
కోల్కతా : రాష్ట్రపతి ఎన్నికల కోసం ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ నడుం బిగించారు. శనివారం ఆమె ప్రతిపక్షాల పాలనలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, ప్రతిపక్ష నేతలకు ఓ లేఖ రాశారు. జూన్ 15న న్యూఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేస్తున్నానని, అందరూ హాజరుకావాలని కోరారు.
ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ట్వీట్లో, రాష్ట్రపతి ఎన్నికల దృష్ట్యా భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు అభ్యుదయవాద ప్రతిపక్ష పార్టీల నేతలందరినీ మమత బెనర్జీ ఆహ్వానించారని తెలిపింది. ఈ సమావేశం న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో జూన్ 15న మధ్యాహ్నం 3 గంటలకు జరుగుతుందని తెలిపింది. విభజన శక్తులకు వ్యతిరేకంగా బలమైన, సమర్థవంతమైన ప్రతిపక్షాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది.
ఎవరెవరికి ఈ లేఖలు?
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే; ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్; కేరళ సీఎం, సీపీఎం నేత పినరయి విజయన్; ఒడిశా సీఎం, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్; తమిళనాడు సీఎం, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్; తెలంగాణా సీఎం, టీఆర్ఎస్ చీఫ్ కే చంద్రశేఖర రావు; జార్ఖండ్ సీఎం, జేఎంఎం నేత హేమంత్ సొరేన్; పంజాబ్ ముఖ్యమంత్రి, ఆప్ నేత భగవంత్ మాన్ తదితరులకు మమత ఈ లేఖలను పంపించారు.
రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జూలై 18న జరుగుతుందని ఎన్నికల కమిషన్ గురువారం ప్రకటించింది. జూలై 21న ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపింది.
ఇవి కూడా చదవండి