ఆ 3 సందర్భాల్లో తీవ్రంగా చలించిపోయిన మహాత్మాగాంధీ.. 3 కఠిన నిర్ణయాలు తీసుకున్నారు.. అవేమిటో తెలిస్తే..

ABN , First Publish Date - 2021-12-28T14:25:46+05:30 IST

మహాత్మా గాంధీకి సంబంధించిన చాలా ఫోటోలలో ...

ఆ 3 సందర్భాల్లో తీవ్రంగా చలించిపోయిన మహాత్మాగాంధీ.. 3 కఠిన నిర్ణయాలు తీసుకున్నారు.. అవేమిటో తెలిస్తే..

మహాత్మా గాంధీకి సంబంధించిన చాలా ఫోటోలలో ఆయన పంచెకట్టుతోనే కనిపిస్తారు. మహాత్మాగాంధీ నిత్యం పంచెనే ఎందుకు ధరించేవారో తెలుసా? దేశంలో తాండవిస్తున్న పేదరికాన్ని చూసిన మహాత్మాగాంధీ ఎంతో కలత చెందారు. దీనిని దృష్టిలో ఉంచుకున్న ఆయన తన జీవితంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఖరీదైన దుస్తులు ధరించకూడదనే నిర్ణయం కూడా వాటిలో ఒకటి. దీనికి వెనుకగల ఆసక్తికర కథనాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. దక్షిణ ఆఫ్రికాలో వర్ణవివక్ష విధానానికి వ్యతిరేకంగా పోరాడిన మహాత్మా గాంధీ.. కొంతకాలానికి భారతదేశానికి తిరిగి వచ్చారు. బీహార్‌లోని చంపారణ్‌లో రైతుల స్థితిగతుల గురించి తెలుసుకున్న గాంధీజీ వారిని కలుసుకోవాలనుకున్నారు. 


నిమ్న కులాలవారిపై ఆంక్షలను తెలుసుకుని..

1917 ఏప్రిల్ 15న మధ్యాహ్నం 3 గంటలకు మహాత్మాగాంధీ చంపారణ్‌ చేరుకుని, రైతులతో సమావేశమయ్యారు. ఆ ప్రాంతంలోని రైతులు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి విన్న గాంధీ చలించిపోయారు. రైతులు పంటలు పండించడంపై ఆంగ్లేయులు పలు ఆంక్షలు విధించేవారు. ఫలితంగా రైతులు బియ్యం, గోధుమలు వంటి ఆహార ధాన్యాలను పండించలేకపోయేవారు. దీనికితోడు ఆ ప్రాంతంలో తాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస సౌకర్యాలు లేక మహిళలు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఆ ప్రాంతంలోని మహిళల దగ్గర ఒక జత బట్టలు కూడా ఉండేవికాదు. బ్రిటీష్ వారు కొంతమంది మహిళలను లైంగిక బానిసలుగా వాడుకునేవారు. పిల్లలను చదువులకు దూరం చేసి, అధికారుల దగ్గర పని చేయించేవారు. గాంధీజీ చంపారణ్‌కు చేరుకున్న సమయంలో ఆయన చొక్కా, ధోతీ, మణికట్టుపై గడియారం, తలపై టోపీ, పాదాలకు లెదర్ షూ ధరించివున్నారు. అక్కడ పనిచేస్తున్న నిమ్న కులానికి చెందిన వారు పాదరక్షలు వేసుకోకూడదని అధికారులు ఆంక్షలు విధించారు. ఈ విషయం గాంధీజీకి తెలియగానే ఎంతో కలత చెంది, అప్పటినుంచి షూ ధరించకూడదని నిర్ణయించుకున్నారు.


మహిళల దీన స్థితిని గ్రహంచి..

1917, నవంబరు 8న గాంధీజీ రెండవ దశ సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ సమయంలో గాంధీ ఉద్యమంలో పాల్గొనేందుకు మహిళలకు కూడా అవకాశం కల్పించారు. విద్యావంతులైన మహిళల సహకారంతో పాఠశాలను ప్రారంభించారు. మహిళలకు వ్యవసాయం చేయడం, బట్టలు నేయడం లాంటివి నేర్పించారు.  పరిశుభ్రత ప్రాముఖ్యతను తెలియజేశారు. గాంధీ చేపడుతున్న కార్యక్రమాలకు అతని భార్య కస్తూర్బా కూడా సహకారం అందించేవారు. అయితే అక్కడి మహిళలు పేదరికం కారణంగా ఒక వస్త్రంతోనే రోజులు వెళ్లదీసేవారని, దానిని ఉతికితే ఆ సమయంలో ధరించేందుకు వేరే వస్త్రం ఉండేది కాదు. ఈ విషయాన్ని తెలుసుకున్న గాంధీ ఎంతగానో కలత చెందారు. తోటి వారు తీవ్ర ఇబ్బందుకు పడుతున్నప్పుడు తాను ఖరీదైన దుస్తులు ధరించడం భావ్యం కాదనుకున్నారు. అంతే ఆ రోజు నుంచే గాంధీజీ  చొక్కా ధరించడం మానివేశారు.

కార్మికుల అవస్థలను చూసి..

1918లో గాంధీజీ అహ్మదాబాద్‌లో కార్ఖానా కార్మికుల పోరాటంలో పాల్గొన్నారు. ఆ సమయంలో.. తన తలపాగా కోసం ఉపయోగించిన వస్త్రంతో.. కనీసం నలుగురు తమ శరీరాలను కప్పివుంచుకోవచ్చని గ్రహించారు. ఆ క్షణం నుంచే గాంధీజీ ఇకపై తలపాగాను ధరించకూదని నిర్ణయించుకున్నారు.

Updated Date - 2021-12-28T14:25:46+05:30 IST