పాటియాలా హింసాకాండ కేసు ప్రధాన నిందితుడు వివాదాలకు కొత్తవాడేమీ కాదు!

ABN , First Publish Date - 2022-05-01T19:13:15+05:30 IST

Punjabలోని పాటియాలాలో ఏప్రిల్ 29న జరిగిన హింసాకాండలో

పాటియాలా హింసాకాండ కేసు ప్రధాన నిందితుడు వివాదాలకు కొత్తవాడేమీ కాదు!

చండీగఢ్ : Punjabలోని పాటియాలాలో ఏప్రిల్ 29న జరిగిన హింసాకాండలో ప్రధాన నిందితుడు బర్జిందర్ సింగ్ పర్వానా వివాదాలకు కొత్తవాడేమీ కాదు. ఆయనపై ఇప్పటికే నాలుగు కేసులు నమోదయ్యాయి. హత్యాయత్నం, ఆయుధాల చట్టం, బెదిరింపులు, విపత్తు నిర్వహణ చట్టం ఉల్లంఘన కేసులు ఆయనపై విచారణలో ఉన్నాయి. 


Damdami Taksal Jatha చీఫ్‌నని బర్జిందర్ సింగ్ పర్వానా చెప్పుకుంటాడు. గత నెల 29న పాటియాలో జరిగిన హింసాకాండలో ఆయన ప్రధాన నిందితుడని పాటియాలా రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ముఖ్విందర్ సింగ్ ఛినా తెలిపారు. ఈ హింసాకాండ వెనుక సూత్రధారి ఆయనేనని చెప్పారు. శాంతిభద్రతల సమస్య ఏర్పడటానికి ఆయనే బాధ్యుడని తెలిపారు. బర్జిందర్ సింగ్‌ను ఆదివారం ఉదయం సీఐఏ పాటియాలా టీమ్ మొహాలీ విమానాశ్రయంలో అరెస్టు చేసింది.  


నిషిద్ధ ఉగ్రవాద సంస్థ Sikhs for Justice (SFJ) లీగల్ అడ్వయిజర్ గుర్‌పత్వంత్ సింగ్ పన్ను ఇటీవల ఓ ప్రకటన చేశాడు. ఏప్రిల్ 29న ఖలిస్థాన్ దినాన్ని నిర్వహించాలని పిలుపునిచ్చాడు. దీంతో శివసేన (బాల్ థాకరే) అధ్యక్షుడు హరీశ్ సింగ్లా స్పందించారు. అదే రోజున ఖలిస్థాన్ ముర్దాబాద్ కవాతును నిర్వహిస్తామని ప్రకటించారు. 


హరీశ్ ప్రకటనపై బర్జీందర్ సింగ్ పర్వానా స్పందిస్తూ, ఖలిస్థాన్ ముర్దాబాద్ కవాతును నిర్వహించనివ్వబోమని ప్రకటించారు. ఏప్రిల్ 29న పాటియాలాకు రావాలని ర్యాడికల్స్‌కు సామాజిక మాధ్యమాల ద్వారా పిలుపునిచ్చారు. ఇటీవల చిత్రీకరించిన వీడియోలో పర్వానా మతపరమైన మనోభావాలను రెచ్చగొడుతున్నట్లు కనిపించింది. గతంలో, వర్తమానంలో ఖలిస్తాన్ ఉందని, భవిష్యత్తులో కూడా ఖలిస్తాన్ ఉంటుందని హెచ్చరించాడు. 


ఈ నేపథ్యంలో ఏప్రిల్ 29న హరీశ్ నేతృత్వంలో జరిగిన ఖలిస్థాన్ వ్యతిరేక ప్రదర్శనలో పాటియాలాలోని కాళీ మాత దేవాలయం వద్ద హింసాకాండ జరిగింది. ఈ కేసులో బర్జిందర్ ప్రధాన నిందితుడని పోలీసులు ప్రకటించారు. 


బర్జిందర్ సింగ్ సామాజిక మాధ్యమాల ద్వారా సిక్కు మిలిటెంట్లను రెచ్చగొడుతూ ఉంటారు. సిక్కు మిలిటెంట్ జర్నయిల్ సింగ్ భింద్రన్‌వాలేకు మద్దతుగా వీడియోలు పోస్ట్ చేస్తూ, ప్రకటనలు చేస్తూ ఉంటారు. ఆయన 2007లో సింగపూర్ వెళ్లి, దాదాపు 17 నెలలపాటు గడిపారు. తిరిగి పంజాబ్ వచ్చిన తర్వాత రాజ్‌పురలో Damdami Taksal Jathaను ప్రారంభించారు. మతపరమైన ప్రసంగాలను ప్రారంభించారు.శివసేన నేత సుధీర్ సూరి ఫిర్యాదు మేరకు మొహాలీ పోలీసులు 2021 జూలైలో బర్జిందర్‌ను అరెస్టు చేశారు. అల్లర్లను ప్రోత్సహించే విధంగా రెచ్చగొడుతూ మాట్లాడారని, బహిరంగంగా మోసగించే ప్రకటనలు చేస్తున్నారని, జైలు శిక్ష విధించదగిన నేరాలకు పాల్పడాలనే ప్రణాళికలను దాచిపెడుతున్నారని ఆరోపిస్తూ కేసు నమోదు చేశారు. పాటియాలా రేంజ్ ఐజీ ముఖ్విందర్ సింగ్ ఛినా మాట్లాడుతూ, బర్జిందర్‌పై ఇప్పటికే నాలుగు కేసులు విచారణలో ఉన్నాయని చెప్పారు. ఖలిస్థాన్ ఉగ్రవాద సంస్థలతో ఆయనకుగల సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 


Updated Date - 2022-05-01T19:13:15+05:30 IST