గుంతలో నుంచి దూసుకెళ్లిన కారు... పక్కనేవున్న వ్యక్తిపై చిమ్మిన మురుగు నీరు.. వెంటనే అతను పోలీసులకు ఫోన్ చేసి ఏం చెప్పాడంటే...

ABN , First Publish Date - 2022-07-27T17:23:28+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది.

గుంతలో నుంచి దూసుకెళ్లిన కారు... పక్కనేవున్న వ్యక్తిపై చిమ్మిన మురుగు నీరు.. వెంటనే అతను పోలీసులకు ఫోన్ చేసి ఏం చెప్పాడంటే...

దేశ రాజధాని ఢిల్లీలో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. దీనిని విన్నవారంతా ఆశ్చర్యపోతున్నారు. వివరాల్లోకి వెళితే ఒక వ్యక్తి తన కారును వేగంగా పోనివ్వడంతో రోడ్డుపై నున్న గుంతలోని మురుగునీరు అటుగా వెళుతున్న 39 ఏళ్ల వ్యక్తిపై చిమ్మింది. ఆ కారు నడుపుతున్న వ్యక్తికి తగిన గుణపాఠం చెప్పాలని ఆ వ్యక్తి నిర్ణయించుకున్నాడు. పోలీసులకు ఫోన్ చేసి కారు నడుపుతున్న వ్యక్తిపై తీవ్ర ఆరోపణలు చేశాడు. ఈ ఉదంతం గురించి డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ఎక్స్‌టర్నల్) సమీర్ శర్మ మాట్లాడుతూ జూలై 22న ముండ్కా పోలీస్ స్టేషన్‌కు పిసిఆర్ కాల్ వచ్చిందని.. ఒక వ్యక్తి తనకు తుపాకీ గురిపెట్టి బెదిరించి పారిపోయాడని ఆ కాల్ చేసిన వ్యక్తి చెప్పాడు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అక్కడ కాల్ చేసిన వ్యక్తి కనిపించలేదు. 


పైగా అతని మొబైల్ ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసి ఉంది. కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. కాల్ చేసిన వ్యక్తిని గుర్తించి అతనిని విచారించారు. అతను తన కార్యాలయం నుండి మోటారుసైకిల్‌పై ముండ్కా రెడ్‌లైట్ మీదుగా కరాలా గ్రామానికి వెళ్తుండగా, వెనుక నుండి ఒక కారు వచ్చి నీటిని చిమ్ముతూ ముందుకు దూసుకెళ్లిందని అతను తెలిపాడు. దీంతో అతని బట్టలు పాడయ్యాయని డీసీపీ తెలిపారు. కారు యజమానికి గుణపాఠం చెప్పాలని భావించి,  కారు నడిపిన వ్యక్తి తనకు తుపాకీ చూపించి బెదిరించాడని పోలీసులకు ఫోన్ చేశాడు. గ్యాస్ ఏజెన్సీలో మెకానిక్‌గా పనిచేస్తున్న నిందితుడిపై పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 182 కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.



Updated Date - 2022-07-27T17:23:28+05:30 IST