వైరల్ వీడియో: కూర్చున్న కొమ్మ సరే..ఏకంగా చెట్టునే నరుక్కోవచ్చు!

ABN , First Publish Date - 2020-09-28T20:59:49+05:30 IST

కూర్చున్న కొమ్మను నరుక్కుంటే అంతే.. నడ్డి విరిగిపోతుంది.. ఇది చెప్పటానికి కాలజ్ఞానం అవసరం లేదు ఇంకితజ్ఞానం చాలు. మన తెలుగు వారికి బాగా తెలిసిన నీతి ఇది. అయితే కాలం పూర్తిగా మారిపోయింది. నిక్కచ్చిగా చెప్పుకోవాలంటే.. కాలం తిరగబడింది. కాలపరీక్షకు నిలిచాయనుకున్న సామెతలను కూడా తిరగరాయాల్సిన పరిస్థితి దాపురించింది. ఇంతటి ఉపోద్ఘాతానికి కారణం.. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియో!

వైరల్ వీడియో: కూర్చున్న కొమ్మ సరే..ఏకంగా చెట్టునే నరుక్కోవచ్చు!

ఇంటర్నెట్ డెస్క్: కూర్చున్న కొమ్మను నరుక్కుంటే అంతే.. నడ్డి విరిగిపోతుంది.. ఇది చెప్పటానికి జ్యోతిష్యం, కాలజ్ఞానం వంటివి అవసరం లేదు. ఇంకితజ్ఞానం చాలు! మన తెలుగు వారికి బాగా తెలిసిన నీతి ఇది. అయితే కాలం పూర్తిగా మారిపోయింది. నిక్కచ్చిగా చెప్పుకోవాలంటే.. కాలం తిరగబడింది. కాలపరీక్షకు నిలిచాయనుకున్న సామెతలను కూడా తిరగరాయాల్సిన పరిస్థితి వచ్చిపడింది. ఇంతటి ఉపోద్ఘాతానికి కారణం.. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియో!


 ఒక్కసారి చూస్తే జీవితమంతా మరిచిపోలేని ఘటన అది! అందులోని వ్యక్తి కూర్చున్న కొమ్మను సారీ.. ఎకంగా చెట్టునే నరికి పారేశాడు. వీడియో ప్రారంభంలో అతడు చెట్టు చివరకు చేరుకున్నాక చెట్టు ఓ వైపుకు ఒంగుతుంది.. ఆ సమయంలో అతడు చెట్టు చివరన ఉన్న కొంత భాగాన్ని నరికేస్తాడు. ఒక్కసారిగా అంతటి బరువు కింద పడిపోగానే..మిగతా భాగమంతా పెను గాలికి ఊగినట్టు అటూ ఇటూ ఊగిపోయింది. చెట్టును అంటిపెట్టుకుని ఉన్న వ్యక్తి కూడా అటూ ఇటూ ఊగుతూ అప్పుడో ఇప్పుడో కింద పడి చస్తాడేమో అన్నంత భయం కలిగిస్తాడు. 


ఇక ఇటువంటి వీడియోల కోసం చెవి కోసుకునే నెటిజన్లంతా ఈ దృశ్యాల్ని చూసి నోరెళ్లబెడుతున్నారు. ఇది నిజమేనా అని వీడియోను మళ్లీ మళ్లీ చూస్తూ..బుగ్గలు నొక్కుకుంటున్నారు. ఈ వీడియోను అమెరికా బాస్కెట్ బాల క్రీడాకారుడు రిక్స్ ఛాప్‌మెన్ తొలిసారి ట్విటర్ ద్వారా షేర్ చేశారు.


దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. కింద నుంచి చెట్టును నరకొచ్చుగా అని కొందరు ప్రశ్నిస్తే..అలా కుదరదని మరికొందరు సమాధానమిచ్చారు. అక్కడికి సమీపంలో విద్యుత్ తీగలు ఉన్నాయి. దీంతో కింద నిలబడి చెట్టును నరికితే..అది విద్యుత్ తీగలపై పడే ప్రమాదం ఉందట. అందుకే అక్కడి వారు ఇంతటి ప్రయాసకు పూనుకున్నారట. ఇది అమెరికాలోని లాస్ యాంజిలిస్ ప్రాంతంలో జరిగిందని కూడా ట్విటర్ సంవాదం ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకూ దీనికి 60 లక్షల వ్యూస్, 81 వేల లైకులు వచ్చిపడ్డాయి. నెట్టింట పిచ్చ హైప్ క్రియోట్ చేస్తున్న ఈ వీడియో మీ కోసం.. వెంటనే చూసి షాకైపొండి!



Updated Date - 2020-09-28T20:59:49+05:30 IST