసుల భద్రతమధ్యనే షిండేవర్గం ఎమ్మెల్యేలు నగరం విడిచిపోతున్నా ఎరుకలేకుండా ఉంటే దానిని మంచితనం అనరని ఈ బాలాసాహెబ్ వారసుడు ఇప్పటికీ గ్రహించినట్టు లేదు.

Updated Date - 2022-07-01T07:23:25+05:30 IST