ఫలితాలు రాకముందే విజయాన్ని ప్రకటించుకున్న మమత బెనర్జీ

ABN , First Publish Date - 2021-11-02T19:52:40+05:30 IST

పశ్చిమ బెంగాల్‌లో నాలుగు శాసన సభ నియోజకవర్గాల

ఫలితాలు రాకముందే విజయాన్ని ప్రకటించుకున్న మమత బెనర్జీ

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో నాలుగు శాసన సభ నియోజకవర్గాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుండగానే టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమత బెనర్జీ తన పార్టీ అభ్యర్థులు విజయం సాధించినట్లు ప్రకటించారు. విజేతలందరికీ శుభాకాంక్షలు చెప్తూ మంగళవారం ఓ ట్వీట్ చేశారు. ప్రచారం, విద్వేష రాజకీయాల కన్నా అభివృద్ధి, సమైక్యతలనే బెంగాల్ ఎల్లప్పుడూ ఎన్నుకుంటుందని పేర్కొన్నారు. విజేతలైన నలుగురు అభ్యర్థులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఇది ప్రజల విజయమని అభివర్ణించారు. ప్రజల ఆశీర్వాదాలతో బెంగాల్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళడాన్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. 


రాష్ట్రంలో ఖర్దా, శాంతిపూర్, గోసాబా, దిన్‌హటా శాసన సభ స్థానాలకు ఉప ఎన్నికలు అక్టోబరు 30న జరిగాయి. మంగళవారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ నాలుగు స్థానాల్లోనూ టీఎంసీ అభ్యర్థులు ఆధిక్యం కనబరుస్తున్నారు. 


కూచ్ బిహార్ జిల్లాలోని దిన్‌హటా నియోజకవర్గంలో టీఎంసీ అభ్యర్థి ఉదయన్ గుహ తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి అశోక్ కన్నా1,63,000 ఓట్లకు పైగా ఆధిక్యంతో గెలిచినట్లు జాతీయ మీడియా వెల్లడించిన తాజా సమాచారం ప్రకారం తెలుస్తోంది. గోసాబాలో టీఎంసీ అభ్యర్థి సుబ్రత మోండల్ తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి పలశ్ రాణా కన్నా 1,24,249 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. శాంతిపూర్‌లో టీఎంసీ అభ్యర్థి బ్రజ కిశోర్ గోస్వామి తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నిరంజన్ బిశ్వాస్ కన్నా 15,548 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. 


భబానీపూర్‌లో ఎమ్మెల్యేగా గెలిచి, రాజీనామా చేసిన సోవన్‌దేబ్ ఛటోపాధ్యాయ్‌ని ఖర్దా శాసన సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో టీఎంసీ నిలిపింది. సోవన్‌దేబ్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కోసం తన స్థానాన్ని ఖాళీ చేశారు. తాజా సమాచారం ప్రకారం, సోవన్‌దేబ్ ఖర్దా శాసన సభ నియోజకవర్గంలో దాదాపు 93 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించినట్లు జాతీయ మీడియా తెలిపింది.


Updated Date - 2021-11-02T19:52:40+05:30 IST