రైతును రాజు చేయడం రాహుల్‌తోనే సాధ్యం

ABN , First Publish Date - 2022-05-07T06:01:40+05:30 IST

తెలంగాణ రైతులని అనేక సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే తెలంగాణలో రాజకీయ మార్పు జరగాలి. ఈ మార్పు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో సమస్యలు పరిష్కరించి రైతులకు బంగారు బాట వేశారు. రైతును రాజు చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా అధికారం చేపట్టి, రాహుల్ గాంధీ నేతృత్వంలో నిర్దిష్టమైన ప్రణాళికతో సమగ్ర వ్యవసాయ విధానం తీసుకొచ్చి రైతులని ఆదుకుంటుంది...

రైతును రాజు చేయడం రాహుల్‌తోనే సాధ్యం

తెలంగాణ రైతులని అనేక సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే తెలంగాణలో రాజకీయ మార్పు జరగాలి. ఈ మార్పు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో సమస్యలు పరిష్కరించి రైతులకు బంగారు బాట వేశారు. రైతును రాజు చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా అధికారం చేపట్టి, రాహుల్ గాంధీ నేతృత్వంలో నిర్దిష్టమైన ప్రణాళికతో సమగ్ర వ్యవసాయ విధానం తీసుకొచ్చి రైతులని ఆదుకుంటుంది.


స్వరాష్ట్ర సాధనకు పాటుపడ్డ ప్రతి సామాజికవర్గాన్నీ కేసీఆర్ తన స్వార్ధం కోసం దగా చేసిండు. అడుగడుగునా ఆశలు కల్పించి గొంతు కోసిండు. తెలంగాణ ఉద్యమ లక్ష్యాలను సర్వనాశనం చేసి, అమరుల త్యాగాల ఫలితాలను ఉద్యమ ద్రోహులకు కట్టబెట్టిన కేసీఆర్, ఇప్పడు భారతీయ రాష్ట్ర సమితి అంటూ జాతీయ రాజకీయాల కబుర్లు చెబుతూ ప్రజలను కొత్త భ్రాంతిలోకి నెట్టి మూడోసారి తెలంగాణను కబళించాలనే కుట్ర చేస్తుండు. స్వార్థ రాజకీయాల కోసం లక్షలాది రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతుండు కేసీఆర్. నియంత్రిత సాగు విధానం పేరు చెప్పి వరి వేయవద్దని ఒకసారి, వెయ్యమని మరోసారి, వరి వేస్తే కేసులు పెడతామని ఇంకోసారి రైతులను ఆగమాగం చేసిండు.


రాష్ట్రపతి ఎన్నికలు మొదలుకొని, నిన్నటి రైతు వ్యతిరేక చట్టాలకు మద్దతు ఇచ్చి, బిజెపికి ‘బి’ టీమ్‌గా అంటకాగిన కేసీఆర్.. ఉన్నటుండి వరి కొనుగోళ్ల విషయంలో లేని సమస్యను సృష్టించి, చిల్లర రాజకీయాలు చేసిండు. 2021లో ఎవరినీ సంప్రదించకుండానే, భవిష్యత్‌లో తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని ఎఫ్‌సిఐకి లేఖ ఇచ్చిన కేసీఆర్, తర్వాత యూటర్న్ తీసుకొని కేంద్రం బాయిల్డ్ రైస్ తీసుకోనంటోందని కయ్యానికి కాలుదువ్వాడు. రైతులను అనేకరకాల ఇబ్బందులు పెట్టిన కేసీఆర్, రైతులు పండించిన పంటలో 30 నుంచి 40 శాతం దళారులకు అమ్ముకునే పరిస్థితులు కల్పించాడు. రైతుల తరఫున దీక్ష చేస్తున్నట్లు నటించి, చివరకు తానే కొంటున్నట్లు ప్రకటించడం పచ్చి మోసం.


కేసీఆర్ వరి వేయవద్దన్న ఆదేశాలతో, కొందరు రైతులు దాదాపు 10 లక్షల ఎకరాలలో శెనగలు, కందులు, పల్లి వంటి ప్రత్యామ్నాయ పంటలు వేసుకున్నారు. వారికి కనీస మద్దతు ధర లభించక, తక్కువ ధరలకు అమ్ముకుని నష్ట పోతుండ్రు. ఈ యాసంగి సీజన్లో తన ఫార్మ్ హౌస్ 100 ఎకరాలలో వరి పంట వేసుకున్న కేసీఆర్, రైతులకు మాత్రం వరి వేయొద్దని చెప్పాడు. దీంతో రైతులు ఏ పంటా వేయకుండా లక్షల ఎకరాల భూములు పడావ్ పెట్టారు. ఇప్పుడు కొనుగోలు సెంటర్లు పెట్టి రైతుల ధాన్యం కొంటానని ప్రకటించిండు. మరి ప్రభుత్వ మాటలు విని వరి వేయని రైతులకు పరిహారం ఎవరు చెల్లిస్తారు?


బీజేపీ ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా రాకేశ్ టికాయిత్ దీక్ష చేస్తున్నప్పుడు కేసీఆర్ కనీసం మద్దతు తెలుపకపోగా మోదీతో కలిసి రైతు వ్యతిరేక చట్టాలకు జై కొట్టారు. కానీ ఢిల్లీలో దీక్ష సందర్భంగా టికాయిత్‌ను పక్కన కూర్చుబెట్టుకున్నడు. ఇంతకంటే అవకాశవాద రాజకీయం ఉంటుందా?


టీఆర్ఎస్ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు రుణమాఫీ చేస్తామని చెప్పి ఆరు విడతలుగా అమలు చేయడం వల్ల ఆ డబ్బులు వడ్డీలకు కూడా సరిపోలేదు. 2018 ముందస్తు ఎన్నికల సమయంలో మరోసారి లక్ష రూపాయల వరకు పంట రుణాలను ఒకే వాయిదాలో మాఫీ చేస్తామని చెప్పి, ఓట్లు దండుకుని ఇప్పటివరకు మాఫీ చేయలేదు. రైతులు తీసుకున్న పంటల రుణాల మొత్తం రూ.25,936 కోట్లు ఉంటే, గత 4 బడ్జెట్లలో పేరుకే రూ.20,389.20 కోట్లు కేటాయించి, ఇప్పటివరకూ కేవలం రూ.1,098 కోట్లు మాత్రమే మాఫీ చేశారు. ప్రభుత్వం మాఫీ చేస్తది అనే ఆశతో ఆగిన రైతులకు బ్యాంకు వడ్డీ రెండింతల భారం అయ్యింది. గత 8 యేండ్ల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు వడ్డీ రాయితీ ఇస్తలేవు.


కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జాతీయ పంటల బీమా పథకం ద్వారా రైతులు భీమా ప్రీమియం కట్టుకుంటే పంట నష్టం జరిగినప్పుడు నష్టపరిహారం వచ్చేది. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చాక పంటల బీమా రంగంలో ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి ఇవ్వడంతో రైతులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. రాష్ట్రంలో 2020 నుండి అటు కేంద్రం, ఇటు రాష్ట్రం పూర్తిగా పంటల బీమా పథకాల అమలును నిలిపివేశాయి. 2018, 2019 సంవత్సరాలకు కేసీఆర్ ప్రభుత్వం ఇన్సూరెన్స్ ప్రీమియం వాటా కట్టకపోవడంతో రైతులకు ఇప్పటివరకూ నష్టపరిహారం అందలేదు. ఈ సంవత్సరం భారీ వర్షాలు పడి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంటలు నష్టపోతే, మంత్రులు వెళ్ళి చూసినా రైతులకు నష్టపరిహారం మాత్రం రాలేదు. ఈ సంవత్సరం పత్తితో పాటు అన్ని పంటల దిగుబడి పడిపోయింది. అయినా ప్రభుత్వం ఏ సహాయం చేస్తలేదు. 


దేశంలో రైతుల ఆత్మహత్యలలో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. రాష్ట్రంలో రోజుకు సగటున ముగ్గురు, ఏడాదికి వేయి మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మొత్తంగా కేసీఆర్ పాలనలో ఇప్పటివరకు దాదాపు 7,500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. తెలంగాణలో జీవో 194 ప్రకారం ఈ కుటుంబాలకు నష్టపరిహారం అందలేదు. తెలంగాణలో ఉన్న దాదాపు 15 లక్షల మంది కౌలు రైతులను, వారి సమస్యలను గుర్తించకపోవటం కేసీఆర్ అహంకారానికి పరాకాష్ట. ఆత్మహత్య చేసుకున్న రైతులలో 80 శాతం మంది కౌలురైతులే. ఉమ్మడి రాష్ట్రంలో భూ ఆధీకృత సాగుదారుల చట్టం–2011 అమలులో ఉండేది. ఈ చట్టం ప్రకారం కౌలు రైతులను గుర్తించి వారికి ఎల్ఈసి కార్డులు పంపిణీ చేయాలి. ఆర్థిక భారం లేకుండా సాఫీగా వ్యవసాయం చేసుకునే విధంగా కౌలు రైతులకు సహాయం అందించాలి. దానిని కూడా కేసిఆర్ తుంగలో తొక్కారు.


భూములను కబ్జా చేసేందుకు టిఆర్ఎస్ పార్టీ అధికారికంగా చేపట్టిన కుట్రపూరిత విధానమే ధరణి. భూ సమస్యలు పరిష్కారించాలని రెవెన్యూ అధికారుల చుట్టూ రైతులు కాళ్ళు అరిగేలా తిరుగుతున్నారు. కొందరు విసిగి వేసారి ఆత్మహత్యలు చేసుకున్నారు. వివాదాస్పద భూములనే నెపంతో లక్షల ఎకరాలను పార్ట్–బిలో పెట్టి వాటిని పరిష్కరిస్తామని దొడ్డిదారిన అవినీతికి పాల్పడుతున్నారు. సాంకేతిక సమస్యలను సాకుగా చూపించి రెవెన్యూ సమస్యలను పెండింగ్‌లో పెడుతున్నారు. చాలా పట్టా భూములను నిషేధిత జాబితాలోకి నెట్టి, ఏ ఒక్కరి సమస్యా పరిష్కరించలేదు.


భూ పోరాటాల ద్వారా సాధించుకుని సాగుచేసుకుంటున్న రైతుల భూములకు పట్టాలియ్యకుండా, 50–60 ఏండ్ల క్రితం భూములు వదిలేసిపోయిన భూస్వాముల పేర్ల మీద రికార్డులు చూపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన భూములకు కూడా పట్టా పాసు పుస్తకాలు ఇవ్వడం లేదు. పోడు భూముల సమస్య పరిష్కరిస్తామని చెప్పి ఆ భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ పేదలకు సాగు కోసం ఇచ్చిన భూములను శ్మశానవాటికలు, రైతు వేదికలు, ప్రకృతి వనాల పేరు చెప్పి లాక్కుంటున్నారు.


టిఆర్ఎస్, బిజెపి ప్రభుత్వాలు దొందూదొందే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. పసుపు బోర్డు తెస్తానని బిజెపి, నిజాం షుగర్ ఫ్యాక్టరీ తిరిగి తెరుస్తామని టిఆర్ఎస్ నమ్మబలికి తెలంగాణ ప్రజలను మోసం చేశాయి. మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు బిజెపి ప్రభుత్వం కొవిడ్ వల్ల కష్టాలుపడ్డ ప్రజానీకంపై పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి కారణమైంది. ఎలక్ట్రిసిటీ సరఫరా చేసే డిస్కంలను ప్రైవేటీకరించాలని ప్రయత్నిస్తోంది. మరోపక్క టిఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు పన్నులు పెంచి ప్రజలను దోచుకుతింటోంది.


ఇవాళ తెలంగాణ రైతులని అనేక సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే తెలంగాణలో రాజకీయ మార్పు జరగాలి. ఈ మార్పు కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీతోనే సాధ్యం. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో రైతులు సమస్యల పరిష్కరించి రైతులకు బంగారు బాట వేశారు. రైతును రాజు చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ, రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా అధికారం చేపట్టి, రాహుల్ గాంధీ నేతృత్వంలో నిర్దిష్టమైన ప్రణాళికతో రైతుల సమస్యలని పరిష్కరించి సమూలమైన వ్యవసాయ విధానం తీసుకొచ్చి రైతులని ఆదుకుంటుంది. తెలంగాణ రైతును రాజు చేయడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం – అది రాహుల్ గాంధీతోనే సాధ్యం.

 డా. శ్రవణ్ దాసోజు 

అధికార ప్రతినిధి, భారత జాతీయ కాంగ్రెస్ 

Read more