Sting Operation: పశ్చిమ బెంగాల్ మంత్రులకు మమత బెనర్జీ హెచ్చరిక

ABN , First Publish Date - 2022-08-19T20:36:20+05:30 IST

పశ్చిమ బెంగాల్ మంత్రులను ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత

Sting Operation: పశ్చిమ బెంగాల్ మంత్రులకు మమత బెనర్జీ హెచ్చరిక

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ మంత్రులను ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ (Mamata Banerjee) హెచ్చరించారు. కేసుల్లో ఇరికించేందుకు బీజేపీ (BJP) వల వేసిందని, అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. స్టింగ్ ఆపరేషన్లు (Sting Operation) నిర్వహించే ప్రయత్నాలు జరుగుతాయని తెలిపారు. రకరకాలుగా 500 మందిని నియమించారని, కేసుల్లో ఇరికిస్తారని తెలిపారు. ఎల్లప్పుడూ జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు. 


మమత బెనర్జీ గురువారం మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతూ, స్టింగ్ ఆపరేషన్లు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. బీజేపీ వల వేసి పట్టుకుని, కేసుల్లో ఇరికించే అవకాశం ఉందన్నారు. తెల్ల కాగితాలపై సంతకాలు చేయవద్దని కోరారు. మంత్రులంతా తమ ఆదాయపు పన్ను రిటర్నులను ప్రభుత్వానికి సమర్పించాలని తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయానికి ఐటీ రిటర్నులు చేరుకున్న తర్వాత రశీదులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. మంత్రుల పనితీరును విడిగా నిర్ణయిస్తామన్నారు. 


ఫైలును క్షుణ్ణంగా చదవకుండా సంతకాలు చేయవద్దని మంత్రులను కోరారు. తెల్ల కాగితాలపై సంతకాలు చేయవద్దని చెప్పారు. సంతకం క్రింద, పైనా ఖాళీగా లేకుండా చూసుకోవాలన్నారు. ఖాళీ ఉంటే ఏదైనా రాయడానికి అవకాశం ఉంటుందన్నారు. 


మంత్రుల కార్లపై ఎరుపు, నీలం లైట్లపై నిషేధం విధించినట్లు తెలిపారు. కోల్‌కతాలో మంత్రులు పోలీస్ పైలట్‌ను తీసుకెళ్ళరాదని చెప్పారు. జిల్లాల నుంచి వచ్చే మంత్రులు కోల్‌కతాలో ప్రవేశించే ముందు పోలీస్ పైలట్‌ను వదిలిపెట్టాలని తెలిపారు. 


Updated Date - 2022-08-19T20:36:20+05:30 IST