తనయుడి చెంతకు తల్లి.. మలక్‌పేట పోలీసులపై ప్రశంసల జల్లు

ABN , First Publish Date - 2020-12-11T18:14:05+05:30 IST

ఓ వృద్ధురాలు మిస్సింగ్ కేసును మలక్‌పేట పోలీసులు ఛేదించారు. అర్ధరాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. చివరకు ఆమె ఆచూకీ కనుగొని, తనయుడి చెంతకు చేర్చారు.

తనయుడి చెంతకు తల్లి..  మలక్‌పేట పోలీసులపై ప్రశంసల జల్లు

హైదరాబాద్: ఓ వృద్ధురాలు మిస్సింగ్ కేసును మలక్‌పేట పోలీసులు ఛేదించారు. అర్ధరాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. చివరకు ఆమె ఆచూకీ కనుగొని, తనయుడి చెంతకు చేర్చారు. వివరాల్లోకి వెళితే.. బీహార్‌కు చెందిన శంకర్ షా కుటుంబం నగరంలోని మలక్‌పేట్‌లో నివాసం ఉంటుంది. వృద్ధురాలైన ఆయన తల్లి సికిలీ దేవి గురువారం తెల్లవారుజామున ఇంటి నుంచి బయటకు వచ్చి దారితప్పిపోయింది. ఆమె ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు ... చుట్టు పక్కల ప్రాంతాల్లో వెదికి.. లాభం లేకపోవడంతో మలక్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. భోజ్‌పురి మాత్రమే తెలిసిన ఆమె ఆచూకీ కోసం పోలీసులు అవిశ్రాంతంగా గాలింపు చేపట్టారు. గురువారం అర్ధరాత్రి ఆమె ఆచూకీ కనుగొన్నారు. డబీర్ పురాలో ఉన్నట్లు సమాచారం రావడంతో.. అక్కడికి చేరుకుని వృద్ధురాలిని గుర్తించి కుమారుడికి అప్పగించారు. కుమారుడిని చూసిన ఆ తల్లి ఒక్కసారిగా భోరుమంది. ఈ ఘటన అక్కడున్న వారిని కదిలించింది. పోలీసులు స్పందించిన తీరు పట్ల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కానిస్టేబుళ్లు నవీన్, సందీప్‌లను అభినందిస్తూ ఈస్ట్ జోన్ డీసీపీ ఎం రమేశ్ ట్వీట్ చేశారు. 




Updated Date - 2020-12-11T18:14:05+05:30 IST