కన్నీటి కష్టాలు

ABN , First Publish Date - 2021-05-10T07:04:35+05:30 IST

నెత్తిన బిందె... చంకలో చిన్నారులు.. ఇది వారికి నిత్య కృత్యం... మంచినీళ్లు కావాలంటే కిలో మీటరు కాలినడకన వెళ్లి రావాల్సిందే... సమాజం అభివృద్ధి చెందుతున్నా ఆ గిరిజన ప్రాంతం ఇంకా వెనుకబడే వుంది. అదే మల్లారం గ్రామం. మోతుగూడెం సమీపంలోని ఈ అటవీ ప్రాంతానికి సుమారు 25 సంవత్సరాల క్రితం కొన్ని కుటుంబాలు వచ్చి స్థిరపడ్డాయి.

కన్నీటి కష్టాలు

  • మల్లారం గిరిజనులకు గుక్కెడు నీళ్లు దొరకడం కష్టమే
  • సుదూరం వెళ్లి వాగునీరు తెచ్చుకోవడానికి మహిళల పాట్లు
  • గ్రామంలో మౌలిక వసతులు మృగ్యం 
  • కన్నెత్తి చూడని అధికారులు

మోతుగూడెం, మే 9: నెత్తిన బిందె... చంకలో చిన్నారులు.. ఇది వారికి నిత్య కృత్యం... మంచినీళ్లు కావాలంటే  కిలో మీటరు కాలినడకన వెళ్లి రావాల్సిందే... సమాజం అభివృద్ధి చెందుతున్నా ఆ గిరిజన ప్రాంతం ఇంకా వెనుకబడే వుంది. అదే మల్లారం గ్రామం. మోతుగూడెం సమీపంలోని ఈ అటవీ ప్రాంతానికి సుమారు 25 సంవత్సరాల క్రితం కొన్ని కుటుంబాలు వచ్చి స్థిరపడ్డాయి. వారికి అన్ని పథకాలూ అందుతున్నా గొంతు తడుపుకునేందుకు గుక్కెడు నీళ్లు దొరకట్లేదు. ఇక్కడ 15 ఏళ్ల క్రితం సీఆర్పీఎఫ్‌ అధికారులు బోరు తవ్వించారు. అయితే దాని ద్వారా కేవలం మూడు, నాలుగు బిందెల నీళ్లు మాత్రమే వస్తాయి. ఆ తర్వాత అంతా మురికినీరే వస్తుంది. దీంతో వారు ఆ గ్రామ సమీపంలోని వాగు వద్దకు వెళ్లి నీరు తెచ్చుకుంటున్నారు. ఆ వాగులోని నీరు కలుషితంగా ఉండడంతో గిరిజనులు మలేరియా, టైఫాయిడ్‌, విష జ్వరాల బారిన పడుతున్నారు. ఇంత జరుగుతున్నా కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చూపిస్తున్నారు. అంతేగాక ఈ గ్రామానికి వెళ్లడానికి సరైన రహదారి లేదు. విద్యుత వెలుగులూ లేవు. రాత్రిళ్లు కటిక చీకట్లోనే జీవనం. మంచినీటి సమస్యపై ఎంపీడీవో పి.వెంకటరత్నాన్ని వివరణ కోరగా... బోర్లకు మరమ్మతులు చేయిస్తామని, విద్యుత సమస్యపై అధికారులతో చర్చించి పరిష్కార మార్గం చూస్తామన్నారు. కాగా మంచినీటి సమస్య పరిష్కారానికి సర్పంచ ఆకేటి సీత నడుంబిగించారు. ఎంత లోతులో బోరు తవ్వినా నీరు రాకపోడంతో గ్రామస్తులతో చర్చించారు. ఊరి చివర ఉన్న వాగు నుంచి పైపులైను ద్వారా నీరు అందించాలని అధికారులను కోరారు.


Updated Date - 2021-05-10T07:04:35+05:30 IST