ఆ ఒక్క వ్యూహంతో లాటరీలో గెలుపు.. చేతిలోకి రూ. 78 లక్షల సంపద.. టీవీలో చూపించినట్టే చేయడంతో..

ABN , First Publish Date - 2022-06-28T02:03:40+05:30 IST

లాటరీ(Lottery) అంటేనే అదృష్టంతో ముడిపడిన అంశం.. లక్ ఉంటేనే జాక్‌పాట్ తగిలేది..! ఇది అందరికీ తెలిసిందే. కానీ..లక్‌కూ ఓ లెక్క ఉంటుందని నమ్మిన ఓ అమెరికా వ్యక్తి ఏకంగా లక్ష డాలర్ల(సుమారు రూ.78 లక్షలు) జాక్‌పాట్ కొట్టేశాడు.

ఆ ఒక్క వ్యూహంతో లాటరీలో గెలుపు.. చేతిలోకి రూ. 78 లక్షల సంపద.. టీవీలో చూపించినట్టే చేయడంతో..

ఎన్నారై డెస్క్: లాటరీ(Lottery) అంటేనే అదృష్టంతో ముడిపడిన అంశం.. లక్ ఉంటేనే జాక్‌పాట్ తగిలేది..! ఇది అందరికీ తెలిసిందే. కానీ..లక్‌కూ ఓ లెక్క ఉంటుందని నమ్మిన ఓ అమెరికా వ్యక్తి ఏకంగా లక్ష డాలర్ల(సుమారు రూ.78 లక్షలు) జాక్‌పాట్ కొట్టేశాడు. తన వ్యూహం అమలు చేసిన ఏడు వారాలకే లక్షలు కొల్లగొట్టాడు. ఇదెలా సాధ్యమైందంటే.. 


దక్షిణ కరోలీనాకు(South Carolina) చెందిన ఈ లక్కీ ఫెలో టీవీ సీరియల్‌లో తాను చూసిన వ్యూహాన్ని అమలు చేసి అనుకున్నది సాధించాడు. ఆ సీరియల్ పేరు లాటరీ ఛేంజ్డ్‌ మై లైఫ్(Lottery changed my life). అంటే.. ‘‘లాటరీ నా జీవితాన్ని మార్చేసింది’’ అని అర్థం. టీవీలో చూపించిన వ్యూహం ప్రకారం.. ఓ వ్యక్తి క్రమం తప్పకుండా లాటరీ టిక్కెట్లు కొంటూ ఉంటే జాక్‌పాట్ తగిలే అవకాశాలు క్రమంగా పెరుగుతాయి. అయితే.. ఈ వ్యూహం తప్పని గణాంకశాస్త్ర నిపుణులు చెబుతుంటారు. కానీ.. మనోడు మాత్రం ఈ స్ట్రాటజీని తూచా తప్పకుండా పాటించాడు. మొదటి వారంలో 500 డాలర్లతో టిక్కెట్ కొని పొవర్ బాల్(Powerball) అనే లాటరీని ఆడాడు. అసలు పవర్ బాల్ ఎలా ఆడాలో తెలియకపోయినా తన వ్యూహంపై అపార విశ్వాసంతో రంగంలోకి దిగేశాడు.  మరుసటి ఆరు వారాలు ఇదే పంథాలో ముందుకెళ్లిపోయిన అతడికి ఏడో వారంలో అదృష్టం తగిలింది. మే 28న అతడు జాక్ పాట్ కొట్టాడు. 


ఇక స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ఆ లక్కీ ఫెలో తాను గెలిచిన సొమ్ముతో ఇప్పటికే ఓ లగ్జరీ కారు కొనేశాడట. భవిష్యత్తులో కూడా ఇదే పద్ధతిలో మరిన్ని జాక్‌పాట్‌లు గెలుచుకుంటానని అతడు చెబుతున్నాడు. మరో మూడు నెలల్లోనే తన ఒళ్లో రెండో లాటరీ పడుతుందని బలంగా విశ్వసిస్తున్నాడు. 

Updated Date - 2022-06-28T02:03:40+05:30 IST