Hanuman Chalisa వివాదం: బెయిలు షరతుల ఉల్లంఘన.. రాణా దంపతులపై కోర్టుకు ‘మహా’ ప్రభుత్వం!

ABN , First Publish Date - 2022-05-09T02:49:47+05:30 IST

దేశద్రోహం కేసులో అరెస్టై బెయిలుపై బయటకు వచ్చిన ఎంపీ నవనీత్ రాణా, ఆమె భర్త,

Hanuman Chalisa వివాదం: బెయిలు షరతుల ఉల్లంఘన.. రాణా దంపతులపై కోర్టుకు ‘మహా’ ప్రభుత్వం!

ముంబై:  దేశద్రోహం కేసులో అరెస్టై బెయిలుపై బయటకు వచ్చిన ఎంపీ నవనీత్ రాణా (Navneet Rana), ఆమె భర్త, ఎమ్మెల్యే రవిరాణా (Ravi Rana)పై మహారాష్ట్ర ప్రభుత్వం కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. బెయిలు షరతుల్లో ఒక దానిని ఉల్లంఘించారని పేర్కొంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాణా జంటపై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.


హనుమాన్ చాలీసా పారాయణం కేసుకు సంబంధించి ఎలాంటి విషయాలను నిందితులు మీడియాతో మాట్లాడకూడదని కోర్టు పేర్కొంది. అయితే, ఈ బెయిలు షరతును ఉల్లంఘించిన నవనీత్ రాణా లీలావతి ఆసుపత్రి నుంచి బయటకు వస్తూనే ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేపై విరుచుకుపడ్డారు. ఉద్ధవ్‌కు దమ్ముంటే రాష్ట్రంలో ఏ నియోజకవర్గం నుంచి అయినా తనపై పోటీ చేసి గెలవాలని సవాలు విసిరారు. తనపై పోటీ చేస్తే మహిళా శక్తి ఏపాటిదో చూపిస్తానని అన్నారు.


తాను ఏ తప్పు చేశానని తనను శిక్షించారని థాకరే ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనుకుంటున్నానని అన్నారు. హనుమాన్ చాలీసాను పఠించడం నేరామా? అని ప్రశ్నించాలని అనుకుంటున్నానని అన్నారు. అది నిజంగా నేరమే అయితే తాను 14 రోజులు కాదు కదా, 14  సంవత్సరాలైనా జైలు శిక్ష అనుభవించేందుకు సిద్ధమని అన్నారు. కాగా, బైకుల్లా జైలు నుంచి విడుదలైన తర్వాత హైబీపీ, చాతీ నొప్పి, ఒళ్లు నొప్పులతో నవనీత్ రాణా ఆసుపత్రిలో చేరారు. చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి బయటకు వస్తూ ఆమె ఉద్ధవ్‌కు సవాలు విసిరారు. 

Read more