రూ. 12 కోట్ల కొవిడ్ లోన్‌తో జల్సాలు.. ఖరీదైన కార్లు, రోలెక్స్ వాచీ కొనుగోలు..!

ABN , First Publish Date - 2021-12-07T03:01:33+05:30 IST

కొవిడ్‌ కారణంగా నష్టాల్లో కూరుకుపోయానంటూ ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు కొట్టేసి, జల్సా చేసిన ఓ యువకుడు చివరికి జైలు పాలయ్యాడు.

రూ. 12 కోట్ల కొవిడ్ లోన్‌తో జల్సాలు.. ఖరీదైన కార్లు, రోలెక్స్ వాచీ కొనుగోలు..!

ఇంటర్నెట్ డెస్క్: కొవిడ్‌ కారణంగా నష్టాల్లో కూరుకుపోయానంటూ ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు కొట్టేసి, జల్సా చేసిన ఓ యువకుడు చివరికి జైలు పాలయ్యాడు. అమెరికాలో జరిగిన ఈ ఉదంతం ప్రస్తుతం వైరల్‌గా మారింది. కరోనా కారణంగా జీవనోపాధి కోల్పోయిన ఉద్యోగులు, వ్యాపారస్తులను ఆదుకునేందుకు అమెరికా ప్రభుత్వం పేచెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా.. అర్హులైన వారికి బ్యాంకుల ద్వారా ఆర్థిక సహాయాన్ని అందజేస్తోంది. ఈ అవకాశాన్ని లీ ప్రైస్(30) దుర్వినియోగ పరిచాడు. తన సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, ఉద్యోగులందరూ రోడ్డునపడే ప్రమాదం ఉందంటూ బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్నాడు. ఇలా వివిధ కారణాలు చెప్పి పలు బ్యాంకులను బురిడీ కొట్టించాడు. మొత్తం 1.6 మిలియన్ డాలర్లు(మన కరెన్సీలో చెప్పుకోవాలంటే దాదాపు రూ. 12 కోట్లు) తీసుకున్నాడు. వాటితో జల్సాలకు దిగాడు. ఖరీదైన కార్లు, ఓ రోలెక్సి వాచీని కొనుగోలు చేశాడు. ఎట్టకేలకు ఇదంతా ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో ఇటీవలే అతడు జైలు పాలయ్యాడు. కోర్టు అతడికి తొమ్మిదేళ్ల కారాగార శిక్ష విధించింది. కాగా.. అమెరికాలో ఇటువంటి ఉదంతాలు గతంలోనూ వెలుగు చూశాయి. 



Updated Date - 2021-12-07T03:01:33+05:30 IST