భూ బకాసురులు!

ABN , First Publish Date - 2021-04-15T05:41:41+05:30 IST

సుమారు 36 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సువిశాలమైన లేఔట్‌ అది.

భూ బకాసురులు!
ఆక్రమణకు గురవుతున్న మహ్మదీయ సొసైటీ స్థలం

రూ.20 కోట్ల స్థలం దర్జాగా కబ్జా!

భూమి భవానీపురం మహ్మదీయ సొసైటీది

మంత్రి అండతో చెలరేగుతున్న అనుచరులు

మాస్లర్‌ ప్లాన్‌లోని 40 అడుగుల రోడ్లు ధ్వంసం

5 వేల గజాలు ఆక్రమించి విక్రయించే యత్నం

కబ్జారాయుళ్లకు వీఎంసీ వత్తాసు!


సుమారు 36 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సువిశాలమైన లేఔట్‌ అది. సుమారు 400 మంది అక్కడ స్థలాలు కొనుగోలు చేశారు. 1989లో లేఔట్‌ వేయగా, ఊరికి దూరంగా ఉన్నందున స్థలాలు కొనుగోలు చేసిన వారు చాలా కాలం అక్కడ ఇళ్లు కట్టుకునేందుకు ముందుకు రాలేదు. తర్వాత కోర్టు వివాదాల పేరుతో వీఎంసీ అధికారులు ఇళ్ల నిర్మాణాలకు అనుమతి ఇవ్వడం ఆపేశారు. దీంతో ఆ లేఔట్‌లోని చాలా స్థలాలు నిరుపయోగంగా పడి ఉన్నాయి. దీన్ని సాకుగా తీసుకుని మంత్రి అనుచరులు కొందరు కబ్జాకాండకు తెరదీశారు. సుమారు రూ.20వేల కోట్ల విలువ చేసే భవానీపురం మహ్మదీయ కో-ఆపరేటివ్‌ సొసైటీ లేఔట్‌లో జరుగుతున్న ఈ కబ్జాకాండపై స్థానికులు నిరసనలకు దిగారు. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ/భవానీపురం)

విజయవాడ నగరంలోని భవానీపురంలో సర్వే నంబరు 63లో సుమారు 36 ఎకరాల భూమి మహ్మదీయ కో-ఆపరేటివ్‌ సొసైటీ కింద ఉంది. వాస్తవానికి ఇది వక్ఫ్‌ భూమి. భవానీపురంలోని హజారా గాలిబ్‌షా దర్గాకు చెందిన ఈ భూమిని దర్గా అభివృద్ధి కోసం 1982లో విక్రయించుకునే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వం వక్ఫ్‌ బోర్డుకు కట్టబెట్టింది. 1982 మే 29న వక్ఫ్‌ బోర్డు ఈ భూమిని విక్రయానికి పెట్టింది. అప్పట్లో ఈ భూమిని కొనుగోలు చేసేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి. అలాంటి వాటిలో లక్ష్మీ శ్రీనివాస కో-ఆపరేటివ్‌ సొసైటీ, నూర్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ, మహ్మదీయ కో-ఆపరేటివ్‌ సొసైటీ ఉన్నాయి. వీటిలో మహ్మదీయ కో-ఆపరేటివ్‌ సొసైటీ ఎకరానికి రూ.1.28లక్షలు అత్యధిక ధర చెల్లించి ఈ భూములను సొంతం చేసుకుంది. అనంతరం ప్రభుత్వ అనుమతితో ఈ భూములను మహ్మదీయ కో-ఆపరేటివ్‌ బిల్డింగ్‌ సొసైటీ పేరుతో బదలాయించారు. అప్పట్లో వక్ఫ్‌ భూములను విక్రయించరాదన్న నిబంధన లేకపోవడంతో ఈ విక్రయానికి ఎలాంటి అవరోధాలు తలెత్తలేదు. అనంతరం సొసైటీ ఈ భూమిని లేఔట్‌ చేసి సొసైటీ సభ్యులు 433 మందికి విక్రయించింది. 


తీర్పు అనుకూలంగా వచ్చినా..

2008లో ప్లాట్ల యజమానులకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా, మహ్మదీయ సొసైటీలో ఎలాంటి ఇళ్ల నిర్మాణాలకు ప్లాన్లు అనుమతించవద్దని, రిజిస్ట్రేషన్లు జరపవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నాటి నుంచి ప్లాట్ల యజమానులకు కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. తాము కొన్న స్థలాలు అభివృద్ధి చెందే సమయంలో వాటిని తమకు కాకుండా చేస్తున్నారంటూ యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులపై ప్లాట్ల యజమానులు 2011లో హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేయాలని హైకోర్టు ఆదేశించింది. కానీ ఇప్పటికీ ప్లాట్ల యజమానులకు కష్టాలు తప్పడం లేదు. ప్రభుత్వ తీరుపై 2015లో మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఇళ్ల నిర్మాణాలకు అనుమతి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో 2016లో కోర్టు ధిక్కార పిటిషన్‌ను వేశారు. 

ఎన్నిసార్లు కోర్టు ఆదేశాలు ఇస్తున్నా అధికారుల్లో స్పందన శూన్యం. మైనారిటీ శాఖలో కొందరు ఉన్నతాధికారులు కాసుల కోసం ఉద్దేశపూర్వకంగా తమ ఫైలును తొక్కిపెడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వాన్ని కూడా తప్పుదారి పట్టిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల సమయంలో బాధితులకు న్యాయం చేస్తానని మంత్రి వెలంపల్లి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వారి వైపే చూడటం మానేశారు. పైగా తన అనుచరులనే అక్కడ భూముల కబ్జాకు ఉసిగొల్పుతున్నారని బాధితులు వాపోతున్నారు. 


రోడ్లనే కబ్జా చేస్తున్నారు..

సొసైటీ స్థలంలో సుమారు 430 ప్లాట్లు ఉన్నాయి. అందులో స్థలాలు కొనుగోలు చేసిన చాలా మంది వాటిని నివాసయోగ్యంగా మార్చుకోలేదు. దీంతో ఆ స్థలాల నడుమ ఉన్న 40 అడుగుల రోడ్లపై మంత్రి అనుచరుల దృష్టిపడింది. ప్లాట్ల మధ్య ఉన్న మట్టి రోడ్డును ధ్వంసం చేసి, ప్లాట్లుగా మార్చి అమ్ముకుంటున్నారు. ఇలా సుమారు 5వేల గజాల స్థలాన్ని అమ్మకానికి సిద్ధం చేసినట్లు సమాచారం. ఇక్కడ గజం రూ.50వేలకుపైనే పలుకుతుంది. మంత్రి అండ చూసుకొని కొందరు హజ్రత్‌ గాలీబ్‌ షహిద్‌ దర్గా కమిటీ ముసుగులో ఈ కబ్జాకు బరితెగించారు. ఇప్పటికే పొక్లయినర్‌తో రోడ్లను చదును చేసేశారు. బాధితులు ఇళ్లు కట్టుకుంటామంటే ఇంటి ప్లాను ఇవ్వని వీఎంసీ అధికారులు కబ్జారాయుళ్లకు మాత్రం వత్తాసు పలుకుతున్నారు. 

కార్పొరేషన్‌ ప్రజారోగ్యశాఖకు చెందిన బాబ్‌కాట్‌ యంత్రాలను ఇక్కడికి తీసుకొచ్చి రోడ్డుకి ఇరువైపులా ఉన్న పిచ్చిమొక్కలను కొట్టిస్తున్నారు. రోడ్లతోపాటు తమ  స్థలాలను కబ్జా  చేసి విక్రయించేస్తారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇళ్ల ప్లాన్లు ఇవ్వడానికి అభ్యంతరాలు చెప్పే నగర కార్పొరేషన్‌ అధికారులు దగ్గరుండి కబ్జారాయుళ్లకు సహకరించడం ఏమిటని నిలదీస్తున్నారు. కబ్జాకాండను ప్రశ్నించిన ఈ లేఔట్‌లోని కొందరు అపార్ట్‌మెంటువాసులపై మంత్రి అనుచరులు దౌర్జన్యం చేశారు. ఆ ఆపార్ట్‌మెంటుకు వెళ్లే తాగునీటి పైప్‌లైన్‌ కూడా పగులగొట్టారు. దీనిపై అధికారులు తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలని ప్లాట్ల యజమానులు కోరుతున్నారు. 


1984 నుంచి వివాదాల్లో..

లక్ష్మీశ్రీనివాస కో-ఆపరేటివ్‌ సొసైటీ ఆ భూమి తనదేనంటూ 1984లో కోర్టును ఆశ్రయించింది. ముజావర్లు తమ సొసైటీ పేరుమీద ఆ భూమిని రిజిస్టర్‌ చేశారని పేర్కొంది. అప్పటి నుంచి వివాదం మొదలయింది. 2005లో కోర్టు లక్ష్మీ శ్రీనివాస కో-ఆపరేటివ్‌ సొసైటీకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై ప్లాట్ల యజమానులు 2005లో హైకోర్టును ఆశ్రయించారు. వీరితోపాటు వక్ఫ్‌ బోర్డు కూడా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. హైకోర్టు కూడా కింది కోర్టు తీర్పునే సమర్థించింది. దీంతో ప్లాట్ల యజమానులు 2008లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక్కడ ప్లాట్ల యజమానులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. కింది కోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 

Updated Date - 2021-04-15T05:41:41+05:30 IST