‘పెగాసస్‌’పై కేంద్రానికి మమత షాక్‌!

ABN , First Publish Date - 2021-07-27T06:48:19+05:30 IST

దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న పెగాసస్‌ స్పైవేర్‌ వివాదంపై పశ్చిమ

‘పెగాసస్‌’పై కేంద్రానికి మమత షాక్‌!

  • బెంగాల్‌లో విచారణ కమిషన్‌ను నియమించిన దీదీ
  • రాష్ట్ర పరిధిలో విచారణ జరపనున్న ద్విసభ్య కమిషన్‌
  • ఇతర రాష్ట్రాలూ ఏర్పాటు చేస్తే కేంద్రానికి ఇరకాటమే!
  • కేంద్ర కమిషన్‌ను నియమించక తప్పనిసరి పరిస్థితి!
  • సుప్రీం జడ్జితో విచారణ జరిపించాలి: శశి థరూర్‌


 కోల్‌కతా/న్యూఢిల్లీ, జూలై 26: దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న పెగాసస్‌ స్పైవేర్‌ వివాదంపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో పలువురు రాజకీయ నేతలు, అధికారులు, జర్నలిస్టుల ఫోన్లు హ్యాకింగ్‌కు గురయ్యాయన్న ఆరోపణలపై రాష్ట్ర పరిధిలో విచారణ జరిపేందుకు కమిషన్‌ను నియమించారు. కలకత్తా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జ్యోతిర్మయి భట్టాచార్య, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్‌ బి.లోకూర్‌తో ద్విసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం ఆమె ఢిల్లీకి బయలుదేరే ముందు ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రముఖుల ఫోన్ల హ్యాకింగ్‌పై కేంద్ర ప్రభుత్వంలో స్పందన లేనందున తామే విచారణ కమిషన్‌ను నియమించినట్లు, విచారణ కమిషన్‌ చట్టం-1952లోని సెక్షన్‌-3 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.


ఈ చట్టం ప్రకారం.. ఏ అంశంపైనైనా కేంద్ర ప్రభుత్వం విచారణ కమిషన్‌ను నియమిస్తే.. అదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కమిషన్‌ను నియమించేందుకు అవకాశం ఉండదు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే మాత్రం.. కేంద్ర కమిషన్‌ విచారణ జరిపినంతకాలం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిషన్‌ కూడా తమ కార్యకలాపాలు కొనసాగించవచ్చు. అలా కాకుండా.. రాష్ట్ర ప్రభుత్వమే ముందుగా విచారణ కమిషన్‌ను నియమిస్తే, అదే అంశంపై కేంద్ర ప్రభుత్వం మరో కమిషన్‌ను నియమించేందుకు అవకాశం ఉండదు. అయితే ఆ రాష్ట్రంతోపాటు మరిన్ని రాష్ట్రాల్లో విచారణ జరిపాలని నిర్ణయిస్తే మాత్రం కేంద్రం మరో కమిషన్‌ను నియమించవచ్చు.


దీనిని ఆధారంగా చేసుకొని మమతా బెనర్జీ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇతర బీజేపీయేతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకోకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం విచారణ కమిషన్‌ను నియమించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో నరేంద్రమోదీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.




ఇదిలా ఉండగా.. మమతా బెనర్జీ తన ఐదు రోజుల ఢిల్లీ పర్యటనలో బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలతో సమావేశం కావడంతోపాటు ప్రధాని నరేంద్రమోదీని కూడా కలవనున్నారు. మరోవైపు పెగాసస్‌ వ్యవహారంపై ఎటువంటి ఆందోళన లేని దేశం భారత్‌ మాత్రమేనని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం ఎద్దేవా చేశారు. పెగాసస్‌ వివాదంపై ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌.. ఇజ్రాయెల్‌ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్‌కు ఫోన్‌ చేసి మాట్లాడినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన ఇలా స్పందించారు. కాగా, పెగాసస్‌ అంశంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ డిమాండ్‌ చేశారు. 


Updated Date - 2021-07-27T06:48:19+05:30 IST