మహాధర్నాను విజయవంతం చేయండి

ABN , First Publish Date - 2022-07-03T06:15:40+05:30 IST

హైదరాబాద్‌లో ఈనెల 7న హైదరాబాద్‌లో తలపెట్టిన మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యుఎస్పీసీ రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు, డీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం రఘుశంకర్‌రెడ్డి ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.

మహాధర్నాను విజయవంతం చేయండి
ఐక్యతను చాటుతున్న ఉపాధ్యాయ సంఘాల నేతలు

-యుఎస్పీసీ రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు రఘుశంకర్‌రెడ్డి 

కరీంనగర్‌ టౌన్‌, జూలై 2: హైదరాబాద్‌లో ఈనెల 7న హైదరాబాద్‌లో తలపెట్టిన మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యుఎస్పీసీ రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు, డీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం రఘుశంకర్‌రెడ్డి ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. శనివారం కరీంనగర్‌ ఫిలింభవన్‌లో నిర్వహించిన సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.  ఉద్యమాల ద్వారా సాధించుకున్న తెలంగాణ పాఠశాల విద్యారంగం క్షీణదశకు చేరుకుందని విమర్శించారు. ఉపాధ్యాయులకు ఏడేళ్లుగా పదోన్నతులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. వందలాది పర్యవేక్షక పోస్టులు, వేలాదిగా ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేసే అవకాశాలున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. ఉపాధ్యాయులకు సీఎం ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చక పోవడం ప్రభుత్వ నిర్లక్ష్యవైఖరికి నిదర్శనమని అన్నారు. అప్‌గ్రేడెడ్‌ పండిట్‌, పీఈటీల్లో పదోన్నతులకు సంబంధించి న్యాయపరమైన వివాదాల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వానికి విద్యారంగంపై చిత్తశుద్ది లేదని అన్నారు. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం అనివార్యంగా జూలై 7న మహాధర్నా నిర్వహిస్తున్నామని, ఉపాధ్యాయులు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. స్టీరింట్‌ కమిటీ రాష్ట్ర సభ్యుడు, బీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కొమ్ము రమేశ్‌ మాట్లాడుతూ ఉపాధ్యాయులకు కొత్తగా అదనపు సౌకర్యాలను అడగడం లేదని, ఉన్నత చదువులు చదివి కేరీర్‌పరంగా పదన్నోతులు పొందాలని ప్రతి ఉపాధ్యాయుడికి ఉంటుందని అన్నారు. వేలాది మందికి అర్హత ఉన్నప్పటికీ సర్వీసులో ఒక్క పదోన్నతి కూడా పొందకుండా రిటైర్‌ అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బదిలీలు, పదోన్నతుల నియామకాలు ప్రతి సంవత్సరం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. ఇప్పటి వరకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాం ఇవ్వకుండా విద్యావ్యవస్థను నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో యుఎస్పీసీ రాష్ట్ర కమిటీ సభ్యులు లక్ష్మారెడ్డి, మాడుగుల రాములు, వి రాజిరెడ్డి, శ్రీధర్‌, కోహెడ చంద్రమౌళి, జి ఎల్లయ్య, బి సురేశ్‌, జిల్లా కమిటీ సభ్యులు ముల్కల కుమార్‌, పోరెడ్డి దామోదర్‌రెడ్డి, గడ్డం సత్యనారాయణరెడ్డి, ఎండీ ఖలీలుద్దీన్‌, బిజిలి కనుకయ్య, బి శ్రీనివాస్‌, ఆర్‌ చంద్రశేఖర్‌రావు, తూముల తిరుపతి, టి శ్రీనివాస్‌, గడ్డం మల్లేశం పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-03T06:15:40+05:30 IST