మైనారిటీలో పడిన శ్రీలంక ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-04-05T21:31:09+05:30 IST

ప్రధాన మంత్రి మహీంద రాజపక్స నేతృత్వంలోని శ్రీలంక ప్రభుత్వం

మైనారిటీలో పడిన శ్రీలంక ప్రభుత్వం

కొలంబో : ప్రధాన మంత్రి మహీంద రాజపక్స నేతృత్వంలోని శ్రీలంక ప్రభుత్వం పార్లమెంటులో మెజారిటీని కోల్పోయింది. ప్రభుత్వానికి మద్దతిస్తున్న పార్టీలు, దాదాపు 12 మంది సొంత పార్టీ ఎంపీలు స్వతంత్ర గ్రూపుగా ఏర్పడాలని నిర్ణయించడంతో ప్రభుత్వం మైనారిటీలో పడింది. దీంతో పార్లమెంటులో ఆధిక్యతను నిరూపించుకోవాలని ఇతర పార్టీలను దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స ఆహ్వానించవలసి ఉంది. 


ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 225 మంది సభ్యులుగల శ్రీలంక పార్లమెంటులో కనీసం 113 మంది సభ్యుల మద్దతు అవసరం. ఈ పరిస్థితిలో దేశాధ్యక్షుడు ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని నియమించాలి. ఆ ప్రభుత్వం మధ్యంతర ఎన్నికలను నిర్వహించవలసి ఉంటుంది. ఆర్థిక ఒడుదొడుకుల నుంచి ఉత్పన్నమైన రాజకీయ సంక్షోభానికి కారణం ప్రజాగ్రహమే. రాజపక్సలపై ప్రజలు ఆగ్రహంగా ఉండటంతో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. రాజపక్స బ్రాండ్ నేమ్‌కి భారీ నష్టం జరిగింది. ఈ పరిణామాల ప్రభావం గొటబయ రాజపక్స దేశాధ్యక్షునిగా కొనసాగడంపై పడబోవు. అయితే ప్రజలు ఆయనను కూడా రాజీనామా చేయమని డిమాండ్ చేస్తున్నారు. 


శ్రీలంక పార్లమెంటులో 225 మంది సభ్యులు ఉన్నారు. అధికారంలో ఉన్న శ్రీలంక పొడుజన పెరమునకు 117 మంది సభ్యులు ఉన్నారు. ఈ పార్టీకి మద్దతిస్తున్న ఎస్ఎల్ఎఫ్‌పీకి 15 మంది, 10 పార్టీల కూటమికి 14 మంది సభ్యులు ఉన్నారు. ప్రతిపక్ష ఎస్‌జేబీకి 54 మంది సభ్యులు, టీఎన్ఏకి 10 మంది సభ్యులు ఉన్నారు. ఇతరులు 15 మంది ఉన్నారు. పార్టీ ఫిరాయింపుల వల్ల ఎస్ఎల్‌పీపీ బలం 105 మంది సభ్యులకు తగ్గిపోయింది. మొత్తం అసమ్మతివాదుల సంఖ్య 41కి చేరింది. వీరిలో అధికార పార్టీ సభ్యులు కూడా ఉన్నారు. అసమ్మతివాదుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 


Updated Date - 2022-04-05T21:31:09+05:30 IST