Yogi Adityanath: యూపీ సీఎంకు గుడికట్టి.. నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు!

ABN , First Publish Date - 2022-09-20T00:26:27+05:30 IST

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ (Yogi Adityanath) ఓ భక్తుడికి దైవంగా మారారు. ఆయనలోనే తాను ఆరాధిస్తున్న

Yogi Adityanath: యూపీ సీఎంకు గుడికట్టి.. నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు!

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ (Yogi Adityanath) ఓ భక్తుడికి దైవంగా మారారు. ఆయనలోనే తాను ఆరాధిస్తున్న దేవుడ్ని చూసుకున్న ఓ వ్యక్తి యోగి కోసం ప్రత్యేకంగా అయోధ్య (Ayodhya)లో ఓ గుడి కట్టించి నిత్య పూజలు చేస్తున్నాడు. రామజన్మభూమికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మసౌధ బ్లాక్‌లోని మౌర్యకు చెందిన యువకుడు ప్రభాకర్ మౌర్య (Prabhakar Maurya) ఈ గుడిని కట్టించాడు. ఇది భరతుడి తపోస్థలిలోని భరత్‌కుంద్‌ (Bharat Kund)కు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. ముఖ్యమంత్రి పనితీరుకు ముగ్ధుడైన ప్రభాకర్ మౌర్య గ్రామంలో ఆయన కోసం గుడి కట్టించాడు. 


ఈ ఆలయం పేరు ‘యోగి మందిర్’ (Yogi Mandir). ఆలయంలో యోగి ఆదిత్యనాథ్ నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. కాషాయ దుస్తులు ధరించి ఉన్న యోగి విగ్రహం విల్లంబులు ధరించి రాముడిని పోలి ఉంది. రోజుకు రెండుసార్లు ఆలయంలో ప్రార్థనలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ప్రజల మనసుల్లో దైవం లాంటి స్థానం సంపాదించుకున్నారని, అందుకనే ఆయనకు గుడికట్టాలన్న ఆలోచన తన మదిలో మెదిలిందని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మౌర్య తెలిపాడు. 


యూపీలో పోలీసు ఆధునికీకరణ పథకం కింద 56 జిల్లాలకు ఆధునిక జైలు వ్యాన్లకు ముఖ్యమంత్రి యోగి ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు. యూపీలో శాంతిభద్రతలు అమలవుతున్న తీరు దేశానికే కాకుండా ప్రపంచానికి కూడా ఉదాహరణగా నిలిచాయని మౌర్య పేర్కొన్నాడు. కాగా, తనకు సొంత భూమి కానీ, ఉద్యోగం కానీ లేదన్న మౌర్య.. యూట్యూబ్‌లో భజనలు, పాటలను పోస్టు చేయడం ద్వారా నెలకు దాదాపు లక్ష రూపాయలు సంపాదిస్తున్నట్టు చెప్పాడు. ఆ డబ్బులతోనే గుడి కట్టించినట్టు పేర్కొన్నాడు. ఆలయ నిర్మాణానికి రూ.8.5 లక్షల వరకు ఖర్చయినట్టు తెలిపాడు. యోగి విగ్రహం రాముడిని పోలి ఉండేలా రాజస్థాన్‌లో చేయించినట్టు మౌర్య వివరించాడు.

Updated Date - 2022-09-20T00:26:27+05:30 IST