TMC: రామరాజ్యం ఖరీదైన వ్యవహారం

ABN , First Publish Date - 2022-09-24T00:00:45+05:30 IST

రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ చేస్తున్న ఖర్చులపై తృణమూల్ కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ ఎంపీ మహువ మొయిత్రా శుక్రవారంనాడు..

TMC: రామరాజ్యం ఖరీదైన వ్యవహారం

కోల్‌కతా: రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ చేస్తున్న ఖర్చులపై తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఫైర్‌బ్రాండ్ ఎంపీ మహువ మొయిత్రా (Mahua Moitra) శుక్రవారంనాడు విమర్శలు గుప్పించారు. ''రామరాజ్యం నిశ్చయంగా ఖరీదైన వ్యవహారం'' అని అన్నారు. 2022లో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ రూ.340 కోట్లు ఖర్చు చేసిందని, ఇందులో రూ.221 కోట్లు ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే ఖర్చు చేసిందని మహువ మొయిత్రా ట్వీట్ చేశారు. ఇది కూడా ప్రకటించిన (డిక్లేర్డ్) మొత్తమేనని అన్నారు.


మహువ మొయిత్రా ఖరీదైన బ్యాగ్ వ్యవహారంలో గత ఆగస్టులో బీజేపీ నేతలు కొందరు విమర్శలు చేశారు. పార్లమెంటులో ధరల పెరుగుదలపై విపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. విపక్ష పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ నేత కకోలి ఘోష్‌ దస్తిదార్‌ ధరల పెరుగుదల అంశంపై మాట్లాడుతుండగా, ఆమె పక్కనే ఉన్న మహువా మోయిత్రా తన ఖరీదైన లూయిస్ వియుట్టన్ హ్యాండ్ బ్యాగ్‭ను టేబుల్ కింద దాచేశారు. దీనిపై బీజేపీ నేతలు వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. అవినీతిలో కూరుకుపోయిన పార్టీ సభ్యులు ఇలా వ్యవహరిస్తున్నారంటూ బీజేపీ నేతలు విమర్శించారు. దీనిపై మహువ మొయిత్రా సూటిగా స్పిందించారు. ''జోలేవాలా ఫకీర్‌ను. 2019 నుంచి పార్లమెంట్‌లో ఉన్నా. బ్యాగుతో వచ్చాం.. బ్యాగుతోనే వెళ్తాం'' అంటూ ఆమె ట్వీట్‌ చేశారు. 2016 యూపీ మోరాదాబాద్‌ పరివర్తన్‌ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ తనను తాను ఓ ఫకీర్‌గా అభివర్ణించుకోవడాన్ని ఉద్దేశించి పరోక్షంగా ఆమె ఈ వ్యాఖ్య చేశారు.సాదాసీదా వ్యక్తినైన తాను ఫకీర్‌లాగా జోలె పట్టుకుని ముందుకు వెళ్తానని, అంతేగానీ అవినీతికి వ్యతిరేకంగా పోరాడటం ఆపనని భావోద్వేగంగా అన్నారు.


కాగా, ఈ మధ్యనే భారత్ జోడో యాత్రలో రాహుల్ టీ-షర్డ్‌ 41,257 రూపాయలని బీజేపీ వ్యంగ్యాస్త్రాలు సంధించడంపై కూడా మహువా మొయిత్రా  నిప్పులు చెరిగారు. ''బీజేపీకి సీరియస్‌గా సలహా ఇస్తున్నాను. వ్యక్తుల డ్రస్సింగ్‌పై, ముఖ్యంగా విపక్షాలపై చేస్తున్న వ్యాఖ్యల విషయంలో హద్దులు దాటకండి. బీజేపీ ఎంపీల వాచీలు, పెన్నులు, షూలు, ఉంగరాలు, దుస్తులపై మేము మాట్లాడటం మొదలు పెడితే మీరు పశ్చాత్తాప పడాల్సి వస్తుంది'' అని ఒక ట్వీట్‌లో ఆమె హెచ్చరించారు.

Updated Date - 2022-09-24T00:00:45+05:30 IST