ఊపందుకున్న ప్రచారం

ABN , First Publish Date - 2021-03-07T07:30:17+05:30 IST

మున్సిపల్‌ ఎన్నికల్లో అభ్యర్థుల విజయం కోసం ఆయా పార్టీల ముఖ్యనేతలు వార్డు బాట పట్టి ప్రచారం సాగిస్తున్నారు

ఊపందుకున్న ప్రచారం
తిరుపతి కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా పసిబిడ్డకు అన్నం పెడుతున్న సీపీఐ నేత నారాయణ

నగరి, పుత్తూరుల్లో రోజా కుటుంబీకుల ప్రచారం


పలమనేరులో 8 వార్డులపై నేతల నిర్లక్ష్యం


తిరుపతి, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. తమ అభ్యర్థుల విజయం కోసం ఆయా పార్టీల ముఖ్యనేతలు వార్డు బాట పట్టి ప్రచారం సాగిస్తున్నారు. తిరుపతిలో  అధికార పార్టీ అభ్యర్థుల తరపున ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి సుడిగాలి ప్రచారం సాగిస్తున్నారు. రోజుకు ఐదారు డివిజన్లలో  అభ్యర్థులను వెంటబెట్టుకుని వీధుల్లో నడుస్తూ ప్రజలకు అభివాదం చేస్తూ మద్దతు కోరుతున్నారు.మరోవైపు ఆయన కుమారుడు అభినయ్‌రెడ్డి తెరవెనుక అభ్యర్థుల గెలుపు కోసం కసరత్తు సాగిస్తున్నారు. ఇక టీడీపీ విషయానికొస్తే మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తిరుపతి పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు నరసింహయాదవ్‌, రాయలసీమ మీడియా కోఆర్డినేటర్‌ శ్రీధర్‌వర్మ తదితరులు అభ్యర్థుల కోసం ప్రచారం చేపడుతున్నారు. సుగుణమ్మ రోజుకు ఐదు నుంచీ ఏడు డివిజన్ల దాకా పర్యటిస్తున్నారు. శనివారం టీడీపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం ఛైర్మన్‌ నరసింహప్రసాద్‌ కోయదొర వేషంలో రెడ్డి అండ్‌ రెడ్డి కాలనీ, రైల్వే కాలనీ, భవానీనగర్‌ తదితర ప్రాంతాల్లో అభ్యర్థుల కోసం చేసిన ప్రచారం ప్రజలను ఆకట్టుకుంది. బీజేపీ అభ్యర్థుల కోసం ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొనగా జనసేన అభ్యర్థుల విజయానికి నియోజకవర్గ ఇంఛార్జి కిరణ్‌ రాయల్‌ ఇంటింటి ప్రచారం సాగిస్తున్నారు.3వ డివిజన్‌లో సీపీఐ అభ్యర్థి ఎం.బాబును గెలిపించాలంటూ ఆ పార్టీ  జాతీయ కార్యదర్శి కె.నారాయణ శనివారం డప్పుకొట్టి ప్రచారాన్ని ప్రారంభించారు.డివిజన్‌లోని కాలనీల్లో ఇంటింటి ప్రచారం చేశారు. 


చిత్తూరులో నేతల ఇంటింటి ప్రచారం

చిత్తూరు నగరంలో 50 డివిజన్లకు గానూ 37 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.పాలకవర్గ ఏర్పాటుకు అవసరమైన స్థానాలు ఏకగ్రీవం కావడంతో మిగిలిన డివిజన్లలో ఎన్నికలకు నిజానికి ప్రాధాన్యత లేదు. అయినా వైసీపీ, టీడీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని మిగిలిన 13 డివిజన్లలో ప్రచారం సాగిస్తున్నాయి. వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు ఇంటింటి ప్రచారం చేపట్టారు.ఆ పార్టీలో ముఖ్యనేతలు విజయానందరెడ్డి, బుల్లెట్‌ సురేష్‌ తెరవెనుక వుండే గెలుపుకు కసరత్తు చేస్తున్నారు. ఇక టీడీపీ అభ్యర్థులను గెలిపించడం కోసం ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు పార్లమెంటు అధ్యక్షుడు పులివర్తి నాని, మాజీ మేయర్‌ కటారి హేమలత తదితరులు ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. రెండు రోజుల వ్యవధి మాత్రమే వుండడంతో ఇరువైపులా ప్రచారం జోరందుకుంది.


మదనపల్లెలో ప్రచార సందడి

మదనపల్లె మున్సిపాలిటీలో అధికార పార్టీ అభ్యర్థుల తరపున ఎమ్మెల్యే నవాజ్‌ బాషా ప్రచారంలో పాల్గొంటూండగా టీడీపీ తరపున తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌చినబాబు, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్‌ తనయుడు యశస్విరాజ్‌ ప్రచారంలో దిగారు. బీజేపీ అభ్యర్థుల కోసం ఆ పార్టీ సీనియర్‌ నేత చల్లపల్లె నరసింహారెడ్డి ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. మరోవైపు కాంగ్రెస్‌ అభ్యర్థుల వెంట మాజీ ఎమ్మెల్యే షాజహాన్‌ బాషా కూడా ఓటర్లను కలసి మద్దతు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. కాగా 2వ వార్డులో టీడీపీ అభ్యర్థి బరిలో లేకపోవడంతో అక్కడి సీపీఎం అభ్యర్థి శ్రీనివాసులుకు టీడీపీ మద్దతిస్తున్నట్టు మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్‌ శనివారం ప్రకటించారు. టీడీపీ మాజీ కౌన్సిలర్‌ పంచరత్న బాబు వైసీపీలో చేరగా 1వ వార్డు టీడీపీ అధ్యక్షుడు డ్యాన్స్‌రెడ్డి ఉదయం వైసీపీలో చేరి ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. సాయంత్రానికల్లా కండువా తీసిపడేసి మళ్ళీ టీడీపీ అభ్యర్థుల గెలుపుకోసం ప్రచారం చేశారు.


నగరి, పుత్తూరుల్లో పోటాపోటీ ప్రచారం

నగరి, పుత్తూరు మున్సిపల్‌ ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ వర్గాలు పోటాపోటీగా ప్రచారం చేపట్టాయి.టీడీపీ తరపున నియోజకవర్గ ఇంఛార్జి గాలి భానుప్రకాష్‌ అన్నీ తానై ప్రచారంలోకి దిగారు. అభ్యర్థుల గెలుపు కోసం రెండు పట్టణాల్లో సుడిగాలి ప్రచారం సాగిస్తున్నారు. అధికార పార్టీ విషయానికొస్తే ఎమ్మెల్యే రోజా సైతం రెండు పట్టణాల్లో ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఆమెకు సాయంగా అభ్యర్థుల వెంట ఎమ్మెల్యే కుటుంబీకులు మొత్తం ప్రచారంలోకి దిగారు.  


పలమనేరులో ప్రచారంపై పార్టీల నిర్లక్ష్యం

పలమనేరు మున్సిపాలిటీలో 26 వార్డులుంటే అందులో 18 వార్డులు ఏకగ్రీమయ్యాయి. అన్నీ వైసీపీ పరం కావడంతో పాలకవర్గం ఏర్పాటుకు ఢోకా లేకుండా పోయింది. మిగిలిన 8 వార్డుల్లో ఎన్నికలు నామమాత్రమే అయ్యాయి.వాటి ఫలితాలతో నిమిత్తం లేకుండాపోయింది. దీంతో ఆయా వార్డుల్లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థుల గురించి వైసీపీ, టీడీపీ ముఖ్యనేతలెవరూ  పట్టించుకోవడం లేదని సమాచారం. చివరికి ఆయా వార్డుల్లో ప్రచారాలకు కూడా వెళ్ళడం లేదని, కనీసం వారి గురించి ఆరా కూడా తీయడం లేదని ఆయా పార్టీల్లో ప్రచారమవుతోంది.దీంతో అభ్యర్థులు తమ వెంట ఒకరిద్దరితోనే ఇంటింటికీ వెళ్ళి కరపత్రాలు అందజేసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. 



Updated Date - 2021-03-07T07:30:17+05:30 IST