ఆర్థిక సంక్షోభంపై అఖిలపక్ష సమావేశానికి మమత డిమాండ్

ABN , First Publish Date - 2022-04-05T00:41:18+05:30 IST

ఇంధనం ధరలు చుక్కలను తాకుతుండటంపై బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై..

ఆర్థిక సంక్షోభంపై అఖిలపక్ష సమావేశానికి మమత డిమాండ్

న్యూఢిల్లీ: ఇంధనం ధరలు చుక్కలను తాకుతుండటంపై బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. ప్రసుతం కొనసాగుతున్న 'ఆర్థిక సంక్షోభం'పై చర్చించి, ఒక పరిష్కారం కనుగొనేందుకు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బీజేపీయేతర రాష్ట్రాల్లో ఆ పార్టీ జరుపుతున్న 'దౌర్జన్యాల' నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే పెట్రోల్, డీజిల్ ధరల తీవ్ర పెంపును కేంద్రం అనుమతిస్తోందని ఆమె ఆరోపించారు.


''ఇంధనం ధరల పెరుగుదలను ఎదుర్కొనే వ్యూహం ఏదీ కేంద్రం వద్ద లేదు. ఈ సంక్షోభానికి బీజేపీనే కారణం. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో విజయం తర్వాత బీజేపీ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇది'' అని సెక్రటేరియట్‌లో సోమవారంనాడు మీడియాతో మాట్లాడుతూ మమత అన్నారు. విపక్ష పార్టీలపై సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పడానికి బదులు ప్రస్తుత ఆర్థిక సమస్యలను పరిష్కరించేందుకు అఖిల పక్ష సమావేశాన్ని కేంద్రం ఏర్పాటు చేయడం తప్పనిసరని అన్నారు. 

Updated Date - 2022-04-05T00:41:18+05:30 IST