Fuel Price Cut : పెట్రోలు ధర తగ్గింపు ఎన్నికల స్టంట్ : మమత బెనర్జీ

ABN , First Publish Date - 2022-05-24T00:27:51+05:30 IST

పెట్రోలు, డీజిల్ ధరలను, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు

Fuel Price Cut : పెట్రోలు ధర తగ్గింపు ఎన్నికల స్టంట్ : మమత బెనర్జీ

కోల్‌కతా : పెట్రోలు, డీజిల్ ధరలను, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు వంట గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించడం కేవలం ఎన్నికల స్టంట్ అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ ఆరోపించారు. దారిద్ర్యరేఖకు దిగువనున్న కొద్దిమందికి మాత్రమే దీనివల్ల ప్రయోజనం లభిస్తుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలకు స్వయంప్రతిపత్తి కల్పించాలన్నారు. 


మమత (Mamata Banerjee) సోమవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, బీజేపీ (BJP) నేతృత్వంలోని ప్రభుత్వం భారత దేశ సమాఖ్య వ్యవస్థను అణగదొక్కుతోందన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను (Central Agencies) ప్రయోగించి రాష్ట్రాల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందన్నారు. ఈ సంస్థలకు స్వయంప్రతిపత్తి కల్పించాలన్నారు. కాషాయ పార్టీ పరిపాలన అలనాటి అడాల్ఫ్ హిట్లర్, జోసఫ్ స్టాలిన్, బెనిటో ముస్సోలినీల పాలన కన్నా దారుణంగా ఉందన్నారు. 


పెట్రోలు, డీజిల్‌ (Petrol and Diesel)లపై ఎక్సయిజ్ సుంకాన్ని తగ్గించాలని, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం క్రింద వంట గ్యాస్‌ సిలిండర్‌ (Domestic Cooking Gas)కు రూ.200 చొప్పున రాయితీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించడంపై ప్రశ్నించినపుడు మమత స్పందిస్తూ, బీజేపీ ఇలాంటి పనులను ఎన్నికల ముందు చేస్తూ ఉంటుందన్నారు. ఉజ్వల యోజన పథకం క్రింద కేవలం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కొందరు మాత్రమే వస్తారన్నారు. పేదలు రూ.800 చొప్పున చెల్లించి వంట గ్యాస్‌ను ఎలా కొనుక్కోగలరని ప్రశ్నించారు. 


పెట్రోలు, డీజిల్‌లపై ఎక్సయిజ్ సుంకాన్ని తగ్గిస్తున్నామని, అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్‌ను తగ్గించి సామాన్యులకు ఉపశమనం కల్పించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ శనివారం చెప్పిన సంగతి తెలిసిందే. పెట్రోలుపై ఎక్సయిజ్ సుంకాన్ని లీటరుకు రూ.8 చొప్పున, డీజిల్‌పై ఎక్సయిజ్ సుంకాన్ని లీటరుకు రూ.6 చొప్పున తగ్గిస్తున్నట్లు ప్రకటించారు., రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతుండటం వల్ల ఇంధనం ధరలు పెరుగుతున్నాయని, ఆ ధరలకు కళ్ళెం వేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఎక్సయిజ్ సుంకాన్ని తగ్గించాలని నిర్ణయించిందని చెప్పారు.  పెట్రోలియం ఉత్పత్తులపై వాల్యూ యాడెడ్ ట్యాక్స్ (VAT)ని తగ్గించి, సామాన్య ప్రజలకు ఉపశమనం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. 2021 నవంబరులో కేంద్ర ప్రభుత్వం ధరలు తగ్గించినప్పటికీ సామాన్య ప్రజలకు ఆ మేరకు ఉపశమనం కల్పించని రాష్ట్రాలు కూడా ఈసారి ఈ ప్రయోజనాన్ని ప్రజలకు అందజేయాలని కోరారు. 


Updated Date - 2022-05-24T00:27:51+05:30 IST