Maha MLC Polls: మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొనసాగుతున్న ఓటింగ్.. సుప్రీంకు ఇద్దరు ఎన్సీపీ ఎమ్మెల్యేలు

ABN , First Publish Date - 2022-06-20T20:04:43+05:30 IST

మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ (Anil Deshmukh), కేబినెట్ మినిస్టర్ నవాబ్ మాలిక్ (Nawab Malik) సుప్రీం కోర్టును..

Maha MLC Polls: మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొనసాగుతున్న ఓటింగ్.. సుప్రీంకు ఇద్దరు ఎన్సీపీ ఎమ్మెల్యేలు

న్యూఢిల్లీ: మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ (Anil Deshmukh), కేబినెట్ మినిస్టర్ నవాబ్ మాలిక్ (Nawab Malik) సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ ఇద్దరు ఎన్సీపీ ఎమ్మెల్యేలు వేరు వేరు మనీ లాండరింగ్ కేసుల్లో అరెస్ట్ అయి ప్రస్తుతం జైలులో ఉన్నారు. మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల (Maharashtra MLC Polls) నేపథ్యంలో ఎమ్మెల్యేలుగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉందని, అందువల్ల బెయిల్ మంజూరు చేయాలని బాంబే హైకోర్టులో ఈ ఇద్దరూ బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే.. కోర్టు ఇద్దరి బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది. దీంతో.. బాంబే హైకోర్టు బెయిల్‌ను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ ఈ ఇద్దరు ఎన్సీపీ ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. వీరి తరపున వాదిస్తున్న సీనియర్ అడ్వకేట్ మీనాక్షి అరోరా మాట్లాడుతూ.. జస్టిస్ సీటీ రవికుమార్, సుధాన్షు ధూలియా బెంచ్ ముందుకు ఈ పిటిషన్‌ను తీసుకెళ్లి తక్షణ విచారణకు కోరినట్లు తెలిపారు. అయితే.. ఈ పిటిషన్‌పై ఎప్పుడు విచారణ జరపాలన్నది చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నిర్ణయిస్తారని బెంచ్ స్పష్టం చేసిందని మీనాక్షి అరోరా పేర్కొన్నారు. ఇప్పటికే రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే ఉద్దేశంతో బెయిల్ కోరుతూ నవాబ్ మాలిక్, అనిల్ దేశ్‌ముఖ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను PMLA Court తిరస్కరించిన సంగతి తెలిసిందే.



మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ను నవంబర్ 1, 2021న మనీ లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ చేశారు. ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ భీర్ సింగ్ ఈ ఆరోపణలు చేయడంతో విషయం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇక.. నవాబ్ మాలిక్ విషయానికొస్తే.. గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహిం అనుచరులతో కలిసి ఒక ప్రాపర్టీ డీల్ చేసి అక్రమంగా డబ్బు పొందారని, మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారని ఈడీ ఆయనను ఫిబ్రవరి 23న అరెస్ట్ చేసింది. ఇదిలా ఉండగా.. మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేబినెట్ మినిస్టర్ నవాబ్ మాలిక్‌ను తప్పించాలని కోరుతూ సుప్రీం కోర్టులో ఇప్పటికే ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ఇదిలా ఉండగా.. మహారాష్ట్ర శాసన మండలిలో ఖాళీ అయిన 10 ఎమ్మెల్సీ స్థానాలకు సోమవారం ఉదయం ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. ఉదయం 9 గంటలకు మొదలైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గంటలకు ముగుస్తుంది. 10 ఎమ్మెల్సీ స్థానాలకు 11 మంది పోటీలో ఉన్నారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని సాగిస్తున్న శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ఒక్కో పార్టీ నుంచి ఇద్దరి చొప్పున అభ్యర్థులను బరిలో నిలిపింది. మహారాష్ట్రలో ప్రతిపక్ష స్థానంలో ఉన్న బీజేపీ నుంచి ఐదుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు.

Updated Date - 2022-06-20T20:04:43+05:30 IST