ఆసుపత్రిలో అవకతవకలు

ABN , First Publish Date - 2022-07-07T06:58:21+05:30 IST

రిమ్స్‌ ఆసుపత్రిలో రోగులకు ఆహార సరఫరా(డైట్‌)లో భారీ అక్రమాలు, అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఓ ఔట్‌ సోర్సింగ్‌ సంస్థ అడ్డదారిలో డైట్‌ కాంట్రాక్ట్‌ను దక్కించుకున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల పరోక్ష సహకారంతో

ఆసుపత్రిలో అవకతవకలు
జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ ఆసుపత్రి

రిమ్స్‌ రోగుల ఆహార సరఫరా టెండర్‌లో భారీ అక్రమాలు 

నిబంధనలకు విరుద్ధంగా అనుభవం లేని సంస్థకు టెండర్‌ అప్పగింత

ఎవరు కోర్టును ఆశ్రయించకుండా ముందే కేవీటీ (కోర్టు హెచ్చరిక ఆదేశాలు)    తీసుకున్న కాంట్రాక్టర్‌

లక్షల రూపాయల్లో చేతులు మారినట్లు ఆరోపణలు

జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా.. చర్యలు కరువు

అధికారుల నిర్లక్ష్యం.. రోగుల పాలిట శాపంగా మారుతోందన్న ఆరోపణలు

ఆదిలాబాద్‌, జూలై 6(ఆంధ్రజ్యోతి): రిమ్స్‌ ఆసుపత్రిలో రోగులకు ఆహార సరఫరా(డైట్‌)లో భారీ అక్రమాలు, అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఓ ఔట్‌ సోర్సింగ్‌ సంస్థ అడ్డదారిలో డైట్‌ కాంట్రాక్ట్‌ను దక్కించుకున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల పరోక్ష సహకారంతో నకిలీ ఔట్‌ సోర్సింగ్‌ సంస్థల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోందన్న ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రతియేటా రిమ్స్‌ ఆసుపత్రిలో కలుషిత ఆహారం భారీన పడి ఎంతో మంది అస్వస్థతకు గురవుతున్నా.. అధికారులకు కనువిప్పు కలుగడం లేదు. ఏదో ఒక సంఘటన జరిగినప్పుడే హడావుడి చేయడం, ఆ తర్వాత అంతా మాములుగానే మారిపోతోంది. ఈ యేడు కూడా రిమ్స్‌ ఆసుపత్రి ఆహార సరఫరాకు అధికారులు టెండర్లు పిలువగా.. మొత్తం తొమ్మిది మంది ఔట్‌ సోర్సింగ్‌ నిర్వాహకులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో అర్హత లేదన్న కారణంగా మహాలక్ష్మి, మణికంఠ, కృష్ణ కన్‌స్ట్రక్షన్‌ ఔట్‌ సోర్సింగ్‌ సంస్థల దరఖాస్తులను తిరస్కరించారు. మిగితా ఆరు ఔట్‌ సోర్సింగ్‌ సంస్థలకు అన్ని రకాల అర్హతలు ఉన్నాయని అధికారులు ప్రకటించారు. కాని చివరకు ఎంపిక చేయడంలో నిబంధనలను గాలికి వదిలేశారు. మొదట తిరస్కరించిన కృష్ణ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీకే మళ్లీ రిమ్స్‌ డైట్‌ టెండర్‌ను కేటాయించడంపై ఫిర్యాదులు వస్తున్నాయి. గతంలో ఆసుపత్రు ల్లో రోగులకు ఆహారాన్ని సరఫరా చేసిన, ఎలాంటి అనుభవం లేని కృష్ణ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీకి ఆహార సరఫరా బాధ్యతలు అప్పగిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేయడం వెనుక ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై ఇప్పటికే కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లినా.. అంతా డీడీఎంసీ (జిల్లా డైట్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ) చూసుకుంటుందంటూ తేలికగా తీసిపారేసినట్లు తెలుస్తుంది. రిమ్స్‌ డైట్‌ విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించక పోవడంతోనే ప్రతియేటా రోగులు, వారి బంధువులు, విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న సంఘటనలు పునరావృతమవుతూనే ఉన్నాయి. అధికారుల నిండు నిర్లక్ష్యం రోగుల పాలిట శాపంగా మారుతుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

నిబంధనలు గాలికి..

ఎలాంటి అనుభవం లేని ఔట్‌ సోర్సింగ్‌ సంస్థకు ఆహార సరఫరా కాంట్రాక్ట్‌ను కట్టబెట్టడం చూస్తుంటే ఏ స్థాయిలో అవినీతి జరిగిందో తెలుస్తూనే ఉంది. అధికారుల అండదండలతోనే నిబంధనలకు విరుద్ధంగా టెండర్‌  కేటాయింపులు జరిగాయన్న విమర్శలు వస్తున్నాయి. రిమ్స్‌ ఆసుపత్రిలో ఆహారాన్ని సరఫరా చేసేందుకు ప్రభుత్వం ఒక్కో బెడ్‌కు రోజుకు రూ.80 చెల్లిస్తుంది. కాని అన్ని ఔట్‌ సోర్సింగ్‌ సంస్థలు టెండర్‌ దరఖాస్తులో ఒక్కో బెడ్‌కు రూ.72 కోడ్‌ చేస్తూ దరఖాస్తు చేశాయి. దీంతో అధికారులు డైలమాలో పడ్డారు. కాని ఇందులో అర్హత, అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యతనిస్తూ.. డైట్‌ కాంట్రాక్ట్‌ను అప్పగించాల్సి ఉంటుంది. కాని కృష్ణ కన్‌స్ట్రక్షన్‌ సంస్థకు డైట్‌లో ఎలాంటి అనుభవం లేకపోయినా.. సంస్థ టర్నోవర్‌ను బట్టి కాంట్రాక్ట్‌ను అప్పగించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. నిర్మాణ రంగంలో అనుభవం ఉన్న కంపెనీకి ఆహార సరఫరా కాంట్రాక్ట్‌ బాధ్యతలను అప్పగించడం ఏమిటన్న ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. గతంలో ఎక్కడ ఎన్ని బెడ్‌లకు ఆహారాన్ని సరఫరా చేసిన అనుభవాన్ని పరిగణలోకి తీసుకోకుండానే సదరు ఔట్‌ సోర్సింగ్‌ సంస్థకు అనుమతిని ఇవ్వడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాత్రికి రాత్రే ఆదేశాలు జారీ చేసిన అధికారులు, గతంలో డైట్‌ కాంట్రాక్టర్‌గా పని చేసిన ఔట్‌ సోర్సింగ్‌ సంస్థను విధుల నుంచి తప్పించి మరి ఆగమేఘాల మీద కొత్త ఔట్‌ సోర్సింగ్‌ కంపెనీకి బాధ్యతలను అప్పగించారు. అలాగే దరఖాస్తు చేసుకున్న మిగితా ఔట్‌ సోర్సింగ్‌ సంస్థలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే హుటాహుటిన ఆర్డర్‌ కాపీలను సంబంధిత ఔట్‌ సోర్సింగ్‌ కంపెనీకి అందజేశారన్న ఆరోపనలున్నాయి. ఇప్పటి వరకు ప్రొసీడింగ్‌ను ఇచ్చేందుకు కూడా అధికారులు ముందుకు రావడం లేదు. ఎవరి చేతికి ప్రొసీడింగ్‌ కార్డు అందకుండా జాగ్రత్త పడుతున్నారు. డీడీఎంసీ కమిటీ చైర్మన్‌గా వ్యవహరించిన జాయింట్‌ కలెక్టర్‌ సమాధానం ఇవ్వకుండా దాట వేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. ఈ టెండర్‌ కేటాయింపు విషయంలో  కలెక్టర్‌ జోక్యం చేసుకుని లోతుగా దర్యాప్తు జరిపిస్తే మరిన్ని అవకతవకలు, అక్రమాలు బయటపడే అవకాశం ఉంది. రిమ్స్‌ డైట్‌ టెండర్‌ను దక్కించుకున్న ఔట్‌ సోర్సింగ్‌ కంపెనీ  అందించిన పత్రాలను ఎందుకు చూపడం లేదో? అధికారులకే తెలియాలి మరి.

పక్కా ప్లాన్‌తోనే ముందుకు..

అడ్డదారిలో డైట్‌ టెండర్‌ దక్కించుకున్న కృష్ణకన్‌స్ట్రక్షన్‌ కంపెనీ పక్కా ప్లాన్‌ తో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తుంది. ఎన్నో తంటాలు పడి కాంట్రాక్ట్‌ను దక్కించుకున్న సంస్థ నిర్వాహకులు అతి తెలివిగా ఆర్డర్‌కాపీ చేతికి అందగానే ముం దుచూపుతో కేవీటీ (కోర్టు హెచ్చరిక ఆదేశాలు) తీసుకున్నట్లు తెలుస్తుంది. అం తా నిబంధనల ప్రకారం సక్రమంగానే జరిగి ఉంటే కేవీటీ తీసుకునే అవసరం ఏమి ఉందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. పక్కాగా అడ్డదారిలో అనుమతులు తీసుకోవడం వలననే ముందు జాగ్రత్తగా కోర్టు హెచ్చరిక ఆదేశాలు జారీ చేయించారన్న ఆరోపణలు వస్తున్నాయి. కేవీటీ ఆదేశాలతో దరఖాస్తు చే సుకున్న మిగితా ఔట్‌ సోర్సింగ్‌ కంపెనీలు కృష్ణ కన్‌స్ట్రక్షన్‌ సంస్థకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించే వీలు లేకుండా పోయింది. దీంతో తమ అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే సంబంధిత ఔట్‌ సోర్సింగ్‌ కంపెనీ జాగ్రత్త పడినట్లు తెలుస్తుంది. ఎంతో పకడ్బందీగా వ్యవహరించి రిమ్స్‌ ఆహార సరఫరా టెండర్‌ దక్కించుకున్న ట్లు స్పష్టమవుతుంది. ఇదంతా అధికారులకు తెలిసినా.. తేలికగానే తీసుకుంటూ అంతా సక్రమంగానే జరిగిందంటూ సమాధానమిస్తున్నారు.

కాసులిస్తే ఏదైనా సాధ్యమేనా?

రిమ్స్‌ డైట్‌ టెండర్‌ కేటాయింపుతో కాసులిస్తే ఏదైనా సాధ్యమేనని అధికారు లు నిరూపించారు. ఎలాంటి అనుభవం లేదని పక్కన పెట్టిన ఔట్‌ సోర్సింగ్‌ కంపెనీకే ఆహార బాధ్యతలు అప్పగించడం వెనుక ఏదో మాయ జరిగిందన్న విమర్శలు వస్తున్నాయి. అధికారులు కాసులకు కక్కుర్తిపడే నిబంధనలు తారుమా రు చేశారన్న ఆరోపణలు లేకపోలేదు. డైట్‌ టెండర్‌ కేటాయింపులో రూ.20 లక్షలు చేతులు మారినట్లు తెలుస్తుంది. ఇప్పటికే రిమ్స్‌ ఆహార సరఫరాపై ఎన్నో ఫిర్యాదులు వస్తున్నా.. అనుభవం లేని సంస్థకు బాధ్యతలు అప్పగించడం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. డీడీఎంసీ చైర్మన్‌ ఒక్కరే ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో పాటు అడిగినంత ఇవ్వడంతోనే అర్హత లేని ఔట్‌సోర్సింగ్‌ కంపెనీకి ఆహార సరఫరా బాధ్యతలను అప్పగించారన్న టాక్‌ వినిపిస్తోంది.

అంతా డీడీఎంసీ ఆదేశాల ప్రకారమే..

: జైసింగ్‌ రాథోడ్‌, రిమ్స్‌ డైరెక్టర్‌, ఆదిలాబాద్‌

జిల్లా డైట్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ(డీడీఎంసీ) ఆదేశాల ప్రకారమే కాంట్రాక్టు బాధ్యతలను కృష్ణ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీకి అప్పగించడం జరిగింది.  డీడీఎంసీ కమిటీ చైర్మన్‌ జేసీ ఆదేశాలతోనే ఆర్డర్‌ కాపీ ఇవ్వడం జరిగింది. సంబంధిత కంపెనీకి అర్హత లేదని వస్తున్న ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకుంటాం. టర్నోవర్‌ ఆధారంగానే డైట్‌ కాంట్రాక్టును అప్పగించడం జరిగింది. రోగులకు, వారి బంధువులకు నాణ్యమైన భోజనం అందేవిధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. గతంలో కన్న ప్రస్తుతం ప్రభుత్వం ఎక్కువగానే చార్జీలు చెల్లిస్తుంది. అక్రమాలు, అవినీతి జరిగిన విషయం నా దృష్టికి రాలేదు. 

Updated Date - 2022-07-07T06:58:21+05:30 IST