ప్రభావం తగ్గుతోంది ... భారీగా తగ్గిన మలేరియా తీవ్ర ప్రభావిత గ్రామాల సంఖ్య

ABN , First Publish Date - 2021-03-01T05:24:57+05:30 IST

గత రెండేళ్లుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మలేరియా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఇదే సమయంలో మలేరియా ప్రభావిత గ్రామాల సంఖ్య గతంతో పోలిస్తే భారీగా తగ్గింది. దీంతో రాబోయే మలేరియా సీజన్‌కు జిల్లా మలేరియా శాఖ అధికారులు కేవలం 297 గ్రామాల్లోనే మలేరియా ప్రబలకుండా ఆల్పాసైఫర్‌ మైత్రిన్‌(ఏసీఎం) స్ర్పేను చేపట్టాల్సి ఉంటుందని తేల్చారు.

ప్రభావం తగ్గుతోంది ...   భారీగా తగ్గిన మలేరియా తీవ్ర ప్రభావిత గ్రామాల సంఖ్య
పంపిణీకి సిద్దంగా ఉన్న దోమ తెరలు

రూ.40లక్షలతో బడ్జెట్‌ ప్రతిపాదనలు

501 గ్రామాల్లో దోమ తెరల పంపిణీకి రంగం సిద్ధం

వేదిస్తున్న సిబ్బంది కొరత 

నేటి నుంచి దోమతెరల పంపిణీ

భద్రాచలం, ఫిబ్రవరి 28: గత రెండేళ్లుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మలేరియా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఇదే సమయంలో మలేరియా ప్రభావిత గ్రామాల సంఖ్య గతంతో పోలిస్తే భారీగా తగ్గింది. దీంతో రాబోయే మలేరియా సీజన్‌కు జిల్లా మలేరియా శాఖ అధికారులు కేవలం 297 గ్రామాల్లోనే మలేరియా ప్రబలకుండా ఆల్పాసైఫర్‌ మైత్రిన్‌(ఏసీఎం) స్ర్పేను చేపట్టాల్సి ఉంటుందని తేల్చారు. ఈ క్రమంలో రూ.40 లక్షలతో బడ్జెట్‌ ప్రతిపాదనలు రూపొందించి మలేరియా శాఖ ఉన్నతాధికారుల ఆమోదానికి పంపారు. కాగా ఇటీవల జిల్లాలోని 27పీహెచ్‌సీల పరిధిలో మలేరియా కేసులను తగ్గుముఖం పట్టించేందుకు అర్హులైన వారికి పంపిణీ చేసేందుకు 1,63,174 దోమతెరలు రాగా వాటిని సైతం పంపిణీ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. వీటిని వివిధ పీహెచ్‌సీలకు తరలించేందుకు రూ.31లక్షల నిధులు సైతం వచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే మలేరియా శాఖలో అధికారులు సిబ్బంది పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉంటుండటం ఆ శాఖను వేధిస్తోంది. గత ఏడాది మలేరియా కేసులు 364 మాత్రమే నమోదయ్యాయి.  గత ఏడాది కరోనా వైరస్‌ వ్యాప్తి నేపధ్యంలో ప్రజలు తమ ఆరోగ్యం పట్ల దృష్టి నిలపడంతో పాటు జాగ్రత్తలను తీసుకోవడంతో అదిపరోక్షంగా మలేరియా పాజిటివ్‌ కేసులు తగ్గడానికి దోహదపడింది. 2020లో కరోనాతో పరిస్థితి ఇందుకు భిన్నమైంది. రాకపోకలు ఎక్కడికక్కడ స్తంభించడం అవసరమైన వారే రాకపోకలు సాగించడంతో అది మలేరియా తగ్గుముఖంపై ప్రభావం చూపిందని వైద్యవర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా వివిధ కారణాలతో గత రెండేళ్లుగా మలేరియా కేసులు తగ్గినా ఈ ఏడాది సైతం అదే రీతిన మలేరియా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుతుందని చెప్పలేమని వైద్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.  

తగ్గుతున్న మలేరియా తీవ్ర ప్రభావిత గ్రామాల సంఖ్య 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2019లో 756 గ్రామాలుమలేరియా తీవ్ర ప్రభావిత గ్రామాలుగా అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో అక్కడ మలేరియా ప్రబలకుండా రెండు దఫాలుగా ఆల్పాసైఫర్‌ మైత్రిన్‌(ఏసీఎం) స్ర్పేయింగ్‌ను నిర్వహించారు. 2019లో 604 మలేరియా పాజిటివ్‌ కేసులుండగా దీంతో 2020లో అధికారులు 444 గ్రామాలను మలేరియా తీవ్ర ప్రభావిత గ్రామాలుగా గుర్తించారు. ఈ క్రమంలో 2020లో 364 పాజిటివ్‌ కేసులు రాగా ఈసారి మలేరియా ప్రభావిత గ్రామాల సంఖ్య 297కు తగ్గింఆచరు. ఈ ఏడాది జనవరిలో 19, ఫిబ్రవరిలో ఇప్పటి వరకు 38 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గత ఏడాది ఇదే సమయానికి 77 పాజిటివ్‌ కేసులుండగా ఈ ఏడాది ఆ సంఖ్య 57అని మలేరియా శాఖ అధికారులు పేర్కొంటున్నారు.  

వేధిస్తున్న సిబ్బంది కొరత

జిల్లాలో మలేరియా విభాగంలో అధికారులు, సిబ్బంది కొరత ఆ శాఖను వేధిస్తోంది. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం మలేరియా శాఖలో ఖాళీలను భర్తీ చేయకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. జిల్లా మలేరియాఅధికారి పోస్టు ఒకటి మంజూరు కాగా ఇంత వరకు భర్తీ చేయలేదు. దీంతో ఇన్‌చార్జ్‌గా నర్సాపురం వైద్యుడు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఏవో పోస్టు ఒకటి మంజూరు కాగా ఒకటి ఖాళీగా ఉంది. సబ్‌ యూనిట్‌ ఆఫీసరు పోస్టు ఒకటి, ఎంపీహెచ్‌ఎస్‌ పురుషులు 15, ఏపీహెచ్‌ఎస్‌ స్ర్తీలు ఒకటి, హెల్తు అసిస్టెంట్లు మహిళలు(71) ఖాళీగా ఉన్నాయి. ల్యాబ్‌ టెక్నీషియన్‌లు 8, ఆశాలు 35, డీవీబీడీ కన్సల్‌టెంట్‌ పోస్టులు ఒకటి, డాటా ఎంట్రీ ఆపరేటరు పోస్టు ఒకటి ఖాళీగా ఉంది. 

నేటి నుంచి దోమతెరల పంపిణీ

డాక్టర్‌ మోకాళ్ల వెంకటేశ్వరరావు, జిల్లా మలేరియా అధికారి 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అర్హులైన గిరిజనులకు ఒకటో తేదీనుంచి దోమ తెరలను పంపిణీ చేయనున్నాం. జిల్లాలోని 27పీహెచ్‌సీల్లో ఉన్న 104 సబ్‌సెంటర్ల పరిధిలో 501 గ్రామాల్లో 1,63,175 దోమ తెరలను పంపిణీ చేయనుండగా ఈ క్రమంలో 2,76,062 పరిధిలోకి రానున్నారు. ఇందుకు సంబంధించి దోమతెరలను సంబంధిత పీహెచ్‌సీలకు తరలించేందుకు రూ.31 లక్షలు నిధులు ఇప్పటికే వచ్చాయి. ఈ మొత్తంతో దోమ తెరలను పీహెచ్‌సీలకు తరలించేందుకు వెచ్చించనున్నారు. అలాగే ఆశాల నిర్వహణకు సైతం వెచ్చిస్తాం.  


Updated Date - 2021-03-01T05:24:57+05:30 IST