సినిమా రివ్యూ: మేజర్‌(Major)

Published: Fri, 03 Jun 2022 11:34:55 ISTfb-iconwhatsapp-icontwitter-icon
సినిమా రివ్యూ: మేజర్‌(Major)

సినిమా రివ్యూ: మేజర్‌(Major review)

విడుదల తేది: 03–06–2022

నటీనటులు: అడివి శేష్‌, (Adivi sesh)సయీ మంజ్రేకర్‌(sayee manjrekar), శోభితా దూళిపాల, మురళీశర్మ, ప్రకాశ్‌రాజ్‌,  రేవతి, అనీశ్‌ కురువిల్లా తదితరులు. 

కథ – స్ర్కీన్‌ ప్లే : అడివి శేష్‌

మాటలు–స్ర్కిప్ట్‌ గైడెన్స్‌: అబ్బూరి రవి 

సంగీతం: శ్రీచరణ్‌ పాకాల

సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు

నిర్మాతలుని: మహేష్‌ బాబు, నమ్రతా శిరోద్కర్‌, అనురాగ్‌ రెడ్డి, శరత్‌ చంద్ర (Maheshbabu)

దర్శకత్వం: శశికిరణ్‌ తిక్కా. (Sasi kiran tikka)

నిన్నటి తరాల తెలుగు మహారచయిత అడివి బాపిరాజు గారి మనవడు అడివి శేష్‌ది నటనలోనూ, కథలు రాయడంలోనూ ప్రత్యేక శైలి. ‘క్షణం’, ‘గూఢచారి’, ‘ఎవరు’ చిత్రాలు అందుకు నిదర్శనం. తాజాగా ఆయన కథ అందించి నటించిన చిత్రం ‘మేజర్‌’. 26/11 ముంబై ఉగ్రదాడుల్లో దేశం కోసం తన ప్రాణాలను అర్పించి, అమరుడైన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. శశికిరణ్‌ దర్శకుడు. సందీప్‌ పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోతో ఈ సినిమా ప్రస్తావన మొదలైనప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకులకు ఆసక్తి పెరిగింది. దీనికి తోడు మహేశ్‌బాబు నిర్మాత కావడం కూడా జనాల్లో ఆసక్తి రేకెత్తించింది. అమరవీరుడి కథ కావడం, ట్రైలర్లు ఆసక్తిగా ఉండడంతో సినిమాకు మరింత హైప్‌ వచ్చింది. కరోనా కారణంగా వాయిదాపడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈ శుక్రవారం ప్యాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైంది. సందీప్‌ ఉన్నికృష్ణన్‌ కథ ఏంటి? దానిని తెరపై ఎలా ఆవిష్కరించారు? సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం. (Review major)


కథ: 

సందీప్‌ ఉన్నికృష్ణన్‌ (అడివి శేష్‌adivi sesh)కు చిన్నప్పటి నుంచి నేవీలో చేరాలని కోరిక. ఒకట్రెండు ప్రయత్నాలు చేసినా విఫలం అవుతాయి. తల్లిదండ్రులు (ప్రకాశ్‌రాజ్‌–రేవతి)లకు తను నేవీలోకి వెళ్లడం ఇష్టం ఉండదు. అయినప్పటికీ పట్టు వదలకుండా ప్రయత్నాలు చేస్తాడు. అయితే తర్వాతి ప్రయత్నంలో తన క్లాస్‌మేట్‌ ఈషా(సయీ మంజ్రేకర్‌) సూచనతో ఆర్మీలో చేరాలనుకుంటాడు. అనుకున్నట్లుగానే ఆర్మీలో చేరి ఎన్‌.ఎస్‌.జీ కమాండోలకు శిక్షణ ఇచ్చే స్థాయికి చేరుకుంటాడు. విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి బరిలోకి దిగే.. ‘51 ఎస్‌.ఏ.జీ’ టీమ్‌కు సారథ్యం వహిస్తాడు. ఆ సమయంలో ముంబై తాజ్‌ హోటల్లో ఉగ్ర దాడి జరుగుతుంది. ఆ సమయంలో మేజర్‌ ఉన్నికృష్ణన్‌ తీసుకున్న స్టాండ్‌ ఏంటి? ఉగ్రవాదులను అంతమొందించడానికి మేజర్‌ సందీప్‌ ఏం చేశాడు. తాజ్‌ హోటెల్‌ బందీలుగా ఉన్న అమాయక ప్రజలను ఎలా కాపాడాడు? దాని కోసం తన ప్రాణాల్ని ఎలా పణంగా పెట్టాడు అన్నది కథ. (Major movie review)

సినిమా రివ్యూ: మేజర్‌(Major)

విశ్లేషణ: 

26/11 ఉగ్రదాడికి ముందు మేజర్‌ సందీప్‌ జీవితం ఎలా ఉండేది. తల్లిదండ్రులతో అనుబంధం, స్కూల్‌ డేస్‌, లవ్‌స్టోరీ, ఆర్మీ శిక్షణ తీసుకునేటప్పుడు అతని తీరు, సైనికుడు అంటే అర్థం తెలుసుకున్న విధానం, తాజ్‌ హోటల్‌ సంఘటన సమయంలో పై అధికారులతో జరిగిన సంభాషణ, దేశం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా బరిలోకి దిగిన తీరు ఇలా సందీప్‌ జీవితంలో ముఖ్యమైన అంశాల సమాహారమే ఈ సినిమా. అతి చిన్న వయసు అంటే 31 ఏళ్ల వయసులోనే దేశ సేవలో భాగంగా అమరుడయ్యాడు. అశోక చక్ర బిరుదుతో ఘనంగా నివాళి అర్పించింది మన దేశం. 26/11 సంఘటన సమయం నుంచి సందీప్ గురించి దేశవ్యాప్తంగా ఆయన త్యాగనిరతిని కొనియాడుతూ ప్రజలు మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇవన్నీ ‘మేజర్‌’ సినిమా తీయడానికి కథగా మారాయి. దేశం కోసం ప్రాణాలు అర్పించే జవాను కథ అనగానే ఎమోషన్‌ ఉంటుంది. ఎలాంటి వ్యక్తి అయినా ఈ తరహా కథకు కనెక్ట్‌ అవుతారు. అయితే ఉగ్రదాడులకు ముందు సందీప్‌ లైఫ్‌ ఎలా ఉండేది అన్నది ఈ చిత్రంలో చెప్పే ప్రయత్నం చేశారు. బాల్యం, చదువు, టీనేజ్‌ లవ్‌స్టోరీ, పేరెంట్స్‌, సొసైటీపై తనకుంటూ గౌరవం, ఆర్మీ ఆలోచన, అతను ఎదిగిన తీరు ఇవన్నీ కళ్లకు కట్టినట్టు చూపించారు దర్శకుడు శశికిరణ్‌. అయితే ఈ కథ కోసం ఎంత పరిశోధన చేశారనేది తెరపై కనిపిస్తుంది. ఫస్టాఫ్‌ అంతా సందీప్‌ బాల్యం, లవ్‌స్టోరీ కెరీర్‌పై తన ఆలోచనల గురించి చూపించి ముంబై ఎటాక్‌ను సెకెండాఫ్‌లో చూపించారు. సందీప్‌ బాల్యాన్ని మనసుకు హత్తుకునేలా చూపించారు. సందీప్‌, ఈషాల మధ్య ప్రేమకథను క్యూట్‌గా చూపించారు. ‘మేజర్‌ కథ అంటున్నారు... లవ్‌, లవర్‌ రొమాన్స్‌ ఇవన్నీ ఏంటి? అనే భావన కలిగేలా కొన్ని సన్నివేశాలు ఉన్నా.. ‘సైనికుడిలా బతికి చూపిస్తా’ అని కమాండర్‌కి ఇచ్చిన మాటల ముందు అవేమీ అంతగా పట్టించకోవలసిన పని లేదు అనిపిస్తుంది. ఫస్టాఫ్‌ కాస్త స్లోగా సాగినా సెకెండాఫ్‌ ప్రారంభం నుంచి ముంబై దాడుల నేపథ్యంలోనే సాగడంతో ఆసక్తి రేకెత్తించింది. తాజ్‌లో బందీలుగా ఉన్న ప్రజల్ని రక్షించడానికి మేజర్‌ వ్యూహాలు, చావుకి ఎదురువెళ్తున్నాం అని తెలిసి కూడా శత్రువులను హతమార్చిన తీరు భావోద్వేగానికిగురి చేస్తాయి. దేశభక్తిని తట్టి లేపేలా ఉంది. ఎటాక్‌ సన్నివేశం మొత్తం ఎంతో ఉత్కంఠగా సాగుతుంది. చివరకు మిగిలిన ఆరుగురు ఉగ్రవాదులను అంతమొందించడానికి మేజర్‌ పడిన తపన చూస్తే దేశభక్తి అంటే ఇది కదా అన్నట్లు అనిపిస్తుంది. చివరి 20 నిమిషాలు ఊహకు అందనట్లు ఆసక్తికరంగా సాగింది. ప్రాణాలు పోతున్నా దేశ రక్షణే ధ్యేయం, బాధ్యతగా సాగిన సందీప్‌ పోరాటం హృద్యంగా, మనసుకు హత్తుకునేలా, దేశభక్తిని పెంపొందించేలా ఉంది. క్లైమాక్స్‌లో ప్రకాశ్‌రాజ్‌ సంభాషణలు కంటతడిపెట్టిస్తాయి. సినిమా పూర్తయ్యాక సగటు ప్రేక్షకుడు బరువెక్కిన గుండెతో బయటకు వెళ్తాడు. ఆ తరహాలో దర్శకుడు భావోద్వేగాలను పండించాడు. తను అనుకున్నట్లు తెరపై ఆవిష్కరించగలిగాడు. ఈ తరహా కథలు చాలా వచ్చినప్పటికీ ఈ కథ మాత్రం మరో కోణంలో తెరకెక్కించబడింది. కథకు కొన్ని లిమిటేషన్స్‌ ఉన్నప్పటికీ ఎంతవరకూ కథ చెప్పాలో అదే చెప్పాడు. నటీనటులు విషయానికొస్తే... సందీప్‌గా అడివి శేష్‌ ఒదిగిపోయి నటించారు. ‘ఇలాంటి పాత్ర చేయాలంటే ప్రాక్టీస్‌ చేయడమో, అనుకరించడమో చేస్తే పాత్ర పండదు.. చేయాల్సిన పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయాలంతే’ అని చెప్పినట్లుగానే శేష్‌ తెరపై చేసి చూపించారు. పాత్రకు తగ్గట్లు తనని తాను మలచుకున్నారు. కొత్త తరహా పాత్రలు ఎంచుకోవడంలో తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకున్నారు. శేష్‌ ఎన్ని అద్భుతమైన పాత్రలు చేసినా... ఇందులో క్లైమాక్స్‌లో సీన్‌ మాత్రం ఇప్పటికీ గుర్తుండిపోతుంది. ఈషాగా సయీ మంజ్రేకర్‌ ఆకట్టుకున్నారు. స్కూల్‌ సీన్స్‌లో బావున్నారు. అయితే తన ఒంటరితనం గురించి చెబుతున్నప్పుడు కాస్త భావోద్వేగాలను పండించి ఉంటే బావుండేది. ప్రకాశ్‌రాజ్‌ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నూటికి నూరు శాతం మేజర్‌ తండ్రి పాత్రకు న్యాయం చేశారు. కొడుకు గురించి పడే ఆరాటం, క్లైమాక్స్‌లో ఇచ్చిన స్పీచ్‌ హృద్యంగా అనిపించాయి. తల్లిగా రేవతి మెప్పించారు. ఆర్మీ అధికారిగా మురళీ శర్మ అద్భుతమైన నటన కనబర్చారు. శోభిత పాత్ర చిన్నదే అయినా ప్రత్యేకత ఉంది. హోటల్‌లో చిక్కుకున్న మహిళగా, చిన్నపాపను కాపాడటానికి తను పడే తపన ఆకట్టుకున్నాయి. ఇలాంటి కథలకు సాంకేతిన నిపుణుల సహకారం చాలా అవసరం. ఫొటోగ్రఫీ, నేపథ్య సంగీతం సినిమాకు ఎసెట్‌. ఫస్టాఫ్‌లో సాగదీతగా అనిపించిన సన్నివేశాలకు లైట్‌గా కత్తెర వేసుంటే బావుండేది. ఎటాక్‌ సీన్స్‌లో కొరియోగ్రఫీ సినిమాకు మేజర్‌ ఎసెట్‌. అబ్బూరి రవి సింపుల్‌గా ఉన్నాయి. ఆకట్టుకున్నాయి. కథకు ఏం కావాలో అవే రాశారు. 

దేశరక్షణలో భాగంగా ఎంతోమంది సైనికులు ప్రాణత్యాగం చేశారు. అమరులైన వారి కోసం మనం చేసేది     ఏమీలేదు – చేయగలిగిందీ ఏమీ లేదు. ఇలాంటి సినిమాల రూపంలో వారి ఖ్యాతిని గుర్తు చేసుకోవడం, నివాళి అర్పించడం తప్ప. (major movie review)


ట్యాగ్‌లైన్‌: అమర సైనికులందరికీ నివాళిFollow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International