
ఎవరైనా ఫోన్ చేసి బ్యాంక్ అకౌంట్ నెంబర్, డిటైల్స్ అడిగితే చెప్పవద్దని తరచుగా సందేశాలు వస్తుంటాయి. సైబర్ నేరాలకు గురి కావొద్దని హెచ్చరికలు వస్తుంటాయి. అయినా కొంత మంది వాటి పట్ల అవగాహన పెంచుకోకుండా మోసపోతూ ఉంటారు. చదువు లేని నిరక్ష్యరాస్యులే కాదు.. ఆర్మీ మేజర్ స్థాయి వ్యక్తి కూడా ఇలాంటి మోసానికి గురయ్యారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన ఆర్మీ మేజర్ తన బ్యాంక్ అకౌంట్ వివరాలు చెప్పి ఏకంగా 1.80 లక్షలు పోగొట్టుకున్నారు.
జోధ్‌పూర్‌లో పని చేస్తున్న ఆర్మీ మేజర్ సొహైల్ అహ్మద్‌కు ఈ నెల 6వ తేదీన ఓ ఫోన్ కాల్ వచ్చింది. మీ కేవైసీ అప్డేట్ చేసుకోవాలని, లేకపోతే బ్యాంక్ ఖాతా నిలిచిపోతుందని ఫోన్ చేసిన వ్యక్తి హెచ్చరించాడు. దాంతో సొహైల్ తన అకౌంట్ నెంబర్, ఇతర వివరాలను ఫోన్ చేసిన వ్యక్తికి చెప్పాడు. ఆ తర్వాత పలు దఫాలుగా సొహైల్ అకౌంట్ నుంచి రూ.1.88 లక్షలు విత్ డ్రా అయ్యాయి.
సొహైల్ ఇటీవల తన అకౌంట్‌ను చెక్ చేయగా ఈ విషయం బయటపడింది. దీంతో వెంటనే ఆయన స్థానిక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సైబర్ పోలీసులు నిందితుడిని ట్రేస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.