మమతవేరుబాట

ABN , First Publish Date - 2022-06-12T07:39:45+05:30 IST

రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిని నిర్ణయించే దిశగా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇప్పటికే ప్రయత్నాలు సాగిస్తుండగా.

మమతవేరుబాట

  • రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై 15న ఢిల్లీలో సమావేశం
  • కాంగ్రెస్‌, లెఫ్ట్‌, ఆప్‌ సహా 22 పార్టీలకు,
  • ముఖ్యమంత్రులకు బెంగాల్‌ సీఎం లేఖ
  • అదే రోజు సీనియర్‌ నేతల భేటీకి కాంగ్రెస్‌, లెఫ్ట్‌, ఇతర పార్టీల నిర్ణయం
  • నేడు సోనియాతో పవార్‌ చర్చలు
  • మమతా బెనర్జీ తీరుపై సీపీఎం గుర్రు
  • ఐక్యతను దెబ్బతీస్తున్నారని ఆక్షేపణ
  • జగన్‌, చంద్రబాబు, మాయావతి,
  • అసదుద్దీన్‌ ఒవైసీలకు అందని లేఖ
  • భేటీకి రండి.. కేసీఆర్‌కు మమత ఫోన్‌ 
  • ఓవైపు విపక్షాల్లో అనైక్యత మరోవైపు రాజ్యసభ విజయాలు
  • బీజేపీలో కదనోత్సాహం
  • వైసీపీ, బీజేడీ మద్దతు తనకేనని ధీమా


దేశంలో ప్రగతిశీల ప్రజాస్వామిక పార్టీలన్నీ కలిసి భవిష్యత్‌ రాజకీయ కార్యాచరణను నిర్ణయించేందుకు రాష్ట్రపతి ఎన్నికలు వీలు కల్పిస్తున్నాయి. మన ప్రజాస్వామ్యాన్ని సంరక్షించే రాజ్యాంగాధినేత ఎవరో నిర్ణయించేందుకు ప్రజాప్రతినిధులకు అవకాశం లభిస్తున్నందున ఈ ఎన్నికలు చరిత్రాత్మకమైనవి. మన ప్రజాస్వామ్యం సంక్షోభానికి గురవుతున్న నేటి సమయంలో వివిధ ప్రతిపక్షాల నేతలు సమావేశమై ఫలవంతమైన చర్చలు జరపడం అవసరం.

- పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి



న్యూఢిల్లీ, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిని నిర్ణయించే దిశగా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇప్పటికే ప్రయత్నాలు సాగిస్తుండగా.. ఇంకోవైపు బెంగాల్‌ సీఎం, టీఎంసీ నాయకురాలు మమతా బెనర్జీ ఏకంగా విపక్షాలతో సమావేశమే ఏర్పాటు చేశారు. ఈ నెల 15న ఢిల్లీలో ఈ భేటీ జరుగుతుందని.. దానికి హాజరు కావాలని సోనియా సహా దేశంలోని వివిధ విపక్షాలకు చెందిన 22 మంది నేతలకు శనివారం లేఖ రాశారు. ఢిల్లీ, కేరళ, తెలంగాణ, ఒడిసా, తమిళనాడు, మహారాష్ట్ర, జార్ఖండ్‌, పంజాబ్‌ సీఎంలుఅరవింద్‌ కేజ్రీవాల్‌, పి.విజయన్‌, కేసీఆర్‌, నవీన్‌ పట్నాయక్‌, ఎంకే స్టాలిన్‌, ఉద్ధవ్‌ ఠాక్రే, హేమంత్‌ సోరెన్‌, భగవంత్‌ సింగ్‌ మాన్‌, ఆర్‌జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌, సీపీఎం, సీపీఐ ప్రధాన కార్యదర్శులు సీతారాం ఏచూరి, డి.రాజా, ఎన్‌సీపీ, సమాజ్‌వాదీ అధ్యక్షులు శరద్‌పవార్‌, అఖిలేశ్‌ యాదవ్‌, ఆర్‌ఎల్‌డీ అధ్యక్షుడు జయంత్‌ చౌధురి, మాజీ ప్రధాని, జేడీఎస్‌ అధినేత హెచ్‌డీ దేవెగౌడ, ఆయన కుమారుడు-కర్ణాటక మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీడీపీ నేతలు ఫరూక్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, శిరోమణి అకాలీదళ్‌ అఽధ్యక్షుడు సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌, ఎస్‌డీఎఫ్‌ అధినేత పవన్‌ చామ్లింగ్‌, ఐయూఎంఎల్‌ అధ్యక్షుడు ఖాదర్‌ మొహిదీన్‌ వీరిలో ఉన్నారు.


 అయితే ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు, బీఎస్పీ నాయకురాలు మాయావతి, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీకి లేఖ పంపలేదు. జూలై 18న రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ప్రకటించగానే.. మమతతో సోనియా ఈ అంశంపై మాట్లాడారు. అలాగే వివిధ విపక్షాలతో ‘ఏకాభిప్రాయ’ అభ్యర్థిపై చర్చించే బాధ్యతను కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లిఖార్జున్‌ ఖర్గేకు అప్పగించారు. పైగా పవార్‌ ఆదివారం ఆమెతో సమావేశం కానున్నారు కూడా. ఈ నేపథ్యంలో మమత హడావుడిగా 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో సమావేశం ఏర్పాటు చేయడం విశేషం. ఆమె తీరును బెంగాల్లో టీఎంసీ ప్రత్యర్థి సీపీఎం తప్పుబట్టింది. విపక్షాల్లో ఐకమత్యం లేకపోవడం.. రాజ్యసభ ఎన్నికల్లో అధిక స్థానాలు కైవసం చేసుకున్న ఉత్సాహంతో రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థి విజయం తథ్యమని బీజేపీ గట్టి ధీమాతో ఉంది.


విచ్ఛిన్న శక్తులను ప్రతిఘటించేందుకు..

దేశంలో విచ్ఛిన్నకర శక్తులను ప్రతిఘటించేందుకు.. ప్రగతిశీల శక్తులన్నీ కలిసికట్టుగా ముందుకు రావాలని మమతా బెనర్జీ తన లేఖలో పిలుపిచ్చారు. ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా పెట్టుకుని కేంద్ర దర్యాప్తు సంస్థలు ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నాయని, అంతర్జాతీయంగా దే శ ప్రతిష్ఠ దెబ్బతిందని.. దేశంలో తీవ్ర కలహాలతో కూడిన వాతావరణం ఏర్పడిందని తెలిపారు. ‘దేశంలో ప్రగతిశీల ప్రజాస్వామిక పార్టీలన్నీ కలిసి భవిష్యత్‌ రాజకీయ కార్యాచరణను నిర్ణయించేందుకు రాష్ట్రపతి ఎన్నికలు వీలు కల్పిస్తున్నాయి. ‘మన ప్రజాస్వామ్యాన్ని సంరక్షించే రాజ్యాంగాధినేత ఎవరో నిర్ణయించేందుకు ప్రజాప్రతినిధులకు అవకాశం లభిస్తున్నందున ఈ ఎన్నికలు చరిత్రాత్మకమైనవి. మన ప్రజాస్వామ్యం సంక్షోభానికి గురవుతున్న నేటి సమయంలో వివిధ ప్రతిపక్షాల నేతలు సమావేశమై ఫలవంతమైన చర్చలు జరపడం నేటి అవసరం’ అని తెలిపారు.


నేడు సోనియాతో పవార్‌ భేటీ

రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి ఖరారుపై ఆదివారం ఢిల్లీలో సోనియాతో శరద్‌ పవార్‌ సమావేశం కానున్నారు. ఈ విషయాన్ని శనివారం ఆయన పుణేలో తెలిపారు. విస్తృత చర్చలు జరగాల్సిన నేపథ్యంలో మమత ఏకపక్షంగా విపక్షాల సమావేశం ఏర్పాటు చేయడం వల్ల ఐకమత్యం రాకపోగా దానికి వ్యతిరేకంగా జరగొచ్చని సీపీఎం నేత సీతారాం ఏచూరి అభిప్రాయపడ్డారు. సోనియా, పవార్‌, స్టాలిన్‌ సహా ప్రతిపక్షాల సీనియర్‌ నేతలు అదే రోజు (15న) సమావేశం కావాలని ఇప్పటికే నిర్ణయించిన విషయం గుర్తుచేశారు. ‘సాధారణంగా ఇలాంటి ఏకాభిప్రాయ స మావేశాలను పరస్పర సంప్రదింపుల ద్వారా నిర్వహిస్తారు. ఇప్పటికే రాష్ట్రపతి ఎన్నికపై చర్చలు సాగుతున్నాయి. చర్చలకు తేదీ కూడా ఖరారైంది. ఇప్పుడు మమత ఏకపక్షంగా లేఖ రాశారు. ఇలాంటి చర్యలతో ప్రతిపక్షాల ఐక్యత దెబ్బతింటుంది’ అని హెచ్చరించారు. ఇతర విపక్ష నేతలూ మమత తీరుపై సంతృప్తిగా లేరని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇతర సీనియర్లందరినీ తోసిరాజని.. బీజేపీ వ్యతిరేక కూటమి కి తననే నాయకురాలిగా చాటుకునేందుకు ఆమె చేస్తు న్న మరో ప్రయత్నమని విమర్శలున్నాయి. ఇది బీజేపీకే లాభిస్తుందని.. విపక్షాల అనైక్యతతో కాషాయ పార్టీ లబ్ధి పొందుతుందని మరో విపక్ష నేత చెప్పారు. 


మెజారిటీ మార్కు దాటిన ఎన్‌డీఏ

రాజ్యసభ ఎన్నికల తాజా ఫలితాలతో ఎగువ సభలో ఎన్‌డీఏ బలం 117కి చేరడంతో బీజేపీలో కదనోత్సాహం రెట్టింపైంది. 245 మంది సభ్యుల సభలో 233 మంది రాష్ట్రాల శాసనసభల ద్వారా ఎన్నికయ్యే సంగతి తెలిసిందే. వీరికి మాత్రమే రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసే హక్కుంది. రాష్ట్రపతి నామినేట్‌ చేసే మిగతా 12 మంది ఓటువేయడానికి వీల్లేదు. 57 స్థానాలకు ఇటీవల ద్వైవార్షిక ఎన్నికలు జరుగగా.. వాటిలో తనకున్న 24 స్థానాలను బీజేపీ నిలబెట్టుకోదని.. 20 మాత్రమే వస్తాయని అంతా భావించారు. కానీ కర్ణాటక, మహారాష్ట్రలో ఆ పార్టీ రెండు సీట్లు అదనంగా దక్కించుకుని మొత్తంగా 99 స్థానాలు సాధించింది. అలాగే హరియాణాలో బీజేపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. యూపీఏకి ఇప్పుడు రాజ్యసభలో 53 మంది సభ్యులున్నారు. టీఎంసీ(13), ఆప్‌(10), వైసీపీ(9), బీజేడీ(9), టీఆర్‌ఎస్‌(7), ఆర్‌జేడీ(6), సీపీఎం(5), సమాజ్‌వాదీ(3), సీపీఐ(2), టీడీపీ (1) సహా ఇతరులకు 71 మంది ఎంపీలున్నారు. వైసీపీ, బీజేడీ మద్దతుతో తన బలం 135కి చేరుతుందని.. ఏకసభ్య పార్టీలు కూడా కొన్ని కలిసొస్తాయని.. ప్రతిపక్షాల్లో ఐకమత్యం లేకపోవడంతో రాష్ట్రపతి ఎన్నికల్లో తేలిగ్గా గెలవగలమని బీజేపీ దృఢవిశ్వాసంతో ఉంది.

Updated Date - 2022-06-12T07:39:45+05:30 IST