రోప్‌వే నుంచి కాపాడుతుండగా హెలికాప్టర్ నుంచి జారిపడి...

ABN , First Publish Date - 2022-04-12T01:35:56+05:30 IST

జార్ఖాండ్‌లోని డియోఘర్‌ జిల్లాలో రోప్‌వే కేబుల్ కార్‌లలో చిక్కుకుపోయిన వారిని క్షేమంగా బయటకు తెచ్చేందుకు..

రోప్‌వే నుంచి కాపాడుతుండగా హెలికాప్టర్ నుంచి జారిపడి...

న్యూఢిల్లీ: జార్ఖాండ్‌లోని డియోఘర్‌ జిల్లాలో రోప్‌వే కేబుల్ కార్‌లలో చిక్కుకుపోయిన వారిని క్షేమంగా బయటకు తెచ్చేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. ఈ క్రమంలోనే గుండెలు ఝల్లుమనే ఒక వీడియో వెలుగుచూసింది. ఐఏఎప్ హెలికాఫ్టర్ ఎక్కుతూ పట్టుసడలడంతో ఓ వ్యక్తి కింద పడినట్టు ఆ వీడియోలో కనిపిస్తోంది. ఆ వ్యక్తి చనిపోయినట్టు వార్తలు వస్తుండగా, అధికారులు మాత్రం ఇంకా ధ్రువీకరించలేదు.


త్రికూట్‌ హిల్‌వేలో ఉన్న రోప్‌వే కేబుల్ కార్‌లలో ఆదివారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రెండు కేబుల్ కార్లు ఢీకొనండతో కార్లన్నీ గాలిలోనే నిలిచిపోయాయి. అందులో చిక్కుకుపోయిన కొందరు టూరిస్టులను ఏదోవిధంగా సిబ్బంది బయటకు తీయగలిగారు. అయినప్పటికీ మొత్తం 48 మంది ఇంకా అందులోనే ఉండిపోయారు. సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన రెండు హెలికాప్టర్లను రంగంలోకి దింపారు. సాయంత్రం వరకూ 30 మందిని రక్షించగా, మరో 18 మందిని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రమాద ఘటనలో ఇద్దరు మహిళలతో సహా ముగ్గురు చనిపోయారని, 8 మంది డియోఘర్ సదర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెబుతున్నారు. రోప్‌వేకు సరైన మెయింటెనెన్స్ లేకపోవడం కూడా ప్రమాదానికి కారణంగా చెబుతున్నారు. ఘటనపై దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామని, ప్రస్తుతానికి అందర్ని సురక్షితంగా బయటకు తీసుకురావడం పైనే తాము దృష్టి సారించామని జార్ఖాండ్ మంత్రి హఫిజుల్ హసన్ తెలిపారు.

Updated Date - 2022-04-12T01:35:56+05:30 IST