Uddhav Thackeray: మహారాష్ట్రలో వేగంగా మారుతున్న పరిణామాలు.. ఉద్ధవ్‌కు మరో శివసేన ఎమ్మెల్యే ఝలక్..

ABN , First Publish Date - 2022-06-28T02:46:20+05:30 IST

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు మరో ఎమ్మెల్యే ఝలక్ ఇచ్చేందుకు సిద్ధపడినట్లు తెలిసింది. ఏక్‌నాథ్ షిండే క్యాంపులో చేరేందుకు..

Uddhav Thackeray: మహారాష్ట్రలో వేగంగా మారుతున్న పరిణామాలు.. ఉద్ధవ్‌కు మరో శివసేన ఎమ్మెల్యే ఝలక్..

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు మరో ఎమ్మెల్యే ఝలక్ ఇచ్చేందుకు సిద్ధపడినట్లు తెలిసింది. ఏక్‌నాథ్ షిండే క్యాంపులో చేరేందుకు మరో ఎమ్మెల్యే సిద్ధపడినట్లు సమాచారం. మంగళవారం ఉదయం షిండే క్యాంపులో ఆ ఎమ్మెల్యే చేరే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. పర్భాని ఎమ్మెల్యే రాహుల్ పాటిల్ ఏక్‌నాథ్ షిండే క్యాంపులో చేరేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. అనర్హత నోటీసులపై రెబల్ ఎమ్మెల్యేలు జూన్ 27 లోపు సమాధానం ఇవ్వాలని డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన గడువును సుప్రీం కోర్టు జులై 11కు పొడిగించడంతో ఉద్ధవ్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ఏక్‌నాథ్ షిండే శిబిరం యోచన చేస్తోంది. ఇందులో భాగంగా ఏక్‌నాథ్ షిండే క్యాంపులోని ఇద్దరు ఎమ్మెల్యేలు గౌహతి నుంచి ముంబైకి వెళ్లి గవర్నర్‌ను కలిసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. గవర్నర్‌ను కలిశాక ఆయన తమ బలాన్ని నిరూపించుకోవాల్సింగా ఉద్ధవ్‌కు తెలిపే అవకాశం లేకపోలేదు. ఈ వారాంతం లోపే బల పరీక్షకు అవకాశమున్నట్లు సమాచారం.



ఇక పోతే.. రెబల్ ఎమ్మెల్యేలు బస చేస్తున్న గౌహతిలోని హోటల్‌లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఆ హోటల్‌లోకి అడ్వకేట్లు, సీనియర్ పోలీస్, అస్సోం ప్రభుత్వంలోని కొందరు అధికారులు మాత్రమే వెళుతున్నారు. మణిపూర్ శివసేన అధ్యక్షుడు ఎం.తోంబీ సింగ్ ఆ హోటల్‌లోని రెబల్ ఎమ్మెల్యేలను కలుసుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆయనను హోటల్‌లోకి అనుమతించలేదు. పార్టీలో చీలికలు తీసుకురావొద్దని తెలిపే ఉద్దేశంతోనే తాను ఇక్కడికి వచ్చానని ఆయన మీడియాకు చెప్పారు. అంతేకాదు.. హోటల్‌లోకి అనుమతించాలంటే లోపలికి వెళ్లే వాళ్లు అక్కడి పోలీసులకు వివరాలు, పేర్లు వెల్లడించాల్సిందేనని తెలిసింది. వాళ్ల పేర్లు, వెహికల్ నంబర్లు రిజిస్ట్రర్‌లో నోట్ చేసుకున్న తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు.

Updated Date - 2022-06-28T02:46:20+05:30 IST