రాజకీయమూ ఓ వ్యాపారమే!

Published: Sat, 25 Jun 2022 03:42:54 ISTfb-iconwhatsapp-icontwitter-icon
రాజకీయమూ ఓ వ్యాపారమే!

షిండేలను మీరు జాగ్రత్తగా గమనించాలి. మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడి ప్రభుత్వంపై తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తుంది శివసేన నాయకుడు ఏక్‌నాథ్ షిండే. పార్టీ నాయకత్వం తనను నిర్లక్ష్యం చేస్తోందని ఆయన ఆగ్రహిస్తున్నారు. ఇలా మనస్తాపానికి గురైన షిండే ఆయనొక్కరేకాదు. బ్రిటిష్ వారు భారతీయ పేర్లను ఆంగ్లీకరణ చేయక ముందు గ్వాలియర్ సింధియాలు కూడా షిండేలే (కీర్తిశేషుడు మాధవరావు సింధియా తన పేరును మరాఠీలో రాసినప్పుడు తనను తాను షిండేగా పిలుచుకునేవారు). మహారాష్ట్రలో ఇప్పుడు ఏక్‌నాథ్ షిండే ఏమి చేశారో 2020లో మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా ఎలియాస్ షిండే కూడా అదే చేశారు. కాంగ్రెస్ నాయకుడయిన జ్యోతిరాదిత్య తన అనుయాయులైన ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ పక్షాన చేరి కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ పతనానికి కారకుడయ్యారు.


మహారాష్ట్ర తిరుగుబాటులో ఎమ్మెల్యేలను హోటళ్లలో ఉంచడం, ఇతర రాష్ట్రాలకు తరలించడం జరగలేదు. డబ్బు ప్రసక్తి లేనే లేదు. జ్యోతిరాదిత్య నికార్సయిన నిజాయతీపరుడు. రెండు తిరుగుబాట్ల మధ్య కొన్ని పోలికలు ఉన్నాయి. తమ తమ పార్టీల నాయకత్వాలు తమకు ఇచ్చిన హమీలను నెరవేర్చలేదని జ్యోతిరాదిత్య, ఏక్‌నాథ్ ఇరువురూ భావించారు. ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వని ప్రభుత్వం నుంచి వైదొలగడం మంచిదని ఇరువురి షిండేలపై అనుయాయులైన ఎమ్మెల్యేలు ఒత్తిడి చేశారు. సైద్ధాంతిక విశ్వాసాలను మార్చుకోవడానికి ఇరువురూ సిద్ధమయ్యారు. అయితే శివసేన నాయకుడు బీజేపీలో చేరడమనేది కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరడం లాంటి పెద్ద మార్పు కాదని మీరు వాదించవచ్చు. జ్యోతిరాదిత్య సింధియా (షిండే) పార్టీ మారిన తరువాత రాజకీయ వైభవాన్ని సముపార్జించుకున్నారు. ఇప్పుడాయన కేంద్ర కేబినెట్ మంత్రి. ఆయన మద్దతుదారులైన ఎమ్మల్యేలు రాష్ట్ర ప్రభుత్వంలో సముచిత పదవులలో ఉన్నారు. బీజేపీలో చేరి మంచి భవిష్యత్తును సమకూర్చుకునేందుకు మరెంతో మందికి జ్యోతిరాదిత్య స్ఫూర్తి అయ్యారనడంలో సందేహం లేదు.


భారత రాజకీయాల ప్రధాన సత్యంగా పరిణమిస్తోన్న ఒక వాస్తవాన్ని ఈ తిరుగుబాట్లు విశదం చేస్తున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు విధిగా ఎన్నికలలో విజయం సాధించడమనేది బీజేపీకి తప్పనిసరి కాదనేదే ఆ సత్యం. మధ్యప్రదేశ్‌లో వలే ఓడిపోయినప్పటికీ,  ప్రలోభాలు, ఒత్తిళ్లతో పాలక పక్షాన్ని చీల్చి, తన సొంత ప్రభుత్వాన్ని ఖాయంగా ఏర్పాటు చేయడం బీజేపీకి సాధారణమైపోయింది. ఇటువంటి ప్రయత్నాలలో బీజేపీ కొన్నిసార్లు విఫలమయింది (రాజస్థాన్‌లో ఇదే జరిగింది). అయితే బీజేపీ తరచు తన ఈ ప్రయత్నాలలో సఫలమవుతూనే ఉంది.


తగిన రుజువులు లేకుండా నిర్దిష్ట ఆరోపణలు చేయడం చాలా కష్టం. షిండేల తరహా తిరుగుబాట్లకు ఎమ్మెల్యేలు మద్దతివ్వడమనేది ధనలాభం కోసమే అన్న అభిప్రాయం ఒకటి రాజకీయవేత్తలలో ఉంది. అయితే ఇది మహారాష్ట్ర విషయంలో రుజువు కాలేదు. భావజాలం గానీ, పాలనపై అసంతృప్తి గానీ ఈ తిరుగుబాట్లకు ప్రేరణ కాదని మీరు విశ్వసించకపోవచ్చు. అయితే ఎమ్మెల్యేల క్రయ విక్రయాలకు వందల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారనే వాస్తవాన్ని మీరు కాదనగలరా? అద్దెకు తీసుకున్న విమానాలలో ఎమ్మెల్యేలను దేశమంతటా తిప్పేందుకు అయ్యే వ్యయాన్ని ఎవరు భరిస్తున్నారు? ఫైవ్‌స్టార్ హోటల్స్,  రిసార్ట్స్‌లో పూర్తి భద్రతా ఏర్పాట్ల మధ్య ఎమ్మెల్యేలను రోజుల తరబడి ఉంచేందుకు ఎంత ఖర్చవుతుందో మీరు ఊహించగలరా? కారణాలు ఏవైనా కావచ్చుగానీ ఇటువంటి ప్రశ్నలను అడగడం జరగడం లేదు. అడిగినప్పటికీ సమాధానాలు రావు గాక రావు.


బీజేపీ అజేయ శక్తి అని ప్రజల్లో ప్రగాఢంగా ఉన్న భావాన్ని షిండేల తరహా తిరుగుబాట్లు మరింత దృఢతరం చేస్తున్నాయి (బీజేపీ ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకోకపోవచ్చు. అయితే మీరు చివరివరకు ఎలాగైనా బీజేపీ పాలనలోనే ఉంటారు మరి). మరింత ముఖ్యమైన విషయమేమిటంటే ఎన్నికల ఫలితాలకు ఎంత తక్కువ ప్రాధాన్యముందో ఓటర్లకు ఈ తిరుగుబాట్లు నిరూపిస్తున్నాయి. మీరు ఒక ప్రతినిధిని ఎన్నుకొన్నప్పుడు మీరు నిజంగా మీ ఆసక్తులు, ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న, తాము విశ్వసిస్తున్నట్టుగా చెప్పుకున్న సిద్ధాంతాలను అమలుపరిచే వ్యక్తిని ఎన్నుకోవడం లేదు. ఎన్నికలలో విజయం ఒక అంకుర సంస్థ (స్టార్టప్) రుణానికి సరిసమానమైనది. మనమిచ్చిన విజయాన్ని కొంత మంది ఎమ్మెల్యేలు ధనసంపాదనకు ఉపయోగించుకుంటున్నారు. తమ సొంత సంపదలను పెంపొందించుకునేందుకు రాజకీయ వ్యాపారులుగా పరిణమిస్తారు. వారికి అపార భాగ్య సంపదలు సమకూరడాన్ని సుసాధ్యం చేసిన మనం, అంటే ఓటర్లం అతి సామాన్యులుగా మిగిలిపోతాం.


ఇది ఓటర్లను నిరాశా నిస్పృహలకు గురిచేస్తోంది. సగటు ప్రజలలో పెరిగిపోతోన్న నిరుత్సాహాన్ని తక్కువగా అంచనావేయడం తగదు కాక తగదు. ఒక రాజకీయపక్షం ఎప్పుడైనాసరే 45 శాతానికి మించిన ఓట్లతో విజయం సాధించడమనేది చాలా చాలా అరుదు (అంతకంటే తక్కువ ఓట్ల శాతంతో వివిధ పార్టీలు విజయాలు సాధించి ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నాయి). అంటే మన ప్రజాస్వామ్యం సక్రమంగా పనిచేసినప్పుడు సైతం, అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు మెజారిటీ ప్రజల మద్దతు అరుదుగా లభిస్తోంది.


గమనార్హమైన విషయమేమిటంటే ప్రభుత్వాలకు మెజారిటీ ప్రజల మద్దతు అరుదుగా ఉండడమనేది పలు పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశాలలో ప్రధాన సమస్యగా లేదు. ఎందుకని? ఆ ప్రభుత్వాలు సమ్మిళిత పాలన నందించేందుకే ప్రయత్నిస్తాయి. తమకు ఓటు వేయని వారితరఫున కూడా అవి పాలనా బాధ్యతలను నిర్వర్తిస్తాయి. తాము చేయదలుచుకున్న వాటినన్నిటినీ చేసేందుకు ప్రజలు తమకు అధికార మిచ్చారనే విశ్వాసంతో ప్రభుత్వాలు వ్యవహరించినప్పుడు సమస్యలు తలెత్తుతాయి.


చట్ట సభలకు ఎన్నికయ్యేందుకై ప్రజలకు హామీ ఇస్తున్నారు. ఎన్నికైన తరువాత ఆ హమీలకు ఇసుమంత ప్రాధాన్యం కూడా ఇవ్వడం లేదు. శాసనసభ్యులు అవడంతోనే కొనదగిన సరుకులుగా మారిపోతున్నారు. ఓటర్లు దేనికి, ఎందుకు ఓటు వేశారన్నది ఎవరికీ పట్టడం లేదు. 1971 సార్వత్రక ఎన్నికలలో ఇందిరాగాంధీ,  ఆమె నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించారు. 1972 శాసనసభా ఎన్నికలలో కూడా ఆమె భారీ విజయాలను సాధించారు. అయితే 1974 నాటికి కాంగ్రెస్ పార్టీ సమస్యల్లో చిక్కుకుంది. అనేక ఎన్నికలల్లో తాను మహా విజయాలను సాధించానని, తాను ఏమి చేయదలుచుకున్నా చేయగలనని ఇందిర విశ్వసించడం ప్రారంభించారు. కేంద్రం, రాష్ట్రాలలోని ప్రభుత్వాల ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు తాము చేయగలిగింది ఏమీ లేదన్న వాస్తవం ప్రజలకు అనుభవంలోకి వచ్చింది. నిరసన తెలిపేందుకు వీథుల్లోకి వచ్చారు. 1975 నాటికి ఇందిర పాలన పట్ల ప్రజా వ్యతిరేకత తీవ్రమయింది. దీని నుంచి తప్పించుకునేందుకే ఆమె అత్యవసర పరిస్థితిని విధించారు. 1977లో దేశ ప్రజలు ఆమెను నిర్ద్వంద్వంగా తిరస్కరించారు.


చరిత్ర సదా పునరావృతమవదు. తమ సమస్యలను రాజకీయ వ్యవస్థ పట్టించుకోవడం లేదన్న సత్యాన్ని ప్రజలు గ్రహించినప్పుడు వారు తప్పక వీథుల్లోకి వస్తారు. చాలాసార్లు తమ అభీష్టాన్ని సాధించుకోవడమూ జరుగుతుంది. ప్రజల నిరసన మూలంగానే జాతీయ పౌర పట్టిక/ పౌరసత్వ సవరణ చట్టం అమలును కేంద్రం నిలిపివేసింది. కొత్త సాగుచట్టాలను అటక ఎక్కించడం అనివార్యమయింది. నిన్నగాక మొన్న నూపుర్‌శర్మ వ్యాఖ్యల మూలంగా బీజేపీ అంతిమంగా తన వైఖరిపై పునరాలోచన చేయక తప్పలేదు. అగ్నిపథ్ పథకంపై నిరసనలు తక్కువగా జరుగుతున్నాయా? పథకాన్ని పూర్తిగా రద్దుచేయకపోవచ్చుకానీ అందులో గణనీయమైన మార్పులు చేయడమనేది అనివార్యమయింది. ప్రజల నిరసనల వల్లే ఇది జరిగింది.


వివిధ అంశాలపై నిర్ణయాలు ప్రకటించే ముందు ప్రజలను విశ్వాసంలోకి తీసుకునే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మనకు ఉన్నట్టయితే ఈ గడబిడలకు ఆస్కారముండేది కాదు. ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ప్రజాభిప్రాయాన్ని మన్నించి,  నిర్ణయాలు తీసుకోవడంలో ప్రభుత్వానికి వివేకవంతమైన సలహాలు ఇవ్వడం జరిగేది. ఇప్పుడలా జరగడం లేదు. ఎన్ని కలు తరచు అసంగతమైపోతున్న పరిస్థితి దిశగా మనం పోతున్నాం. ఎమ్మెల్యేలు ఎటువంటి సంకోచం లేకుండా పార్టీలు మారుతున్నారు. ప్రభుత్వాలను కూలగొడుతున్నారు. ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తున్నారు. గెలిచిన తరువాత ధన సంపాదనకు ఆరాటపడుతున్నారు. డబ్బుతో అన్నీ సాధించుకుంటున్నారు.


మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూలగొట్టడంలో ఏక్‌నాథ్ షిండే విజయం సాధించవచ్చు. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంపై నాకు ప్రత్యేకమైన అభిమానం ఏమీ లేదు దాని సంభావ్య పతనం పట్ల నేను ఒక్క కన్నీటి బిందువును కూడా రాల్చను. ఇది మహారాష్ట్రకు సంబంధించినది మాత్రమే కాదు. అది ఓటర్లు, వారి ప్రతినిధులకు మధ్య సంబంధం గురించినది. ప్రభుత్వాల ప్రజాదరణ గురించి మనం ఎంత గొప్పగా చెప్పుకున్నా ఒక వాస్తవాన్ని మనం అంగీకరించితీరాలి. రాజకీయవేత్తలు, వారిని ఎన్నుకున్న ప్రజల మధ్య సంబంధాలు ఇప్పటికే ప్రమాదకరంగా బలహీనపడ్డాయి. ఆర్థిక ప్రలోభాలకు లోబడి మరికొన్ని ప్రభుత్వాలను కూల్చివేయడం జరిగినా, రాజకీయవేత్తల పట్ల ప్రజల తిరస్కారభావం పెరిగినా ప్రజాస్వామ్యంలో రాజకీయవేత్తలు, ఓటర్ల మధ్య ఉండే సున్నిత సంబంధం పూర్తిగా విచ్ఛిన్నమవుతుంది.


రాజకీయమూ ఓ వ్యాపారమే!

వీర్ సంఘ్వి

సీనియర్ జర్నలిస్ట్

(‘ది ప్రింట్’ సౌజన్యం)

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.