‘మహా’ మంత్రి నవాబ్‌ మాలిక్‌ అరెస్ట్‌

ABN , First Publish Date - 2022-02-24T07:36:57+05:30 IST

మహారాష్ట్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి, ఎన్సీపీ సీనియర్‌ నేత నవాబ్‌ మాలిక్‌(62) అరెస్టయ్యారు. ...

‘మహా’ మంత్రి నవాబ్‌ మాలిక్‌ అరెస్ట్‌

‘దావూద్‌’ మనీలాండరింగ్‌ కేసులో 

అదుపులోకి తీసుకున్న ఈడీ 

అండర్‌ వరల్డ్‌ డాన్‌, అతని అనుచరుల కోసం

వివాదాస్పద ఆస్తులు కొన్నారని ఆరోపణలు

రియల్‌ ప్రాజెక్టుల్లో బినామీ పెట్టుబడులు కూడా..

ఐదు గంటల పాటు విచారణ.. అనంతరం అరెస్టు

మార్చి 3 వరకు ఈడీ కస్టడీకి అనుమతించిన జడ్జి

పోరాడతాం.. గెలుస్తాం..: మాలిక్‌

90ల్లో నన్నూ ఇలాగే టార్గెట్‌ చేశారు: పవార్‌

2024లో దర్యాప్తులకు మీరూ సిద్ధం కండి: రౌత్‌

మాలిక్‌ తక్షణమే రాజీనామా చేయాలి: బీజేపీ


ముంబై, ఫిబ్రవరి 23: మహారాష్ట్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి, ఎన్సీపీ సీనియర్‌ నేత నవాబ్‌ మాలిక్‌(62) అరెస్టయ్యారు. అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీంకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఆయన్ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడంలో ఆయన క్రియాశీల పాత్ర పోషించారని ఈడీ తీవ్ర ఆరోపణలు చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థల వినియోగంపై మహారాష్ట్రలో ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని ‘మహా వికాస్‌ అఘాడీ’ ప్రభుత్వం, కేంద్రం మధ్య గత కొన్ని రోజులుగా మాటల యుద్ధం జరుగుతున్న వేళ.. మంత్రి అరెస్టు రాజకీయ కలకలంసృష్టించింది. మాలిక్‌ అల్లుడిని ఎన్సీబీ అధికారులు గత ఏడాది డ్రగ్స్‌ కేసులో అరెస్టు చేశారు. తర్వాత ముంబై తీరంలోని ఓ నౌకలో జరిగిన రేవ్‌ పార్టీలో డ్రగ్స్‌ వినియోగించారన్న కేసులో షారూక్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ను కూడా అరెస్టు చేశారు.


అప్పటి నుంచి మాలిక్‌ ఎన్సీబీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడేపై పదేపదే ఆరోపణలు చేస్తూ పతాక శీర్షికలకు ఎక్కారు. కేం ద్ర దర్యాప్తు సంస్థలను మోదీ సర్కారు స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని ఆరోపించారు. ఈ క్ర మంలో తాజాగా దావూద్‌ ఇబ్రహీం కేసులో ఆయన్ను ఈడీ అధికారులు అరెస్టు చేయడం గమనార్హం. దావూ ద్‌, అతని అనుచరుల కోసం మాలిక్‌ పలుచోట్ల వివాదాస్పద ఆస్తులు కొనుగోలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. కొన్ని రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టుల్లో బినామీ పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించిందని సమాచారం. మనీలాండరింగ్‌ కేసు విచారణలో భాగంగా బుధవారం ఉదయం నుంచి ఈడీ అధికారులు ముంబైలోని తమ కార్యాలయంలో మాలిక్‌ను ప్రశ్నించారు. దావూద్‌ బంధువులతో సంబంధాలపై ఆరా తీశారు. 5 గంటల పాటు ప్రశ్నించిన తర్వాత మధ్యాహ్నం మాలిక్‌ను అరెస్టు చేశారు. ఇదే కేసులో ఇటీవల దావూద్‌ సోదరుడు ఇబ్రహీం కస్కర్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కస్కర్‌ తెలిపిన విషయాల ఆధారంగా మాలిక్‌కు నోటీసులు జారీ చేశారు. ప్రశ్నించిన అనంతరం ఆయన్ను అదుపులోకి తీసుకొని వైద్య పరీక్షల కోసం తరలిస్తుండగా.. మీడి యా ప్రతినిధులకు నవ్వుతూ అభివాదం చేశారు. ‘‘మేం పోరాడతాం. గెలుస్తాం.


అన్ని విషయాలనూ బయటపెడతాం’’ అన్నారు. అన్ని ప్రశ్నలకూ సమాధానాలు దాటవేయడంతోనే అరెస్టు చేసినట్లు వెల్లడించారు. సాయంత్రం మాలిక్‌ను సెషన్స్‌ కోర్టులో హాజరుపరిచారు. ముంబయి పేలుళ్ల కేసులోని దోషులతో మాలిక్‌కు సంబంధాలు ఉన్నాయని, ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడంలో ఆయన క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారని కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో ఈడీ ఆరోపించింది. మాలిక్‌ నుంచి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉందని, ఆయన్ను 14 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరింది. పీఎంఎల్‌ఏ కోర్టు ప్రత్యేక జడ్జి ఆర్‌.ఎన్‌.రోకడే మాలిక్‌కు మార్చి 3 వరకు రిమాండ్‌ విధించారు. కేసులో తదుపరి విచారణ కోసం ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చారు. 


నోటీసులివ్వకుండానే..!

మాలిక్‌కు నోటీసులు ఇవ్వకుండానే ఈడీ అధికారులు ఆయన ఇంటికి వచ్చారని ఎన్సీపీ నేతలు ఆరోపించారు. ‘‘భయపడేది లేదు. తల వంచేదీ లేదు. 2024కి రెడీ’’ అని ఎన్సీపీ పేర్కొంది. మాలిక్‌ను ప్రశ్నిస్తున్నప్పుడే ఎన్సీపీ కార్యకర్తలు ఈడీ ఆఫీసు సమీపంలోని తమ పార్టీ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ‘‘కేంద్రం ఓ విషయం గుర్తుపెట్టుకోవాలి. 2024లో వారూ విచారణకు సిద్ధం కావాలి’’ అని సేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ అన్నారు. దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తుండడాన్ని ప్రశ్నించినందుకే మాలిక్‌ను అరెస్టు చేశారని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ ఆరోపించారు. మాలిక్‌ అరెస్టును ఖండించిన బెంగాల్‌ సీఎం మమత.. పవార్‌కు అండగా ఉంటామన్నారు. మాలిక్‌ను పదవి నుంచి తప్పించబోమని మహారాష్ట్ర సర్కారు ప్రకటించింది. మాలిక్‌ మంత్రి పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్‌ చేసింది.

Updated Date - 2022-02-24T07:36:57+05:30 IST