
సహాయ నిరాకరణోద్యమం దేశమంతటా అహింసాయుతంగా జరుగుతున్న కాలమది. ఉత్తరప్రదేశ్‌లో ‘చౌరీ–చౌరా’ అనే గ్రామంలో సంభవించిన ఒక హింసాత్మక సంఘటనతో గాంధీజీ తన సత్యాగ్రహ కార్యక్రమాన్ని హఠాత్తుగా నిలిపివేశారు. అయినప్పటికీ, గాంధీజీపై రాజద్రోహ నేరం మోపి, దేశంలో హింసను ప్రేరేపించాడన్న కారణంతో ఆయనను నిర్బంధించారు. 1922 మార్చి 18న అహ్మదాబాద్ సెషన్స్ కోర్టులో హాజరుపరచినప్పుడు, జడ్జి ముందు గాంధీజీ ఇచ్చిన వాంగ్మూలం చరిత్రాత్మకమైనది. గాంధీజీ ఆ వాంగ్మూల మిచ్చినప్పుడు టంగుటూరి ప్రకాశం పంతులు ఆ కోర్టు హాల్లోనే ఉండి, విచారణ ప్రక్రియనంతా స్వయంగా తిలకించారు. ఆ చరిత్రాత్మక న్యాయవిచారణ గురించి ప్రకాశం తన ఆత్మకథ ‘నా జీవిత యాత్ర’లో సవివరంగా రాశారు.
‘‘ఆ న్యాయ విచారణ అన్నది ప్రపంచ చరిత్రనే తారుమారు చేసే విధంగా జరిగింది. ఆ కోర్టులో గాంధీగారు ఇచ్చిన వాంగ్మూలం వినేవరకూ ఆయన ఘనత వారి ఆత్మీయులకు కూడా అర్థం కాలేదనే అనుకోవాల్సివుంది. లిఖితపూర్వకంగా దాఖలు చేయబడిన ఆ వాంగ్మూలంలో గాంధీగారు తమను నిర్బంధించిన తీరూ, కేసు విచారణ చేసిన విధమూ అన్నీ పేర్కొంటూ, నిరసనగా తాను చెప్పదలచిన సంగతులనన్నింటినీ అందులో పొందుపరిచారు. ఆ వాంగ్మూలాన్ని గాంధీగారు చదువుతూ వుంటే, ఆయన నోటి నుంచి వచ్చిన ఆనాటి వాక్కులు ఈనాడు కూడా నా చెవులలో మార్మోగుతూనే వున్నాయి. ఆ వాంగ్మూలం సారాంశమిది: ‘ఈ భారతదేశపు నలుమూలల్లోనూ ఈ మధ్య జరిగిన అల్లర్లకూ, చావులకూ, హత్యలకూ నేను స్వయంగా బాధ్యత వహిస్తున్నాను. ఈ సహకార నిరాకరణ ఉద్యమాన్నీ, శాసనధిక్కార ప్రణాళికనూ నడుపుతున్నది నేనే. నా ఉద్యమాల కారణంగా జరిగిన, జరుగుతూన్న కర్మకాండ కంతటికీ నేనే కర్తను. అందువల్ల, నేను పూర్తిగా శిక్షార్హుణ్ణి. మరణశిక్ష విధించినా ఆనందంగా స్వీకరిస్తాను. మీకు యథోచితమని తోచిన శిక్షను మీరు విధించవచ్చును’. ఈ పలుకులు గాంధీగారి నోటి నుంచి వెలువడుతూంటే నాతో పాటు కోర్టు హాలులో కూర్చుని ఆ విచారణను తిలకిస్తున్న యావత్తు జనానికీ, స్త్రీ పురుష తారతమ్యం లేకుండా, కళ్ళ వెంట నీళ్ళు కారాయి. ఆనాడు అక్కడ అలా కూర్చుని కన్నీరు కార్చిన జనంలో ఆంగ్లేయ స్త్రీ పురుషులు కూడా వున్నారు. మానవాతీతులైన దైవాంశ సంభూతులు తప్ప సామాన్యులెవ్వరూ అట్టి వాంగ్మూలమివ్వలేరు’’. గాంధీజీ వాంగ్మూలం ప్రాధాన్యతపై ప్రకాశం అభిప్రాయాలు ఆయనవి మాత్రమే కావు. భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రను గమనించిన పరిశీలకులందరి భావన కూడా అదే.
ఈ వాంగ్మూలాన్ని ఇచ్చే ముందు జడ్జికి గాంధీజీ ఇలా చెప్పారు: ‘అడ్వకేట్ జనరల్ నాపై మోపిన ఆరోపణలన్నింటినీ నేను ఒప్పుకుంటున్నాను. ఆయన నా గురించి చెప్పినదానిలో ఏ మాత్రం అసత్యం లేదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే, నా గురించి ఆయన చెప్పినవన్నీ యథార్థాలే. ఈ ప్రభుత్వం మీద నా దేశ ప్రజల్లో అసంతృప్తిని రగిలించడమనే కోరిక నాలో అత్యంత బలీయంగా వుంది. ఈ విషయంలో అడ్వకేట్ జనరల్‌కి నాపై గల అభిప్రాయం సరైనదే. అయితే, ఆయన చెప్పినట్లు ‘‘యంగ్ ఇండియా’’ పత్రిక మూలంగానే నాలో ఈ ధోరణి ప్రబలలేదు. అంతకుముందు చాలా కాలం నుంచే నాలో ఈ తత్త్వం వుందని చెప్పడానికి నేనేమీ బాధపడటంలేదు’. సత్యం పట్ల తనకు గల ప్రగాఢ నిబద్ధతను ఈ మాటలలో గాంధీజీ తెలియజేశారు. గాంధీజీ ఇక్కడ ప్రధానంగా అహింసకు గల అమేయమైన శక్తిని లోకానికి చాటదలుచుకున్నారు. అంతే బలంగా దుష్టత్వానికి తలవంచలేని తన తెంపరితనాన్ని కూడా తెలియజెప్పదలచుకున్నారు. దేశ ప్రజలు, కొందరు ప్రముఖ నాయకులు హింసామార్గంలోనైనా సరే స్వాతంత్ర్యాన్ని సాధిద్దామనే ఆలోచన తనకెంత మాత్రమూ సమ్మతం కాదని కూడా తెలియజేయదలచుకున్నారు. హింసాత్మక పోరాటం ద్వారానే అమెరికా స్వాతంత్ర్యాన్ని పొందింది. హైతీ కూడ హింస ద్వారానే స్వాతంత్ర్యాన్ని సముపార్జించుకుంది. ఫ్రాన్స్ దేశం హింస ద్వారానే తన ప్రభుత్వాన్ని పునర్నిర్మించుకుంది. అయితే, భారతదేశం స్వాతంత్ర్యాన్ని అహింసా మార్గంలో సముపార్జించుకోవడమే కాక, సమర్థమైన ప్రభుత్వాన్ని కూడా పునర్నిర్మించుకుంది. ఈ అపూర్వమైన ఘనత యావత్తూ గాంధీజీకే దక్కుతుంది.
గాంధీజీ ఆనాడు తన వాంగ్మూలంలో ఇంకా ఈ విధంగా అన్నారు. ‘నిజానికి, నా సహాయ నిరాకరణోద్యమం ద్వారా నేను భారతదేశానికి, ఇంగ్లాండుకు కూడా – ఇరు దేశాలూ ఎంత అసహజమైన స్థితిలో జీవిస్తున్నాయో తెలియజెప్పే గొప్ప సేవ చేశాను. నా అభిప్రాయంలో దుష్టత్వానికి సహాయ నిరాకరణ చేయడం అనేది మంచికి సహాయం చేయడంతో సమానమైనదే. గతంలో దుష్టత్వానికి సహాయ నిరాకరణను హింసామార్గంలో చేసేవారు. అయితే, హింస ద్వారా చేసే సహాయ నిరాకరణ హింసను మరింత పెంచుతుంది. దుష్టత్వమనేది హింస ద్వారానే మనుగడ కొనసాగిస్తుంది కనుక సహాయ నిరాకరణ చేసేవారు హింసా మార్గాన్ని వీడితే, దుష్టత్వానికి మనుగడ అసాధ్యమవుతుందని నా దేశప్రజలకు నేను తెలియజెప్పదలచుకున్నాను. అహింస ద్వారా సహాయ నిరాకరణ అంటే దుష్టత్వానికి మరింత బలాన్ని ఇచ్చినట్లేనని నాకు తెలుసు. సహాయ నిరాకరణ చేసేవారు మరిన్ని బాధలు అనుభవించాలనీ నాకు తెలుసు. అందుకే సహాయ నిరాకరణ చేస్తున్న నాకు మీ చట్టాల ప్రకారం మరణశిక్ష లాంటి ఘోరమైన శిక్ష విధించినా సరే, సంతోషంగా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. అదే నా దేశ ప్రజలకు నేను చేయగల గొప్ప సేవ, ఇవ్వదలచుకున్న గొప్ప సందేశం అని నేను భావిస్తున్నాను. నా భావనలో సత్యముందని, మీరు అమలు చేస్తున్న ఈ చట్టాలు దుష్టమైనవని, నిజానికి నేను ఏ నేరమూ చేయలేదని మీరు భావిస్తే, జడ్జిగారు, ఆయన తోటివారు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి, దుష్టత్వం నుంచి దూరం కావాలి లేదా మీరున్న ఈ వ్యవస్థ, అమలు చేస్తున్న ఈ చట్టాలు న్యాయబద్ధంగానే ఉన్నాయని, ఇవి ఈ దేశ ప్రజలకు మేలు చేస్తాయని, కాబట్టి, నా చర్యలు జనసామాన్యానికి హానికరమనీ మీరు భావిస్తే, నాకు అత్యంత కఠినమైన శిక్షను వేయండి’ అని తన అహింసావాదాన్ని, రాజీలేని ధోరణిని గాంధీజీ లోకానికి చాటారు.
ఈ విధంగా మహాత్మా గాంధీ తనపై కోర్టులో జరుగుతున్న విచారణలో, తనకు గల అసాధారణమైన వాగ్ధాటిని ఈ వాంగ్మూలం ద్వారా ప్రదర్శించి, అక్కడున్న వారినందరినీ అచ్చెరువు గొలిపారు. ఈ రకమైన వాగ్ధాటిని ప్రపంచ ప్రసిద్ధిచెందిన వక్తలు ఎవరూ అంతకుముందు గానీ, ఆ తరువాత గానీ, అదీ స్వీయ మనుగడే ప్రశ్నార్థకంగా మారిన క్లిష్ట సమయంలో ప్రదర్శించిన దాఖలాలు ప్రపంచ చరిత్రలోనే లేవని పరిశీలకులు భావిస్తున్నారు. గాంధీ గారి ఈ వాంగ్మూలానికి చలించిపోయిన జడ్జి ఆయనకు వందన సూచకంగా తలను పంకించగా, గాంధీజీ కూడా ప్రతి నమస్కార సూచకంగా తన తలను పంకించారు. ఇది గాంధీజీ మహోన్నత వ్యక్తిత్వాన్ని సూచించే ఒక గొప్ప సంఘటన.
అహింసా సూత్రం పట్ల గాంధీజీకి గల నిబద్ధతను తెలియజెప్పే ఈ మహోదాత్త వాంగ్మూలానికి వంద సంవత్సరాలు నిండిన సందర్భంగా ఆ చరిత్రాత్మక సంఘటనను ఈ తరం వారికి గుర్తుచేయాల్సిన అవసరముందని భావిస్తున్నాను.
డా. మండలి బుద్ధప్రసాద్
మాజీ ఉప సభాపతి, ఆంధ్రప్రదేశ్