కరపత్రం ఆవిష్కరిస్తున్న వేణుమాధవ్ తదితరులు
సిద్దిపేట అర్బన్/కొండపాక, మార్చి 27 : బీసీ సబ్బండ వర్గాలకు న్యాయం కోసం ఈ నెల 29న సిద్దిపేటలో కొండ మల్లయ్య గార్డెన్లో జరిగే బీసీ చైతన్య సదస్సును జయప్రదం చేయాలని ఓబీసీ మోర్చా రాష్ట్ర కన్వీనర్ మేక వేణుమాధవ్ అన్నారు. చైతన్య సదస్సును జయప్రదం చేయాలని ఆదివారం సిద్దిపేటలో కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎ్‌సకు ఆయువు పట్టు అయిన సిద్దిపేట నుంచే సదస్సు ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా ఈటల రాజేందర్, బండి సంజయ్, లక్ష్మణ్ హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ పోరాటంలో బీసీ సబ్బండవర్గాలు కీలకపాత్ర పోషించినా బీసీలకు ఎక్కడ న్యాయం జరగలేదని అన్నారు. కొన్ని బీసీ కులాలకు చెందినవారు ఇప్పటివరకు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీ చూడలేదని అన్నారు. టీఆర్ఎస్ డబ్బు ఉన్నవారికి, కాంట్రాక్టర్లకు మాత్రమే టికెట్లు ఇస్తున్నదని ఆరోపించారు. సదస్సుకు మేధావులు, బీసీ బంధువులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పూల బాలకృష్ణారెడ్డి, పత్రి శ్రీనివాస్, గుండ్ల జనార్ధన్, కిరణ్ పాల్గొన్నారు. కొండపాక మండలం కుకునూరుపల్లి బస్టాండ్ ఆవరణలో సిద్దిపేటలో 29న జరిగే బీసీ చైతన్య సదస్సుకు సంబంధించిన పోస్టర్‌ను బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పేర్ల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి రాములు, ఓబీసీ మండలాధ్యక్షుడు స్వామి ఆవిష్కరించారు. ఇందులో నాయకులు దాసరి స్వామి, లింగం ఉన్నారు.