ఉద్యోగి వద్దంటున్నా బర్త్‌డే పార్టీ ఇచ్చి భారీ మూల్యం చెల్లించుకున్న కంపెనీ! రూ.3.4 కోట్ల పరిహారం ఇవ్వాలంటూ కోర్టు తీర్పు!

ABN , First Publish Date - 2022-04-18T03:41:46+05:30 IST

వార్త శీర్షిక కాస్త సర్‌ప్రైజింగ్‌గా ఉన్నా ఇది నిజం! ఉద్యోగికి ఇష్టం లేకపోయినా అతడి కోసం ఓ సర్‌ప్రైజ్ పార్టీ ఇచ్చిన కంపెనీ చివరకు భారీ మూల్యం చెల్లించుకుంది. అసలు విషయం ఏంటంటే..

ఉద్యోగి వద్దంటున్నా బర్త్‌డే పార్టీ ఇచ్చి భారీ మూల్యం చెల్లించుకున్న కంపెనీ! రూ.3.4 కోట్ల పరిహారం ఇవ్వాలంటూ కోర్టు తీర్పు!

ఎన్నారై డెస్క్: వార్త శీర్షిక కాస్త సర్‌ప్రైజింగ్‌గా ఉన్నా ఇది నిజం! ఉద్యోగికి ఇష్టం లేకపోయినా అతడి కోసం ఓ సర్‌ప్రైజ్ పార్టీ  ఇచ్చిన కంపెనీ చివరకు భారీ మూల్యం చెల్లించుకుంది. అసలు విషయం ఏంటంటే..  కెవిన్ బెర్లిన్ అనే వ్యక్తి కెంటకీ రాష్ట్రంలోని కొవింగ్టన్ నగరంలోగల ఓ డయాగ్నస్టిక్స్ సంస్థలో పనిచేసేవాడు. కాగా.. 2019లో కెవిన్ పుట్టినరోజు సందర్భంగా పార్టీ ఏర్పాటు చేద్దామనుకుంటున్నట్టు కంపెనీ యాజమాన్యం ప్రతిపాదించింది. కానీ.. కెవిన్ ఇందుకు నిరాకరించాడు. ఇటువంటి సర్‌ప్రైజ్‌లు తనకు సరిపడవని, వీటి వల్ల తనకు ఒత్తిడి పెరిగి, గాబరా పడిపోతానని చెప్పాడు. ప్యానిక్ ఎటాక్స్ వస్తాయని హెచ్చరించాడు. ప్యానిక్ ఎటాక్ అనేది ఓ మానసిక సమస్య. దీనితో బాధపడేవారు అనూహ్య పరిస్థితులు ఎదురైనప్పుడు భరించలేనంతగా గాబరా పడతారు. తలనొప్పి, ఇతర శారీరక సమస్యలతో సతమతమవుతారు. 


అయితే .. కంపెనీ యాజమాన్యం మాత్రం కెవిన్ చెప్పేది పెడ చెవిన పెట్టింది. అతడి పుట్టిన రోజున బర్త్‌డే పార్టీని ఏర్పాటు చేసింది. ఆ రోజు కెవిన్ ఆఫీసులో అడుగుపెట్టగానే హఠాత్తుగా పార్టీ పేరిట యాజమాన్యం, ఉద్యోగులు అతడి చుట్టూ చేరి నానా హడావుడీ సృష్టించారు. దీంతో అతడికి ప్యానిక్ ఎటాక్ అయ్యింది. కెవిన్ ఇబ్బందిని చూసి వారు పార్టీని ఆపేసినా ఆ మరుసటి రోజు కంపెనీ మానేజర్ అతడిపై విరుచుకుప్పడ్డారు. సాటి ఉద్యోగుల ఉత్సాహం అంతా నీరుగార్చావని, చిన్న పిల్లాడిలా బెదిరిపోయావని  తీవ్రంగా విమర్శించాడు. దీంతో.. మరోసారి కెవిన్ ఆందోళనకు గురయ్యాడు. ఆ తరువాత కొద్ది రోజులకు కంపెనీ కెవిన్‌ను ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ అవమానాలన్నీ తట్టుకోలేక ఆయన చివరకు  కోర్టును ఆశ్రయించాడు. తన ఆరోగ్య సమస్య కారణంగా యాజమాన్యం తనపై వివక్ష చూపించిందని ఆరోపించాడు. ఈ కేసుపై గత నెలలోనే కెవిన్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది.  తన ఉపాధి కోల్పోయిన కెవిన్ మానసిక వేదన అనుభవించినందుకు పరిహారంగా 450,000 డాలర్లు(రూ.3.4 కోట్లు) అతడికి చెల్లించాలని కోర్టు కంపెనీ యాజమాన్యాన్ని ఆదేశించింది. 

Updated Date - 2022-04-18T03:41:46+05:30 IST