లఖింపూర్‌లో రైతుల మృతికి నిరసనగా బంద్.. ముంబైలో ఎడారిని తలపించిన రోడ్లు

ABN , First Publish Date - 2021-10-11T21:41:24+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని లఖిపూర్ ఖేరిలో ఈ నెల 3న జరిగిన హింసలో నలుగురు రైతులు సహా 9 మంది మృతికి నిరసనగా మహారాష్ట్రలోని

లఖింపూర్‌లో రైతుల మృతికి నిరసనగా బంద్.. ముంబైలో ఎడారిని తలపించిన రోడ్లు

ముంబై: ఉత్తరప్రదేశ్‌లోని లఖిపూర్ ఖేరిలో ఈ నెల 3న జరిగిన హింసలో నలుగురు రైతులు సహా 9 మంది మృతికి నిరసనగా మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం నేడు రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్‌కు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ), కాంగ్రెస్ పార్టీ ప్రజలకు పిలుపునిచ్చాయి. దీంతో ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఫలితంగా రోడ్లన్నీ బోసిపోయి ఎడారులను తలపించాయి. వ్యాపారులు తమ సంస్థలను మూసివేశారు. బస్సులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి.


బంద్ అర్ధరాత్రి నుంచే ప్రారంభమైందని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ తెలిపారు. నిరసనలో భాగంగా ముంబైలోని రాజ్‌భవన్ బయట మౌనదీక్ష చేపడతామని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోల్ తెలిపారు. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వ బంద్‌కు కిసాన్ సభ మద్దతు ప్రకటించింది. తమ కార్యకర్తలు రాష్ట్రంలో 21 జిల్లాల్లోనూ బంద్‌లో పాల్గొంటారని తెలిపింది. 2 వేలకు పైగా పండ్లు, కూరగాయలు, పూలు, ధాన్యాలు, ఉల్లిపాయలు తదితర వ్యాపారులు సంపూర్ణ మద్దతు ప్రకటించి దుకాణాలు మూసివేశారు. బంద్ ప్రభావం ముంబై, పూణె, ఔరంగాబాద్‌లలో తీవ్రంగా కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Updated Date - 2021-10-11T21:41:24+05:30 IST