
ముంబై : మహారాష్ట్ర సంక్షోభం(Maharashtra crisis) వేళ కేంద్ర హోమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా(Amit Shah).. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) ఇంటికి వెళ్లారు. ఈ పరిణామం తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. మహారాష్ట్రలో ఏం జరగబోతోందనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలావుండగా మహారాష్ట్ర విపక్షనేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis) ఢిల్లీ బయలుదేరారు. అమిత్ షా, నడ్డాలతో ఆయన భేటీ కానున్నారని సమాచారం. దీంతో ఉత్కంఠ మరింత పెరిగింది. కాగా మహాకూటమి పక్షాలైన కాంగ్రెస్, ఎన్‌సీపీల నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందనా లేదు. అయితే రెబల్స్ ఎమ్మెల్యేల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నట్టు రిపోర్టులు వెలువడుతుండడంతో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే(Uddav thackerey)తో సమావేశమవ్వాలని ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్(Sharad pawar) నిర్ణయించారు. ఈ మేరకు ఈ మధ్యహ్నాం భేటీ జరిగే అవకాశాలున్నాయని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.
బీజేపీతో జట్టు..
మహారాష్ట్ర సంక్షోభం వేళ ఆసక్తికరమైన ఊహాగానాలు వెలువడుతున్నాయి. గుజరాత్‌లో క్యాంప్ వేసిన మంత్రి ఏక్‌నాథ్ షిండే.. బీజేపీ-శివసేన జట్టు కట్టాలనే డిమాండ్ చేయబోతున్నారని, ఈ మేరకు మధ్యాహ్నం మీడియా సమావేశం ఏర్పాటు చేయవచ్చునని పలు రిపోర్టులు వెలువడుతున్నాయి. ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉందో వేచిచూడాలి.
మా ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర: సంజయ్ రౌత్
శివసేనకు చెందిన 22 మంది ఎమ్మెల్యేలు బీజేపీ పాలిత గుజరాత్‌కు మకాం మార్చడంపై శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్(Sanjay Raut) స్పందించారు. ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్ర జరుగుతోందని వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ మాదిరిగానే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా పడగొట్టాలని చూస్తున్నారని అన్నారు. అయితే శివసేన నమ్మకస్థులతో కూడిన పార్టీ.. ప్రభుత్వాన్ని కూలనీయబోమని వ్యాఖ్యానించారు. ఏక్‌నాథ్ షిండేతో మాట్లాడుతున్నామని, ఆయన తిరిగి మహారాష్ట్రకు వస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా ఈ పరిణామాలపై ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మంగళవారం(ఈ రోజు) కీలక భేటీ ఏర్పాటు చేయనున్నారని సమాచారం.
ఇవి కూడా చదవండి