రూ. 20,44,52,51,36,00,000... ఇదీ ఓ వినియోగదారుడికి జారీ అయిన నష్ట పరిహారం!

ABN , First Publish Date - 2022-02-15T02:24:48+05:30 IST

బ్రిటన్‌కు చెందిన విద్యుత్ సరఫరా సంస్థ ఓ వినియోగదారుడికి ఊహించని ‘షాకిచ్చింది’. కేవలం కొద్ది రోజుల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయినందుకు ఏకంగా 2 ట్రిలియన్ పౌండ్లు (రూ. 20,44,52,51,36,00,000) పరిహారంగా ఇచ్చింది.

రూ. 20,44,52,51,36,00,000... ఇదీ ఓ వినియోగదారుడికి జారీ అయిన నష్ట పరిహారం!

ఇంటర్నెట్ డెస్క్: బ్రిటన్‌కు చెందిన ఓ విద్యుత్ సరఫరా సంస్థ తన వినియోగదారుడికి ఊహించని ‘షాకిచ్చింది’. కేవలం కొద్ది రోజుల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయినందుకు ఏకంగా 2 ట్రిలియన్ పౌండ్లు (రూ. 20,44,52,51,36,00,000) పరిహారంగా ఇచ్చింది. ఈ మేరకు అతడికి ఓ చెక్ కూడా జారీ చేసింది.  తనకు అందిన చెక్ చూసి.. అతడికి దిమ్మతిరిగిపోయింది.  


ఇటీవల సంభవించిన ఆర్వెన్ తుఫాను బ్రిటన్‌లో పెద్ద విధ్వంసమే సృష్టంచింది. ఇక హేబ్డెన్ బ్రిడ్జి ప్రాంతానికి చెందిన గ్యారెత్ కూడా నానా అవస్థలు పడ్డాడు. కొద్ది రోజుల పాటు అతడు కరెంట్ లేకుండానే గడపాల్సి వచ్చింది. ఈ క్రమంలో విద్యుత్ పంపిణీ సంస్థ నుంచి ఎంతో కొంత పరిహారం వస్తుందని అతడు ఆశించాడు.  కానీ.. 2 ట్రిలియన్ పౌండ్ల భారీ మొత్తం కనిపించడంతో అతడు నోరెళ్లబెట్టాడు. ఆ తరువాత తేరుకుని.. తన చెక్‌ను ఫొటో తీసి ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. దాంతో పాటూ ఓ సరదా కామెంట్ కూడా వదిలాడు.  ‘‘ముందుగా @నార్త్‌పవర్ గ్రిడ్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నా. తుఫాను కారణంగా కొద్ది రోజుల పాటు కరెంటు సరఫరా నిలిచిపోయింది. అయితే.. చెక్ క్యాష్ చేసుకునేముందు మీకో ప్రశ్న.. అసలు ఇంత భారీ పరిహారాన్ని మీరు చెల్లించగలరా’’ అంటూ ట్వీట్ చేశాడు. 


ఈ ట్వీట్ విపరీతంగా వైరల్ అవడంతో అసలు విషయం క్రమంగా వెలుగులోకి వచ్చింది. గ్యారెత్ ఒక్కడే కాకుండా మరికొందరికి ఇలాంటి చెక్కులు అందినట్టు వెలుగులోకి వచ్చింది. కంపెనీలో చోటు చేసుకున్న ఓ సాంకేతిక లోపం కారణంగా ఇదంతా జరిగింది. ఇక  ఈ పోస్టు చూసిన నెటిజన్లు పెద్ద సంఖ్యలో రిప్లైలు ఇచ్చారు.  గ్యారెత్ చెక్ క్యాష్ చేసుకుని ఉంటే బాగుండేదని కొందరు చమత్కరించారు. ‘‘నువ్వు ఆ చెక్‌ను క్యాష్ చేసుకో.  ఒకవేళ విద్యుత్ సంస్థ వారు ఫోన్ చేస్తే.. రీఫండ్ కావాలంటే లిఖిత పూర్వకంగా అర్జీ దాఖలు చేయమని చెప్పు! ఈ అర్జీపై స్పందించేందుకు కనీసం 28 రోజుల గడువు విధించు. అంతేకాకుండా.. ఈ మొత్తంలో ఒక శాతాన్ని ప్రాసెసింగ్ ఫీజు కింద తీసుకో. వారేమైనా అంటే కంపెనీ పాలసీ ఇంతే అని తేల్చి చెప్పు. మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని కంప్యూటర్లు అనుమతించట్లేదను’’ అంటూ ఓ నెటిజన్ కొంటెగా సమాధానమిచ్చాడు. 

Updated Date - 2022-02-15T02:24:48+05:30 IST