మహేంద్రజాలం

ABN , First Publish Date - 2020-08-18T07:27:02+05:30 IST

భారత క్రికెట్‌లో ఓ అధ్యాయం ముగిసింది. దేశ క్రికెట్‌ చరిత్రలో అత్యంత విజయవంతమైన నాయకుడిగా, ఆటగాడిగా మన్ననలు అందుకున్న మహేంద్రసింగ్‌ ధోనీ...

మహేంద్రజాలం

భారత క్రికెట్‌లో ఓ అధ్యాయం ముగిసింది. దేశ క్రికెట్‌ చరిత్రలో అత్యంత విజయవంతమైన నాయకుడిగా, ఆటగాడిగా మన్ననలు అందుకున్న మహేంద్రసింగ్‌ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి వైదొలిగాడు. నిరుడు వన్డే ప్రపంచకప్‌ తర్వాతి నుంచి జాతీయ జట్టుకు పూర్తి దూరంగా ఉంటున్న ధోనీ.. ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా సామాజిక మాధ్యమంలో తన నిర్ణయాన్ని ప్రకటించాడు. గతంలో కూడా ఇలాగే చడీ చప్పుడూ లేకుండా ఐదురోజుల ఆటకు స్వస్తి పలికి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇలా.. పోరాటంలోనే కాదు విరమణలో ప్రత్యేకతను చాటుకుంటూ పదహారు వసంతాల తన అద్భుత కెరీర్‌కు వీడుకోలు పలికాడు.


కొందరు తమ ఆట ద్వారా గుర్తింపు పొందుతారు. ఇంకొందరు తమదైన నాయకత్వ శైలి, పోరాటపటిమ ద్వారా గణుతికెక్కుతారు. కానీ.. ఈ లక్షణాలన్నీ కలగలసిన అతికొద్దిమంది ఆటగాళ్లలో ధోనీ ప్రథమస్థానంలో నిలుస్తాడు. ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో విలక్షణమైన కెప్టెన్‌గా, ఆటగాడిగా, కీపర్‌గా.. మైదానంలో మహేంద్రజాలం ప్రదర్శించి కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ధోనీ క్రికెట్‌ ప్రయాణమే ఎంతో స్ఫూర్తిదాయకం. ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి పెద్ద నగరాలనుంచి వచ్చిన ఆటగాళ్లే భారత జట్టులో రాజ్యమేలుతున్న దశలో, రాంచీ అనే చిన్న నగరం నుంచి మహీ ఎంట్రీ ఇచ్చాడు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ధోనీ 2001 నుంచి 2003 వరకు ఖరగ్‌పూర్‌ రైల్వే స్టేషన్‌ పరిధిలో టికెట్‌ కలెక్టర్‌గా పనిచేశాడు. ఓవైపు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే క్రికెట్‌ ప్రాక్టీస్‌ చేసుకుంటూ సీనియర్‌ జట్టులో చోటు దక్కించుకున్నాడు. 2004లో బంగ్లాదేశ్‌తో వన్డే ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఇక పాకిస్థాన్‌తో విశాఖపట్నంలో జరిగిన రెండో వన్డేలో పాకిస్థాన్‌పై సెంచరీతో చెలరేగి చిరస్మరణీయమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇలా.. ప్రపంచ క్రికెట్‌లో తన పరిచయాన్నే సంచలనంగా మార్చుకున్న ధోనీ.. 2005లో శ్రీలంకతో మ్యాచ్‌ ద్వారా టెస్టు క్రికెట్‌లో ప్రవేశించాడు. తన ఐదో వన్డేలో తొలి సెంచరీ కొట్టిన ధోనీ.. టెస్టుల్లోనూ ఐదో మ్యాచ్‌లోనే తొలి శతకం నమోదు చేశాడు. కాకతాళీయమే అయినా.. ఈ రెండు సెంచరీలూ పాకిస్థాన్‌పైనే చేయడం, రెండు సందర్భాల్లోనూ అతని స్కోర్లు 148 కావడం మరో విశేషం. వికెట్‌ కీపర్‌గా క్రికెట్‌ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ధోనీ.. అనతికాలంలోనే కెరీర్‌లో ఒక్కో మెట్టూ పైకెక్కుతూ దేశ జట్టుకు సారథ్యం వహించే స్థాయికి ఎదిగిన తీరు అద్భుతం. తన సుదీర్ఘ కెరీర్‌లో 350 వన్డేలు, 90 టెస్టులు, 98 టీ20 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. టెస్టుల్లో ఒక డబుల్‌ సెంచరీ, ఆరు సెంచరీలతో 4,876 పరుగులు చేశాడు. వన్డేల్లో 10 శతకాలు సహా 10,773 రన్స్‌, టీ20ల్లో 1,617 పరుగులు సాధించాడు. సమర్థవంతమైన వికెట్‌ కీపర్‌గా ప్రశంసలు అందుకున్న ధోనీ.. మూడు ఫార్మాట్లలో కలిపి 634 క్యాచ్‌లు అందుకున్నాడు, 195 స్టంపౌట్లు చేశాడు.


జట్టు పగ్గాలు చేపట్టిన 2007లోనే భారత్‌కు టీ20 ప్రపంచకప్‌ అందించి తన నాయకత్వానికి ధోనీ గట్టి పునాది వేసుకున్నాడు. 2011 వన్డే ప్రపంచకప్‌లో జట్టును ఛాంపియన్‌గా నిలబెట్టి కెప్టెన్‌గా కీర్తి మరింత పెంచుకున్నాడు. 2013లో చాంపియన్స్‌ ట్రోఫీని కూడా గెలిచి భారత్‌కు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఒకే ఒక్కడు మహీ. పెద్దగా చదువుకోకపోయినా.. ఆధునిక క్రికెట్‌లో అతనిని ఓ గొప్ప సైకాలజిస్టుగా క్రికెట్‌ పండితులు విశ్లేషిస్తారు. మైదానంలో బౌలర్ల మనసు చదివేస్తాడు. భీకరమైన షాట్లతో వారిని హడలెత్తిస్తాడు. ఇతర బ్యాట్స్‌మెన్‌లా కళాత్మకమైన కవర్‌ డ్రైవ్‌లు, ఫ్లిక్‌లు, కట్‌ షాట్లూ ధోనీ శైలిలో కనిపించవు. అతనికి తెలిసిందల్లా బంతిని బలంగా బాదడమే. అతని బ్యాట్‌ నుంచి పుట్టుకొచ్చిన హెలికాప్టర్‌ షాట్‌ గురించి తెలియని వారెవరు? పరుగులు సాధించడమే బ్యాట్స్‌మన్‌ లక్ష్యం అయినప్పుడు ఎలా కొడితే ఏంటన్నది అతని తత్త్వం. ధోనీ చాలా తక్కువగా మాట్లాడతాడు. ఫీల్డ్‌లో ఎంత ఒత్తిడిలోనైనా ప్రశాంతంగా ఉంటాడు. స్లెడ్జింగ్‌ అన్న మాటకు మైళ్ల దూరంలో ఉంటాడు. ఏ దశలోనూ సంయమనం కోల్పోడు. అందుకే అతడిని అంతా మిస్టర్‌ కూల్‌ అని అంటారు. సారథిగా జట్టు సహచరుల నుంచి మెరుగైన ఆట రాబట్టే విషయంలోనూ ధోనీది విభిన్నమైన శైలి. తాను గొప్పగా ఆడుతూ, మీ నుంచి కూడా ఇదే ఆటను ఆశిస్తున్నానన్న సందేశాన్ని జట్టు సభ్యులకు అందించేవాడు.   ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లను ప్రోత్సహించడంలోనూ ధోనీ ముందుండేవాడు. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ, రవీంద్ర జడేజా, సురేశ్‌ రైనాలాంటి ఆటగాళ్లకు వీలైనన్ని అవకాశాలు ఇప్పించి వారి ఎదుగుదలకు తోడ్పడ్డాడు. తనపై కొందరు ఆటగాళ్లు మాటల దాడి చేసినా.. తిరిగి ఏమాత్రం ప్రశ్నించకుండా తన పని తాను చేసుకుంటూ పోయే వివాదరహితుడిగా  పేరు తెచ్చుకున్నాడు.


తన ఆటతో పాటు వ్యక్తిత్వపరంగానూ ఇతర ఆటగాళ్లకు భిన్నంగా ఉంటూ ధోనీ విశ్వవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. కెరీర్‌ తొలినాళ్లలో ధోనీ జులపాల జట్టుతో విభిన్నమైన ఆహార్యంతో కనిపించేవాడు. అప్పట్లో ఓ సిరీస్‌ కోసం ధోనీ సారథ్యంలోని భారత జట్టు పాకిస్థాన్‌ పర్యటనకు వెళ్లినప్పుడు ఆ దేశాధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ అతని జులపాల జట్టును చూసి ఎంతో ముచ్చటపడ్డాడు. పాక్‌లో ధోనీకి చాచా అనే వీరభిమాని ఉన్నాడు. ఇప్పుడు తన ఆరాధ్య ఆటగాడు ఆటకు గుడ్‌బై చెప్పడంతో.. తాను కూడా ఇకనుంచి క్రికెట్‌ మ్యాచ్‌లను వీక్షించకుండా రిటైరవుతున్నట్టు చాచా చెప్పాడంటే అభిమానులపై ధోనీ ముద్ర ఎలాంటిదో తెలుస్తుంది. ఇరుదేశాల సరిహద్దుల మధ్య ఎన్ని ఉద్రిక్త పరిస్థితులు ఉన్నా.. తన ఆటతో అభిమానానికి హద్దులు లేవని ధోనీ చాటుకున్నాడు. ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న ధోనీ సేవలను గుర్తించిన భారత సైన్యం అతనికి కల్నల్‌ హోదా అందజేసింది. ఇందుకు ప్రతిఫలంగా ప్రతి ఏటా సైనిక శిబిరాలను సందర్శించడంతో పాటు వాళ్లతో కలిసి కొన్నాళ్లు విధులు నిర్వర్తించడం ధోనీ దేశభక్తికి నిదర్శనం.

Updated Date - 2020-08-18T07:27:02+05:30 IST