అమ్మా.. యుద్ధం చాలా కష్టంగా ఉంది.. ఉక్రెయిన్ పౌరుల్ని కూడా లక్ష్యంగా చేసుకోవాల్సి వస్తోంది: రష్యా సైనికుడి చివరి సందేశం

Published: Tue, 01 Mar 2022 18:32:52 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అమ్మా.. యుద్ధం చాలా కష్టంగా ఉంది.. ఉక్రెయిన్ పౌరుల్ని కూడా లక్ష్యంగా చేసుకోవాల్సి వస్తోంది: రష్యా సైనికుడి చివరి సందేశం

ఐరాస: ‘‘మామ్, నేను ఉక్రెయిన్‌లో ఉన్నాను. నిజంగా ఇక్కడ యుద్ధం భయంకరంగా ఉంది. నాకు చాలా భయంగా ఉంది. అన్ని నగరాలపైనా మేం బాంబుల వర్షం కురిపిస్తున్నాం. చివరికి పౌరులను కూడా లక్ష్యంగా చేసుకోవాల్సి వస్తోంది’’ ఉక్రెయిన్‌లో ఉన్న రష్యన్ సైనికుడు తన తల్లికి పంపిన చివరి సందేశమిది. ఈ యుద్ధంలో అతడు ప్రాణాలొదిలాడు. 


ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై ఐక్యరాజ్య సమితి సోమవారం నిర్వహించిన అత్యవసర జనరల్ అసెంబ్లీలో ఐరాసలో ఉక్రెయిన్ రాయబారి.. రష్యా సైనికుడు తన తల్లికి రాసిన ఈ సందేశాన్ని చదివి వినిపించారు. ఆ సైనికుడి తల్లి కుమారుడికి టెక్ట్స్ మెసేజ్ చేస్తూ.. తానో పార్శిల్ పంపాల్సి ఉందని, ఎక్కడున్నావని ప్రశ్నించింది. దానికి అతడు.. ‘‘నాకు ఉరేసుకుని చనిపోవాలని ఉందమ్మా’’ అని సమాధానం ఇవ్వడంతో ఆమె గుండె ఆగినంత పనైంది. 


‘‘వారు (ఉక్రేనియన్లు) మమ్మల్ని స్వాగతిస్తారని మా అధికారులు చెప్పారు. కానీ వారు మా సాయుధ వాహనాల కిందపడి నలిగిపోతున్నారు. చక్రాల కింద పడుతున్నారు. మమ్మల్ని ముందుకు కదలనివ్వడం లేదు. వారు మమ్మల్ని ఫాసిస్టులు అంటున్నారు. అమ్మా.. ఇక్కడ యుద్ధం చాలా కష్టంగా ఉంది’’ అని అతడు పేర్కొన్నాడు. ఉక్రెయిన్ దళాలు జరిపిన దాడిలో ఆ సైనికుడు మరణించాడు.


 ఈ సందేశాన్ని చదివి వినిపించిన ఉక్రెయిన్ రాయబారి  సెర్గీ కిస్లెత్స్యా .. ఉక్రెయిన్‌లోని విషాదభరిత పరిస్థితిని ఊహించుకోవాలని సూచించారు. ఈ మహాసభలోని ప్రతీ దేశం నేమ్ ప్లేట్ పక్కన 30 మందికిపైగా మరణించిన రష్యన్ సైనికుల ఆత్మలు ఉన్నట్టు ఊహించుకోవాలని సెర్గీ సూచించారు. ప్రతీ దేశం నేమ్ ప్లేట్ పక్కన.. అని ఉద్ఘాటించారు.


మరోవైపు, ప్రాణాలను రక్షించుకునేందుకు తమ దేశం విడిచి వెళ్లాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ రష్యా సైనికులను అభ్యర్థించారు. ఉక్రెయిన్ చెబుతున్న దాని ప్రకారం.. ఈ యుద్ధంలో ఇప్పటి వరకు 4500మందికిపైగా రష్యా సైనికులు అసువులు బాసారు. అయితే, రష్యా మాత్రం ఈ వార్తలను ఖండిస్తోంది. తమవైపు ఎలాంటి నష్టమూ జరగలేదని చెబుతోంది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.