Maid dupes sponsor: యజమానికి మస్కాకొట్టి పనిమనిషి చేసిన నిర్వాకమిదీ..!

ABN , First Publish Date - 2022-08-23T18:07:40+05:30 IST

రాస్ అల్ ఖైమాలో ఓ పనిమనిషి చేసిన నిర్వాకమిదీ.

Maid dupes sponsor: యజమానికి మస్కాకొట్టి పనిమనిషి చేసిన నిర్వాకమిదీ..!

రాస్ అల్ ఖైమా:  రాస్ అల్ ఖైమాలో ఓ పనిమనిషి చేసిన నిర్వాకమిదీ. తన కుమారుడికి ఆరోగ్యం బాగాలేదని, వెంటనే తాను స్వదేశానికి వెళ్లాలని యజమానిని నమ్మించింది. దాంతో యజమాని ఆమెను స్వదేశానికి పంపించేందుకు వీసా, విమాన టికెట్‌కు కలిపి 4800 దిర్హమ్స్( సుమారు రూ.1లక్ష) వరకు ఖర్చు చేశాడు. అలాగే రాస్ అల్ ఖైమా నుంచి దుబాయ్ విమానాశ్రయానికి పంపించేందుకు ట్యాక్సీ కోసం మరో 300 దిర్హమ్స్ (రూ.6,524) వెచ్చించాడు. కానీ, పనిమనిషి మాత్రం దుబాయ్ విమానాశ్రయానికి వెళ్లలేదు. దుబాయ్‌ వెళ్లిన తర్వాత అక్కడ మరో వ్యక్తి వద్ద పనికి కుదిరింది. ఈ విషయం తెలుసుకున్న యజమాని ఆమెపై రాస్ అల్ ఖైమా కోర్టులో కేసు వేశాడు. తాజాగా ఈ కేసు విచారణకు వచ్చింది. విచారణలో భాగంగా ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం యజమాని వెచ్చించిన రూ.1లక్ష తిరిగి ఇవ్వాలని పనిమనిషికి ఆదేశించింది.  


కోర్టులో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఆసియాకు చెందిన ఓ మహిళ రాస్‌ అల్ ఖైమాలోని ఓ వ్యక్తి వద్ద రెండేళ్లుగా పనిమనిషిగా చేస్తుంది. ఈ క్రమంలో ఆమె కాంట్రాక్ట్ ముగిసింది. కానీ, తన వర్క్ కాంట్రాక్ట్‌ను పునరుద్ధరించాలని యజమానిని కోరింది. ఆమె అభ్యర్థన మేరకు యజమాని కాంట్రాక్ట్‌ను పునరుద్ధరించాడు. కానీ, కొన్నిరోజులకే స్వదేశంలో ఉన్న తన కుమారుడు అనారోగ్యం బారినపడ్డాడని వెంటనే వెళ్లాలని యజమానితో చెప్పింది. దాంతో యజమాని ఆమెను స్వదేశానికి పంపించేందుకు వీసా రెన్యువల్, విమాన టికెట్ కోసం 4800 దిర్హమ్స్(రూ.1లక్ష) వెచ్చించాడు. అలాగే ఆమె జర్నీ రోజు దుబాయ్ విమానాశ్రయానికి పంపించేందుకు ట్యాక్సీ కోసం మరో 300 దిర్హమ్స్ చెల్లించాడు. అలా దుబాయ్ ఎయిర్‌పోర్టుకు బయల్దేరిన ఆమె స్వదేశానికి వెళ్లలేదు. దుబాయిలోనే మరో వ్యక్తి వద్ద కొత్త జాబ్ చూసుకుంది. ఇక పాత యజమాని ఆమెకు ఫోన్ చేసి తిరిగి రావాలని కోరాడు. కానీ, ఆమె తిరిగి వచ్చేందుకు ఒప్పుకోలేదు. ఆ తర్వాత యజమానికి అసలు విషయం తెలిసింది. ఆమె స్వదేశానికి వెళ్లకుండా దుబాయ్‌లోనే మరో వ్యక్తి వద్ద పనిచేస్తున్నట్లు తెలుసుకున్నాడు. దాంతో తనను మోసం చేసిన పనిమనిషిపై కోర్టుకెక్కాడు. కేసు విచారించిన న్యాయస్థానం పనిమనిషిని యజమాని ఖర్చు చేసిన రూ.1లక్ష తిరిగి చెల్లించాలని ఆదేశించింది.     


Updated Date - 2022-08-23T18:07:40+05:30 IST