దళితుల జీవితాలను ప్రస్ఫుటించిన.. మాలపల్లి

ABN , First Publish Date - 2021-12-05T05:30:00+05:30 IST

ఎంతోమంది దళితుల జీవితాలను ప్రస్ఫుటించేలా వ్యవహారిక భాషలో వచ్చిన తొలి నవల మాలపల్లి అని ఆంధ్రజ్యోతి సంపాదకుడు కే శ్రీనివాస్‌ తెలిపారు.

దళితుల జీవితాలను ప్రస్ఫుటించిన.. మాలపల్లి
లక్ష్మీనారాయణ దంపతుల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న ఆంధ్రజ్యోతి సంపాదకులు కె. శ్రీనివాస్‌ తదితరులు

సాత్విక మార్గంలో జాతినిర్మాణానికి ఉన్నవ కృషి

సదస్సులో ఆంధ్రజ్యోతి సంపాదకులు కె. శ్రీనివాస్‌


గుంటూరు(విద్య), డిసెంబరు 5: ఎంతోమంది దళితుల జీవితాలను ప్రస్ఫుటించేలా వ్యవహారిక భాషలో వచ్చిన తొలి నవల మాలపల్లి అని ఆంధ్రజ్యోతి సంపాదకుడు కే శ్రీనివాస్‌ తెలిపారు. సాహిత్య అకాడమి, అమరావతి సామాజిక అఽధ్యయన సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం గుంటూరులోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో జరిగిన మాలపల్లి నవల శతజయంతి సదస్సులో ఆయన కీలకోపన్యాసం చేశారు. అప్పటిదాక గ్రాంధికం, ప్రాచీన భాషల్లో రచనలు చేసిన ఉన్నవ మాలపల్లి నవలను వాడుక భాషలో  రాసి విమర్శకుల నుంచి ప్రశంసలు మాత్రమే కాకుండా వ్యతిరేకతను ఎదుర్కొన్నారన్నారు.  జాతీయ భావం ద్వారానే సమాజంలో అంతరాలు తొలగిపోతాయని ఉన్నవ లక్ష్మీనారాయణ గట్టిగా విశ్వసించారని తెలిపారు. దళితులకు న్యాయం చేయడం కోసం మతాన్ని నాశనం చేయడం తగదని తన రచనల ద్వారా ఆయన వివరించారన్నారు. మతాంతరీకరణను వ్యతిరేకించారని చెప్పారు. ఉన్నవ రాసిన ఎన్నో రచనలు ఇంకా మరుగునపడి ఉన్నాయని వాటికి ప్రాచుర్యం కల్పించాల్సిన అవశ్యకత ఉందన్నారు.


మైనార్టీలపై వైరం పెంచేలా నేటి నేతల తీరు

ప్రజల్లో నెలకొన్న అంతరాలు తొలగించి జాతీయభావం పెంచడానికి నాటి తరం నేతలు ఎంతో కృషి చేశారని చెప్పారు. అయితే నేటి పాలకులు మాత్రం మైనార్టీలపై వైరం పెంచి మెజార్టీల ప్రజల మొప్పుపొందాలని ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మతప్రాతిపదికన జాతి నిర్మాణం చేయడానికి నేటితరం నేతలు ప్రయత్నిస్తున్నారన్నారు. ఇందులో భాగంగా అసహనాన్ని దేశంలో ప్రవహించేలా చేస్తున్నారని ఆరోపించారు. పరిచయ కార్యక్రమంలో అమరావతి సామాజిక అధ్యాయన సంస్థ వ్యవస్థాపకుడు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ మాట్లాడుతూ మహాప్రస్తానం, గబ్బిలం, మాలపల్లి మూడింటిని కలిపి ఒక పుస్తకం తయారు చేస్తే అది భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌ అవుతుందన్నారు. ప్రారంభ సమావేశంలో సాహిత్య అకాడమి సంచాలకుడు కే శివారెడ్డి మాట్లాడుతూ వందేళ్ల నాటి మాలపల్లి నవలలో నేటి సామాజిక పరిస్థితులను ప్రతిబింబించడం ఆశ్చర్యం కలిగిస్తోందని తెలిపారు. స్వాగతోపన్యాసంలో సాహితి అకాడమి కార్యదర్శి కే.శ్రీనివాసరావు మాట్లాడుతూ కథలు, నాటకాలు, నవలల ద్వారా ఉన్నవ లక్ష్మీనారాయణ లక్షల మందిని ప్రభావితం చేశారని కొనియాడారు. ప్రముఖ కవి పాపినేని శివశంకర్‌ అధ్యక్షతన జరిగిన మరో సమావేశంలో సాహితీవేత్తలు వైఎస్‌ కృష్ణేశ్వరరావు, పెనుగొండ లక్ష్మీనారాయణ, కొప్పర్తి వెంకటరమణమూర్తి మాలపల్లిపై పరిశోధనా పత్రాలను సమర్పించారు. వాసిరెడ్డి నవీన్‌ అధ్యక్షతన జరిగిన రెండో సెషన్‌లో తెలుగు సాహిత్యంలో బృహన్నవలలు - మాలపల్లి స్థానం అనే అంశంపై కాత్యాయనీ విద్మహే, మాలపిల్ల - సాహిత్య విమర్శలపై పీసీ వెంకటేశ్వర్లు, అంటరానితనం - స్వాతంత్రోద్యమ అవగాహనపై అట్లూరి మురళి, ప్రత్యామ్నాయ ప్రాపంచిక దృక్పథం - కక్కడు నుంచి జగ్గడు అనే అంశాలపై రాచపాళెం చంద్రశేఖరరెడ్డి ప్రసంగించి, పరిశోధనా పత్రాలు సమర్పించారు. ముగింపు సమావేశంలో పీఏ దేవి మాట్లాడుతూ శతాబ్ధాల పాటు పాతుకుపోయిన కుల వివక్షతకు అంతం పలకాలంటే సుదీర్ఘమైన పరిణామం అవసరమని, అలాంటి ప్రస్థానంలో ఒక మైలు రాయి మాలపల్లి అన్నారు. వాగ్గేయకారుడు గోరటి వెంకన్న మాట్లాడుతూ మాలపల్లి నవల ద్వారా గ్రామీణ, జీవన సౌందర్యాన్ని కళ్లకు కట్టినట్లు ఉన్నవ లక్ష్మీనారాయణ వివరించారన్నారు. ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ జాతీయోద్యమంలో సంస్కరణ, వామపక్ష, రైతాంగ, కార్మిక ఉద్యమాలు వంటి రకరకాల ఉద్యమాలు ఉన్నా వీటన్నింటి కలయికే మాలపల్లి నవల అన్నారు. కార్యక్రమ నిర్వాహకులు కొండూరు వీరయ్య సదస్సును సమన్వయం చేయగా కార్యక్రమంలో పెద్దసంఖ్యలో సాహితీ అభిమానులు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-12-05T05:30:00+05:30 IST