బీజేపీ ఉధృతిలో మజ్లిస్ ఉత్థానం

ABN , First Publish Date - 2020-11-25T06:19:01+05:30 IST

‘భారతదేశంలో ఒక ముస్లిం పార్టీ వేగంగా విస్తరిస్తోంది’ అని ఖతార్ టీవీ ఛానెల్ ‘అల్ జజీరా’ బిహార్ ఎన్నికలను విశ్లేషిస్తూ వ్యాఖ్యానించింది...

బీజేపీ ఉధృతిలో మజ్లిస్ ఉత్థానం

దేశ జనాభాలో అత్యధికులైన హిందువులను ఆకర్షించాలని భారతీయ జనతాపార్టీ ప్రయత్నిస్తున్నప్పుడు అల్పసంఖ్యాకులైన ముస్లింలను ఆకర్షించాలని మజ్లిస్‌పార్టీ ప్రయత్నించడంలో తప్పేమున్నది?అత్యంత దయనీయంగా ఉన్న ముస్లింల ఆర్థిక సామాజిక పరిస్థితుల గురించి మాట్లాడకుండా మతం చుట్టూ ఈ దేశ రాజకీయాలు తిరగడం జాతి శ్రేయస్సుకు ఎంత మాత్రం తోడ్పడదు.


‘భారతదేశంలో ఒక ముస్లిం పార్టీ వేగంగా విస్తరిస్తోంది’ అని ఖతార్ టీవీ ఛానెల్ ‘అల్ జజీరా’ బిహార్ ఎన్నికలను విశ్లేషిస్తూ వ్యాఖ్యానించింది. బిహార్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ‘ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాద్ ఉల్ ముస్లిమీన్’ (క్లుప్తంగా ఎంఐఎం లేదా మజ్లిస్ పార్టీ) ఐదు స్థానాలను గెలుచుకుని రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. మజ్లిస్ పార్టీ దేశంలోని ఇతర ప్రాంతాల్లో హల్‌చల్ సృష్టించడం కొత్త కాదు. కొన్ని దశాబ్దాలుగా హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాలకే పరిమితమయిన ఈ పార్టీ కొద్ది సంవత్సరాలుగా ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లో తన ఉనికిని చాటేందుకు పకడ్బందీగా కృషి చేస్తోంది. 2012లోనే నాందేడ్ మున్సిపల్‌ కౌన్సిల్‌లో 13 సీట్లను సాధించింది. 2013లో కర్ణాటక స్థానిక ఎన్నికల్లోనూ 6 సీట్లను మజ్లిస్ గెలుచుకుంది. 2014లో మహారాష్ట్రలో రెండు అసెంబ్లీ ‍స్థానాల్లో గెలిచింది. 2017లో ఉత్తరప్రదేశ్ స్థానిక ఎన్నికల్లో 78 స్థానాల్లో పోటీ చేసి 31 స్థానాలు సాధించింది. గత లోక్‌సభ ఎన్నికల్లో ప్రకాశ్ అంబేడ్కర్ నేతృత్వంలోని వంచిత్ బహుజన్ అఘాది పార్టీతో చేతులు కలిపి మహారాష్ట్రలో ఒక లోక్‌సభ సీటును గెలుచుకున్నది. ఆ తర్వాత ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం గతంలో మాదిరి రెండు సీట్లను గెలుచుకోవడమే కాక కనీసం 10 స్థానాల్లో ఎస్‌సిపి-, కాంగ్రెస్‌పార్టీలకు నష్టం కలిగించడంతో పాటు బలమైన శివసేన, బిజెపి అభ్యర్థులను ఓడించగలిగింది. సరిగ్గా మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే బిహార్‌లోని కిషన్‌గంజ్ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో ఎంఐఎం విజయం సాధించి ఉత్తరాదిన చట్టసభల్లో కాలు మోపింది. దానితో రానున్న రోజుల్లో ఉత్తరాదిన ఎంఐఎం విస్తరించేందుకు బలమైన ప్రాతిపదిక ఏర్పడింది. పశ్చిమబెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేసేందుకు ఎంఐఎం సంసిద్ధమవుతోంది. 


మజ్లిస్ పార్టీ విస్తరిస్తున్న తీరు చూస్తుంటే స్వతంత్ర భారతదేశ చరిత్రలో జాతీయస్థాయిలో ఒక ముస్లిం పార్టీ ప్రప్రథమంగా నిలదొక్కుకునే అవకాశాలున్నాయని అల్ జజీరా విశ్లేషించింది. నిజానికి జాతీయస్థాయిలో ముస్లింలు సంఘటితం కావడానికి ప్రయత్నించడం ఇదే మొదటి సారి కాదు. బాబ్రీమసీదు కూల్చివేత అనంతరం కూడా కేరళ ముస్లింలీగ్‌కు చెందిన ఇబ్రహీం సులైమాన్ సైత్ ఈ మేరకు ప్రయత్నాలు చేశారు. స్వాతంత్ర్యానికి పూర్యం మహమ్మదాలీ జిన్నాతో కలిసి అఖిల భారత ముస్లింలీగ్ సదస్సులో పాల్గొన్న చరిత్ర గల సులైమాన్ సైత్ 1960లో రాజ్యసభలో ప్రవేశించారు. ఆ తర్వాత 1967 నుంచి 1996 వరకు మూడు దశాబ్దాలు లోక్ సభలో తన సత్తా ప్రదర్శించారు. బాబ్రీమసీదు కూల్చివేత తర్వాత దేశంలోని ముస్లిం నాయకులందరినీ ఏకం చేసేందుకు సైత్ ప్రయత్నించారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో జరిగిన సమావేశంలో అసదుద్దీన్ ఒవైసీ తండ్రి సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీతో పాటు అనేకమంది నేతలు పాల్గొన్నారు. పీవీ నరసింహారావు హయాంలో సులైమాన్ సైత్, సీనియర్ ఒవైసీ స్వచ్ఛమైన ఉర్దూలో పార్లమెంట్‌లో మాట్లాడడం ఒక అపూర్వఘట్టంగా ఉండేది. కాని స్వంత రాష్ట్రమైన కేరళలోనే ముస్లింలీగ్ సభ్యులు సహకరించకపోవడం, కాంగ్రెస్ ప్రభుత్వంలో పదవులు వదులుకోవడానికి నిరాకరించడంతో సైత్ జాతీయస్థాయిలో విజయవంతం కాలేకపోయారు. 


ఏ కాంగ్రెస్ వ్యతిరేకతతో సులైమాన్ సైత్, జాతీయస్థాయిలో ముస్లింలకు ఒక సంస్థ ఉండాల్సిన గుర్తించారో అదే మార్గంలో ఇప్పుడు హైదరాబాద్‌కు చెందిన అసదుద్దీన్ ఒవైసీ పయనించడం చెప్పుకోదగిన పరిణామం. సైత్ మాదిరి ఒవైసీ తమది కేవలం ముస్లింల పార్టీ కాదని, అణగారిన దళిత, బలహీన వర్గాలను కూడా కలుపుకుపోతామని చెప్పడం ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నది. మహారాష్ట్రలో ప్రకాశ్ అంబేద్కర్‌తో కలిసి పనిచేయడం ద్వారా ఎంఐఎం దళిత హిందూ ఓట్లను కూడా సాధించగలిగింది. కొన్ని చోట్ల హిందువులకు కూడా సీట్లు ఇచ్చింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎంఐఎం దళిత వర్గాలకు ప్రాతినిధ్యం వహించే బహుజన సమాజ్ పార్టీ, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీలతో కలిసి పోటీ చేసి మెరుగైన ఫలితాలను సాధించింది. నిజానికి దేశంలో ఇప్పటికీ అత్యధిక ముస్లింలు బిజెపియేతర పార్టీలకు ఓటు వేస్తున్నప్పటికీ ఎంఐఎం విస్తరిస్తున్న తీరు చూస్తుంటే, మున్ముందు దేశవ్యాప్తంగా ముస్లింలను ఆకర్షించే రోజులు ఎంతో దూరంలో లేవనిపిస్తోంది. విచిత్రమేమంటే ఈ పరిణామాన్ని ఒక చారిత్రక, సామాజిక కోణంతో అధ్యయనం చేసి తమ తీరుతెన్నుల్ని మార్చుకోకుండా కాంగ్రెస్ తదితర ప్రతిపక్షాలు తమ ఓట్లను చీలుస్తున్నందుకు ఒవైసీని వ్యక్తిగతంగా నిందించడం ఆశ్చర్యకరం. ఎంఐఎం నేతలు మాట్లాడుతున్న తీరు, లేవనెత్తుతున్న అంశాలు బిజెపి ఓటు బ్యాంకును సంఘటితం చేస్తున్నాయని కాంగ్రెస్ అనుకూల విమర్శకులు నేరుగా వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఒక అడుగు ముందుకు వేసి ఎంఐఎంను బిజెపికి ‘బీ’ పార్టీగా అభివర్ణించారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ కూడా దాదాపు అదే భాషను ప్రయోగిస్తున్నారు. 


మజ్లిస్ పార్టీ విస్తరించడం వల్ల బిజెపికి ప్రయోజనం, ప్రతిపక్షాలకు నష్టం జరుగుతుండవచ్చు. కానీ ఇవాళ ప్రతిపక్షాలు బలహీనంగా మారడానికి ఒవైసీ మాత్రం కారణం కాదన్నది స్పష్టం. 2014, 2019 సార్వత్రక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా దెబ్బతినడానికి ఆ పార్టీ స్వయంకృతాపరాధాలు, సంస్థాగత బలహీనతలు మాత్రమే కారణం. ఎంఐఎం వంటి పార్టీలు రంగప్రవేశం చేయడం వల్ల ఆ పార్టీ పతనం కాలేదు. ఒవైసీ అన్నట్లు గత లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో ఎంఐఎం పోటీ చేయకపోయినా బిజెపి 18 లోక్‌సభ సీట్లు గెలుచుకోగలిగింది. నిజానికి కాంగ్రెస్ పార్టీ ఒక్కో రాష్ట్రం కోల్పోవడానికి, ప్రాంతీయ పార్టీలు బలోపేతం కావడానికి కారణం సమాజంలోని విభిన్నశక్తులు ప్రత్యామ్నాయం కోసం, అస్తిత్వం కోసం ప్రయత్నించడమే. యుపి, బిహార్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో వెనుకబడిన వర్గాలు, దళితులు తమ అస్తిత్వం కోసం ప్రయత్నించినప్పుడు దేశంలో ముస్లింలు మాత్రం తమ అస్తిత్వం కోసం ఎందుకు ప్రయత్నించకూడదు? రాజ్యాంగం ఆ మేరకు ప్రతిబంధకాలు విధించలేదు కదా? ఈ దేశంలో అత్యధికులైన హిందువులను ఆకర్షించాలని భారతీయ జనతాపార్టీ ప్రయత్నిస్తున్నప్పుడు అల్పసంఖ్యాకులైన ముస్లింలను ఆకర్షించాలని ఎంఐఎం ప్రయత్నించడంలో తప్పేమున్నది? 


నిజానికి బిజెపి విస్తరిస్తున్న కొద్దీ అంతే వేగంతో కాకపోయినా, అతి స్వల్పస్థాయిలోనే అయినప్పటికీ ఎంఐఎం కూడా విస్తరిస్తోంది. చాలా చోట్ల ముస్లిం యువకులు ఎంఐఎంకు ఆకర్షితులవుతున్నారు. పార్లమెంట్‌లోనూ, బయటా పౌరసత్వ చట్టం, త్రిపుల్ తలాఖ్, కశ్మీర్ వంటి అంశాలపైనే కాదు, ముస్లింల సామాజిక పరిస్థితులను గురించి ఆ పార్టీ మాట్లాడుతోంది. లోక్‌సభలో ఒవైసీ ముస్లింల అంశాలపై ప్రతిభావంతంగా మాట్లాడుతుంటే, మరోవైపు కాంగ్రెస్‌తో పాటు కొన్ని పార్టీల నేతలు హిందూ ఓట్లను కోల్పోతామన్న భయంతో ముస్లింలకు సంబంధించిన అంశాలను మాట్లాడడం, ముస్లింలు నిర్వహించే సభల్లో పాల్గొనడం తగ్గిస్తున్నారు. బిహార్ ఎన్నికల్లో ఆర్‌జెడి, కాంగ్రెస్ ముస్లింలకు సంబంధించిన అంశాలను పెద్దగా ప్రస్తావించకపోవడమే ఇందుకు నిదర్శనం. ఇవాళ దేశభక్తికీ, హిందూత్వకు, సరిహద్దుల్లో పోరాడుతున్న సైన్యానికీ తామే గుత్త ప్రతినిధులమని బిజెపి నేతలు చెప్పుకుంటుంటే ప్రత్యామ్నాయ అంశాల గురించి, ప్రజాసమస్యల గురించి ఆలోచించాల్సిన కాంగ్రెస్ అగమ్యగోచర పరిస్థితిలో ఉన్నది. కొన్ని చోట్ల ఆ కోపాన్ని ఎంఐఎంపై ప్రదర్శిస్తోంది. నిజానికి ఒకప్పుడు ఇదే ఎంఐఎంతో కాంగ్రెస్ చెట్టపట్టాలు వేసుకుని నడిచిన విషయాన్ని విస్మరిస్తోంది. తామేమీ కాంగ్రెస్‌ను వదులుకోలేదని, ఆ పార్టీయే తన విధానాల ద్వారా తమను వదులుకున్నదని ఒవైసీ అనేక సందర్భాల్లో చెప్పారు. లౌకికవాద పార్టీలని చెప్పుకునే కాంగ్రెస్ వంటి పార్టీలు ముస్లింలకు చేయాల్సిన న్యాయం చేయలేదని, బిజెపి మైనారిటీ వ్యతిరేక విధానాలను వేలెత్తి చూపడం లేదని ఆయన విమర్శిస్తున్నారు. మహారాష్ట్రలో శివసేన సర్కార్‌కు కాంగ్రెస్ మద్దతునీయడాన్ని ఆయన ప్రశ్నిస్తున్నారు.


ఎంఐఎం విస్తరించడం వల్ల నిజంగా బిజెపి బలపడ్డా అందుకు ఆ పార్టీని వెలెత్తి చూపడం కంటే అది విస్తరించడానికి కారణమైన కాంగ్రెస్, తదితర ప్రతిపక్షాలను విమర్శించాల్సిన అవసరం ఎక్కువగా ఉన్నది. ముస్లింల కంటే ముందుగానే దళితులు, బీసీలు కాంగ్రెస్‌కు దూరమయ్యారు. లోక్‌సభలోని 543 మంది సభ్యుల్లో ముస్లింలు కేవలం 27 మంది మాత్రమే ఉన్నారు. 2006లో రాజేంద్ర సచార్ కమిటీ సమర్పించిన నివేదిక ప్రకారం దేశంలో ముస్లింల ఆర్థిక సామాజిక పరిస్థితులు, అత్యంత దయనీయంగా ఉన్నాయి. వీటి గురించి మాట్లాడకుండా మతం చుట్టూ ఈ దేశ రాజకీయాలు తిరగడం ఇప్పుడు దురదృష్టకర పరిణామం.


ఎ. కృష్ణారావు

ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి

Updated Date - 2020-11-25T06:19:01+05:30 IST