
హైదరాబాద్ సిటీ : ఏపీ మహేశ్ బ్యాంక్‌పై సైబర్ దాడి మామూలు స్కెచ్ కాదని పోలీసులు భావిస్తున్నారు. దీని వెనక మాస్టర్‌మైండ్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ దోపిడీ చిక్కుముడిని విడగొట్టేందుకు సీసీఎస్ పోలీసులు బ్యాచ్‌ల వారీగా విడిపోయి రంగంలోకి దిగారు. అందులో భాగంగా ఢిల్లీ, బెంగళూరు, పుణె, ముంబై సహా ఉత్తరాది రాష్ట్రాలకు సీసీఎస్ పోలీసు బృందాలు వెళ్లాయి. బెంగళూరులో ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేశారు. ఢిల్లీలో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని నగరానికి తరలించారు. దీంతో ఇప్పటివరకు అరెస్టు అయిన వారి సంఖ్య ఐదుకి చేరింది.
సైబర్ నేరగాళ్లకు సహకరించిన నిందితుల్లో బ్యాంక్ ఖాతాదారులున్నట్లు సీసీఎస్ జాయింట్ సీపీ గజరావు భూపాల్ తెలిపారు. మహేశ్ బ్యాంక్ వ్యవహారంలో కొత్త తరహాలో బ్యాంక్ సర్వర్లను నేరస్థులు హ్యాక్ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. హ్యాకింగ్ చేసి డబ్బును కాజేసిన సమయంలో ఐపీ అడ్రస్‌లను మార్చి సైబర్ అటాక్ చేశారు. ఆధారాలు దొరక్కుండా అమెరికా, యూకే, స్విట్జర్లాండ్, సింగపూర్, ఫ్రాన్స్‌తోపాటు మరికొన్ని ఇతర దేశాల ఐపీ అడ్రస్‌లను గుర్తించినట్లు డీసీపీ తెలిపారు.

సర్వర్ హ్యాకింగ్‌పై దర్యాప్తు..
మహేష్ బ్యాంక్ సర్వర్‌ను బంజారాహిల్స్‌లోని ఓ సంస్థ నిర్వహిస్తుండగా, సాఫ్ట్‌వేర్‌ను ముంబైకి చెంది న సంస్థ రూపొందించింది. ప్రాక్సీ సర్వర్‌తో సైబర్ నేరగాళ్లు సర్వర్‌ను యాక్సెస్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ నేరం చేయడానికి ముందు సైబర్ నేరగాళ్లు చెస్ట్ ఖాతాను యాక్సిస్ చేసి అనంతరం ఈ మూడు ఖాతాల లావాదేవీల పరిమితిని రూ.50 కోట్లకు పెంచేశారు. అయితే సైబర్ నేరగాళ్లు సర్వర్‌ను డైరెక్టుగా హ్యాక్ చేశారా? లేదా బ్యాంక్ సాఫ్ట్‌వేర్‌లోకి ప్రవేశించి హ్యాక్ చేశారా అనేది తెలియాల్సి ఉంది. గతంలో సర్వర్లు హ్యాక్ అయిన బ్యాంకులకు సాఫ్ట్వేర్ అందించిన సంస్థే మహేష్ బ్యాంకుకు సాఫ్ట్వేర్ అందించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో బ్యాంకు సర్వర్లను హ్యాక్ చేసి నగదు కొల్లగొట్టిన నేరస్థులందరూ ఒక్కరేనని పోలీసులు అనుమానించి ఆ కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు.
ఇవి కూడా చదవండి